మోదీ, దీదీ.. అమీ తుమీ

ABN , First Publish Date - 2021-03-08T07:51:00+05:30 IST

బీజేపీ మోదీ వైపు మొగ్గు చూపడంతో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక అస్త్రాన్ని బయటకు తీసింది. దేశం మొత్తానికీ ‘దీదీ’గా పరిచయమైన మమతా బెనర్జీని ‘బెంగాల్‌ బేటీ (బెంగాల్‌ బిడ్డ)’గా చిత్రీకరిస్తూ.. ‘బెంగాల్‌ కో అపనీ బేటీ చాహియే (బెంగాల్‌కు తన బిడ్డే కావాలి)’ అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది. 2015లో బిహార్‌లో నితీశ్‌ కుమార్‌కు పగ్గాలు...

మోదీ, దీదీ.. అమీ తుమీ

  • మమత వర్సెస్‌ మోదీగా బెంగాల్‌ ఎన్నికలు
  • ‘స్థానిక’ అస్త్రాన్ని ప్రయోగించిన ప్రశాంత్‌కిశోర్‌
  • ‘దీదీ’కి ‘బెంగాల్‌ బేటీ’గా కొత్త అస్తిత్వం
  • ఆ ట్రాప్‌లో పడ్డ బీజేపీ.. ‘బేటీ’పైనే చర్చ
  • బెంగాల్‌ ఎన్నికలపై నిపుణుల విశ్లేషణ

అమీ తుమీ.. ‘నువ్వా నేనా’ అనడానికి మనం వాడే బెంగాలీ మాట ఇది! ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఇప్పుడు అదే సీన్‌ కనపడుతోంది. అది.. ప్రధాని నరేంద్ర మోదీకి.. ప్రస్తుతం దేశంలోనే ఏకైక మహిళా ముఖ్యమంత్రి అయిన మమతా దీదీకి నడుమ సాగుతున్న ‘అమీ తుమీ’ వార్‌. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ మోదీని ఎదిరించాలన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. టీఎంసీ గెలిస్తే.. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ర్యాలీ కావడానికి మమత రూపంలో ఒక నాయకురాలు దొరుకుతుంది. అందుకే.. మోదీ, దీదీ.. ఇద్దరూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 



వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కలవాలా వద్దా అనేది బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంది. మరీముఖ్యంగా.. తమిళనాట బీజేపీకి ఇప్పట్లో నేరుగా ప్రయోజనం లభించే పరిస్థితి లేదు. కానీ బెంగాల్‌లో మాత్రం ఎలాగైనా పాగా వేసేందుకు మోదీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే.. బెంగాల్‌లో పోరాటాన్ని మోదీకి, మమతకు నడుమ జరుగుతున్న పోరాటంగా చిత్రీకరించి.. మోదీకున్న ప్రజాదరణను సొమ్ము చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఇదేమీ కొత్త వ్యూహం కాదు. 2014 నుంచి చాలా ఎన్నికల్లో బీజేపీ చేసింది ఇదే. ఈ ఎన్నికలకు ముందు కూడా ఎవరైనా ప్రముఖుణ్ని తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటించడమా లేక యథాప్రకారం మోదీనే ట్రంప్‌ కార్డుగా ఉపయోగించడమా అనే సందేహంతో కొన్నాళ్లు ఊగిసలాడింది. చివరకు మోదీ వైపే మొగ్గుచూపింది. ఈ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు మమతా బెనర్జీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.  దీంతో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు కాస్తా మోదీ వర్సెస్‌ దీదీగా మారిపోయింది. 


టీఎంసీ ప్రతి వ్యూహం..

