Abn logo
Jun 25 2021 @ 13:45PM

పశ్చిమగోదావరి జిల్లాలో విజయడైరీ కార్మికుల ధర్నా

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో విజయడైరీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. విజయ డైరీ కార్మికులను అమూల్ డైరీలో కొనసాగించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులు చేస్తున్న ధర్నాకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు,  మండల టీడీపీ నాయకులు  రేగంటి రాంబాబు సంఘీభావం తెలిపారు. కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర మాట్లాడుతూ... ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి విజయ డైరీలో పనిచేస్తున్న 90 మంది కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు.  వారిని ఈ నెల 30 తర్వాత  విధుల నుంచి తొలగిస్తున్నామని నోటీసు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులను తొలగించడమేమిటని ప్రశ్నించారు. అంతేకాక మొన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆర్టీసీ కార్మికులను, వాలంటీర్లను ఉద్యోగులుగా చూపడం దారుణమన్నారు. జి కొత్తపల్లి విజయ డైరీలో పనిచేస్తున్న 90 మందిని తొలగిస్తే వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 400 మంది రోడ్డున పడతారని తెలిపారు. కార్మికులకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకుని వారిని విధుల్లోకి తీసుకోవాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.