Abn logo
Jan 16 2021 @ 01:05AM

కొట్లాడి అలసిన పందెం కోళ్లు

కోట్ల రూపాయల కోడి పందేలు

బరితెగించి పందెం కట్టారు

విచ్చలవిడిగా జూదం, గుండాట


కోడి ఇష్టానుసారం కత్తిదూసింది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు, జూదం నిర్వహించనివ్వబోమని పోలీసులు హెచ్చరికలు చేసినా మూడు రోజులపాటు విచ్చలవిడిగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా. కాలికి కత్తి కట్టి కదన రంగంలో దూకిన కోడి కసితీరా కొట్లాడింది. గెలిచినా రక్తం కారింది. ఓడితే పకోడి అయింది. బరుల వద్ద గుండాట, పేకాట యథేచ్ఛగా సాగింది. జూదాన్ని అడ్డుకోవడం ఎలా ఉన్నా కనీసం ప్రశ్నించే వారు లేరు. మూడో రోజు మాత్రం పేకాట శిబిరాలపై పోలీసులు ప్రతాపం చూపించారు. కోడి పందేల బరి ఏర్పాటైనప్పుడే కొన్ని కేసులు ఇవ్వాలని ఒప్పందం జరిగినట్లు కొందరు చెబుతున్నారు.


కాళ్ళ మండలంలోని సీసలి, కోపల్లె, పెదఅమిరం, జువ్వలపాలెం, మాల వానితిప్ప, ఏలూరుపాడు, కాళ్ళకూరు, దొడ్డనపూడి, కాళ్ళ తదితర గ్రామా ల్లో జరిగిన పందాల్లో కోట్లాది రూపాయిలు చేతులు మారాయి.. చిన్నా పెద్దా తేడా లేకుండా పొరుగు రాష్ట్రాల వారితో సహా పలువురు మహిళలు, యువత కోడిపందేల బరుల వద్ద సందడి చేశారు. సీసలిలో నిర్వహించిన వీఐపీ బరిలో మూడు రోజుల్లో సుమారు 5 కోట్లు పందేలు జరిగినట్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక్కడ ఒక్కొక్క పందెం రూ.3లక్షల నుంచి 15 లక్షల వరకు జరిగినట్లు చెబుతున్నారు. భీమవరం మండలంలో సం క్రాంతి పండుగ మూడు రోజులు కోడిపందేలు జోరుగా సాగాయి.


దిరుసుమర్రు, యనమదుర్రు, తుందుర్రు తదితర ప్రాంతాల్లో పందేలు వేశారు. పెదగరువులో మూడు రోజుల్లో కోటి రూపాయిలు పైగా చేతుల మారాయి.  ఉండి మండలంలో మూడు రోజులు కోడిందేలు, జూదం, గుండాట హో రెత్తాయి. ఉండి, చెరుకువాడ, యండగండి, చిలుకూరు, మహదేవపట్నం, పాములపర్రు, కోలమూరు గ్రామాలలో పందేలు కొనసాగాయి.  యలమం చిలి మండలంలో కోడి పందేలు, గుండాట యధేచ్ఛగా నిర్వహించారు. కలగంపూడి, వడ్డిలంక, కడిమిపుంత (గుంపర్రు), యలమంచిలి తదితర గ్రామాల్లో జోరుగా కొనసాగాయి. పాలకొల్లు రూరల్‌ స్టేషన్‌ పరిధిలో కోడి పందేలను అనుమతించలేదు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంది గుంట, పూలపల్లి గ్రామాల్లో జోరుగా సాగాయి. మూడు రోజులు రాత్రి వేళ గుండాటలు జోరుగా సాగాయి. భీమవరం పట్టణ పరిధిలో కోడి పందేలను సీఐ రాయుడు విజయ్‌కుమార్‌ నిలువరించారు. నరసాపురం మండలంలో లక్ష్మణేశ్వరంలో మూడు, వేములదీవిలో రెండు, చిట్టవరం, తూర్పుతాళ్ళు, సారవ గ్రామంలో పందేలు జోరుగా సాగాయి. లక్ష్మణేశ్వరం బరి వద్ద డాన్స్‌ బేబి వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు. గుండాట విచ్చల విడిగా సాగింది. మొగల్తూరు మండలంలోని కెపిపాలెం, పేరుపాలెం, వార తిప్ప, ముత్యాలపల్లి, కాళీపట్నం, దారితిప్ప, మొగల్తూరు, రామన్నపాలెం, కొత్తపాలెం గ్రామాల్లో కోడి పందేలు సాగాయి. మొగల్తూరులో రెండు బరుల వద్ద జనం లేకపోవడంతో గురువారమే మూసివేశారు. కోడి పందేలతో పాటు గుండాట, కోతాట రాత్రి పగలు సాగాయి. కొత్తపాలెంలో నిర్వహించిన పందాలకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెండు రోజుల పాటు హాజరయ్యారు. ఆకివీడు మండలంలోని అజ్జమూరు, గు మ్ములూరు, సిద్దాపురం, దుంపగడప, ఆకివీడులలో కోడిపందేలు సాగినా పందెగాళ్లు స్వల్ప సంఖ్యలో రాడంతో వెలవెలబోయాయి. వీరవాసరం మండలంలో కొణితివాడ, నౌడూరు, వడ్డిగూడెం, మత్స్యపురి గ్రామాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. పందేలను తిలకించడానికి అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారిని ఈ ప్రాంత వాసులు ఆహ్వా నించారు. పెనుమంట్ర మండలంలో జోరుగా కోడిపందేలు సాగాయి. బరుల వద్ద కోతాట, గుండా భారీగా నిర్వహించారు. పాలకోడేరు మండ లంలో గొల్లల కోడేరు, విస్సాకోడేరు, పాలకోడేరు, శృంగవృక్షం, పెన్నాడలో పందేలు భారీగా వేశారు. గురువారం రాత్రి శృంగవృక్షం కోడిపందేల బరిలో గొడవ జరగడంతో ఒకరికి కత్తి గాయమైంది.

కాళ్ళ / నరసాపురం / రూరల్‌ / ఉండి / ఆకివీడు రూరల్‌ / పాలకొల్లు రూరల్‌ /

భీమవరం రూరల్‌ / క్రైం / మొగల్తూరు / వీరవాసరం / పెనుమంట్ర / పాలకోడేరు

కాళ్ళ మండలం పెదఅమిరం బరి వద్ద పందెం పుంజులు


మొగల్తూరు మండలం కొత్తపాలెం బరి వద్ద కార్లు పార్కింగ్‌


భీమవరం రూరల్‌ మండల పరిధిలో గుండాట


నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం బరి వద్ద డాన్స్‌ బేబీ డాన్స్‌


Advertisement
Advertisement
Advertisement