బీజేపీ మోదీ వైపు మొగ్గు చూపడంతో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక అస్త్రాన్ని బయటకు తీసింది. దేశం మొత్తానికీ ‘దీదీ’గా పరిచయమైన మమతా బెనర్జీని ‘బెంగాల్‌ బేటీ (బెంగాల్‌ బిడ్డ)’గా చిత్రీకరిస్తూ.. ‘బెంగాల్‌ కో అపనీ బేటీ చాహియే (బెంగాల్‌కు తన బిడ్డే కావాలి)’ అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది. 2015లో బిహార్‌లో నితీశ్‌ కుమార్‌కు పగ్గాలు దక్కేలా చేసిన వ్యూహమిది. అప్పట్లో నీతీశ్‌ ప్రచార నిర్వాహకుడైన ప్రశాంత్‌ కిశోర్‌.. ‘బిహారీ యా బాహరీ(బిహారీనా? లేక బయటి నుంచి వచ్చే ఆదేశాలతో పాలించేవారా?) అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీకి వేరే గత్యంతరం లేక దీనిపైనే మాట్లాడాల్సి వచ్చింది. దీనిపై భారీగా చర్చ జరగడంతో బిహారీల్లో స్థానిక భావన పెరిగి.. నీతీశ్‌, లాలూల కూటమి అయిన ‘మహాగడ్బంధన్‌’ను గెలిపించారు. ఆ తర్వాత నీతీశ్‌ కుమార్‌.. మహాగడ్బంధన్‌ నుంచి బయటపడి బీజేపీతో జట్టు కట్టడం వేరే విషయం. ఇప్పుడు మమత కూడా అదే బాటలో పయనిస్తూ ‘బెంగాల్‌ బేటీ’పైనే చర్చ జరిగేలా చూస్తున్నారు. బిహార్‌లోలాగానే బెంగాల్‌లో కూడా బీజేపీ ఆ ట్రాప్‌లో పడినట్టు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బిహార్‌ అనుబవాన్ని మరచి.. ‘బేటీ’ అంశంపై బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారు. సాక్షాత్తూ మోదీనే హూగ్లీ ర్యాలీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర పథకమైన జల్‌ జీవన్‌ మిషన్‌ను (ఇంటింటికీ నల్లా నీరు) బెంగాల్‌లో అమలు చేయట్లేదని.. ‘బెంగాల్‌ బేటీ’లకు స్వచ్ఛమైన నీరు తాగే హక్కు లేదా అని ప్రశ్నించారు. బీజేపీకి చెందిన స్థానిక చానల్‌ ఒకటి.. బెంగాల్‌నిజమైన బిడ్డ ఎవరు మోదీయా లేక దీదీయా అని ప్రశ్నించింది. దీనికితోడు.. మమతా బెనర్జీ తన ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ బెంగాల్‌ గొప్పదనాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బ్రిటిషర్లు పరిపాలించే సమయంలో కోల్‌కతానే రాజధానిగా ఉండేదని.. ఇప్పుడు కోల్‌కతాను ఎందుకు రెండో రాజధానిగా చేయరని ప్రశ్నిస్తున్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ లాగానే బెంగాలీలు అవమానాలను సహించరంటూ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. నేతాజీ జయంతిని కేంద్రం ‘పరాక్రమ్‌ దివ్‌స’గా ప్రకటిస్తే.. అది మరీ హిందీ పదంలా ఉందని, దానికి బదులు ‘దేశ్‌ నాయక్‌ దివస్‌’ లేదా ‘దేశ్‌ ప్రేమ్‌ దివ్‌స’గా ఎందుకు మార్చకూడదని ప్రశ్నిస్తున్నారు. బెంగాలీ గౌరవం, స్థానిక అంశాల చుట్టూనే ప్రచారం సాగేలా చేస్తున్నారు. దీంతో.. బెంగాలీల మొగ్గు సహజంగానే మమత వైపు ఉంటోంది.     


దీదీ కాదని బేటీ ఎందుకు?

ప్రజలందరికీ దీదీగా పరిచయమైన మమత ‘బెంగాల్‌ బేటీ’గా ఎందుకు మారింది?  దీదీ అంటే అక్క. మన కంటె వయసులో పెద్ద అయి ఉండి, మనను నడిపించే వ్యక్తి. బేటీ అంటే మనం కాపాడుకోవాల్సిన వ్యక్తి. బయటి నుంచి వచ్చే బీజేపీ నుంచి మన ‘బేటీ’ని కాపాడుకోవాలనే సెంటిమెంటు అంతర్లీనంగా బెంగాలీల్లో రగిలింపజేసేందుకే టీఎంసీ ఈ వ్యూహాన్ని పన్నినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. ఈ చర్చను విస్తృతంగా తెరపైకి తేవడం ద్వారా.. ‘ఎన్నికలు జరుగుతున్నది బెంగాల్‌ అసెంబ్లీకి. కాబట్టి ఇందులో మోదీకి ఏ సంబంధం లేదు’ అనే విషయాన్ని బెంగాలీలకు గుర్తుచేసేందుకే ఈ వ్యూహం అంటున్నారు. చూడబోతే.. ఈ వ్యూహం ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఏబీపీ సీ-ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలే రుజువు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-03-08T07:51:00+05:30 IST