కల్యాణం.. వైభోగం..

ABN , First Publish Date - 2022-04-11T06:28:14+05:30 IST

ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

కల్యాణం.. వైభోగం..
స్వామి వారి కల్యాణాన్ని జరుపుతున్న అర్చకులు

  - కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

- రామనామస్మరణతో మారుమోగిన ఇల్లందకుంట 

- రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి గంగుల కమలాకర్‌  

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 10: ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ముందుగా లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరగించారు. అనంతరం ఎదుర్కోళ్ల కార్యక్రమంల నిర్వహించి ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం  తరపున బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగంగుల కమలాకర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి సమర్పించారు.  ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ దంపతులు  స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్‌ స్వామిమూడు గంటల పాటు కల్యాణాన్ని జరిపించారు. 12.10 నిమిషాలకు జీలకర్ర బెల్లం పెట్టగా, 12.46 నిమిషాలకు సీతమ్మ మెడలో శ్రీరామచంద్రమూర్తి మాంగళ్యధారణ కార్యక్రమం  నిర్వహించారు. కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు  హాజరయ్యారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున తమిళనాడు శ్రీరంగపట్నం ఆలయం నుంచి స్వామి వారికి గజమాలను తీసుకొచ్చి అలంకరించారు.  అనంతరం జరిగిన తలంబ్రాల ఘట్టం నయనందకరంగా సాగింది. 

- స్వామివారి సేవలో అధికారులు, ప్రజాప్రతినిధులు...

సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ దంపతులు, కరీంనగర్‌ సీపీ సత్యనారాయణగౌడ్‌, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ దంపతులు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

- భారీ  బందోబస్తు 

స్వామి వారి కల్యాణం సందర్భంగా పోలీస్‌ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు వెంకట్‌రెడ్డి, మహేష్‌గౌడ్‌, ప్రతాప్‌తో పాటు ఎనిమిది మంది సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. 

- స్వల్ప తోపులాట.

మంత్రి గంగుల కమలాకర్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొని వస్తున్న క్రమంలో కార్యకర్తలు ఎక్కువ మంది రావడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ఒరిగింది. పోలీసులు దానిని సరిచేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న సందర్భంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు అప్రమత్తంగా ఉండి వారిని లోపలికి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకోగా వారికి సర్ది చెప్పి లోపలికి పంపించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు జమ్మికుంట రైస్‌ మిల్లర్స్‌, కాటన్‌ మిల్లర్‌ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- భక్తులకు ఉచిత సేవలు

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో జమ్మికుంట నుంచి ఇల్లందకుంట ఆలయం వరకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌ కంకణాల శ్రీలత సురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆరెల్లి జ్యోత్స్న, ఎంపీటీసీ దాంసాని విజయ కుమార్‌లతో పాటు ఆలయ ఈవో సుధాకర్‌, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

- కరీంనగర్‌లో..

కరీంనగర్‌ కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాలను వైభవంగా  నిర్వహించారు. భక్తులు శ్రీసీతారాములస్వామికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

 చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఎంపి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కెబి శర్మ కల్యాణ సందర్భోచిత భక్తి సంగీత విభావరి అలరించింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించిన గీతాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్‌ మాట్లాడుతూ కోవిడ్‌తో రెండేళ్ళుగా ప్రజలు పండుగలను ఆలయాల్లో జరుపుకోలేక పోయారని, కరోనా తగ్గడంతో ప్రజలు ఉత్సాహంగా పండుగలను జరుపుకుంటున్నారని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

ఫ హెలీప్యాడ్‌గ్రౌండ్‌ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో మేయర్‌ సునీల్‌రావు-అపర్ణ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. విద్యానగర్‌ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక కార్పొరేటర్‌ కొండపల్లి సరితా సతీష్‌, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరాంభద్రయ్య, గుడిపాటి శంకర్‌రెడ్డి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. 

Updated Date - 2022-04-11T06:28:14+05:30 IST