Abn logo
Nov 26 2021 @ 04:09AM

‘పశ్చిమ’ డీఎఫ్‌వోకు హైకోర్టులో ఊరట

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో పశ్చిమగోదావరి(ఏలూరు డివిజన్‌)జిల్లా డీఎ్‌ఫవో యశోదబాయికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు రెండు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఆగస్టు 10న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. కన్నాపురం అటవీ రేంజ్‌ పరిధిలోని కలప, టేకు రవాణా కోసం ఈ ఏడాది జనవరి 12న అధికారులు ప్రకటన ఇచ్చారు. ఏలూరుకు చెందిన శరత్‌రెడ్డి టెండర్‌లో పాల్గొని బిడ్‌ వేశారు. ఆ బిడ్‌ తెరవకుండానే అధికారులు పనులు ప్రారంభించడంతో శరత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు పనులు చేపట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో పిటిషనర్‌ ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారించిన సింగిల్‌ జడ్జి... డీఎ్‌ఫవోకి కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించారు. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ డీఎఫ్‌వో అప్పీల్‌ దాఖలు చేశారు.