మమత బెనర్జీపై విమర్శనాస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2020-05-28T21:27:08+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వల్ల విధించిన అష్ట దిగ్బంధనం ఆంక్షలు ఎప్పుడు

మమత బెనర్జీపై విమర్శనాస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ

కోల్‌కతా : కోవిడ్-19 మహమ్మారి వల్ల విధించిన అష్ట దిగ్బంధనం ఆంక్షలు ఎప్పుడు తొలగిపోతాయా? అని పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ ఎదురు చూస్తోంది. ఈ ఆంక్షలు తొలగిన వెంటనే, అంఫన్ తుపాను బీభత్సం వల్ల బాధితులైనవారికి అండగా నిలవడంలో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. 


బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం టీఎంసీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు త్రిముఖ వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేసింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంపై కోర్టులను ఆశ్రయించడం, అధికార పార్టీ టీఎంసీపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, తాగునీరు, విద్యుత్తు సరఫరా విషయంలో ప్రజల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం - ఈ మూడు విధాలుగా మమత బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


2021లో జరగబోయే పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పదునైన వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.


2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకోవడంతో, రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలనే ఉత్సాహం బీజేపీ నాయకుల్లో పెరిగింది.


ఈ నెల 20న అంఫన్ తుపాను సృష్టించిన బీభత్సం వల్ల 80 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రజలను ఓదార్చేందుకు తమను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


Updated Date - 2020-05-28T21:27:08+05:30 IST