వంటింట్లో ధరల మంట

ABN , First Publish Date - 2021-03-02T05:17:37+05:30 IST

ప్రసన్న కుమార్‌ తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. నెలకు రూ. 12 వేలు జీతం. ఇంటి అద్దె రూ.4 వేలు చెల్లిస్తున్నారు. ప్రతినెల నిత్యావసర సరు కులకు గతంలో రూ.2500 అయ్యేది.

వంటింట్లో ధరల మంట

చుక్కలంటుతున్న    నిత్యావసరాల ధరలు

రవాణా భారంతో మరింత ప్రియం

తలకిందులవుత్ను నెలవారీ బడ్జెట్‌ 

సామాన్య ప్రజలు గగ్గోలు


    ప్రసన్న కుమార్‌ తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో  పనిచేస్తున్నారు. నెలకు రూ. 12 వేలు జీతం. ఇంటి అద్దె రూ.4 వేలు చెల్లిస్తున్నారు. ప్రతినెల నిత్యావసర సరు కులకు గతంలో రూ.2500 అయ్యేది. ఇప్పుడు గ్యాస్‌, పప్పులు, వంట నూనెల ధరలు పెరిగిపోవడంతో నెల ఖర్చు రూ.4 వేలు దాటిపోతోంది. ఆపైన పాలు, పెరుగు కోసం మరో రూ.1500 అవుతోంది. మొత్తంపైన ప్రసన్నకుమార్‌ అధిక ధరలతో లోటు బడ్జెట్‌కు చేరుకున్నాడు. పెరిగిన ఖర్చులతో అంచనాలు తల్లకిందులయ్యాయి.కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్ట మవుతోంది. సామాన్య ప్రజలందరి జీవన పరిస్థితులు ఇప్పుడు ఇదే మాదిరిగా ఉన్నాయి. 

 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

సగటు మహిళకు వంటింటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలు పెరగడంతో రవాణా భారం అధిక మైంది. ఆ ప్రభావం నిత్యావసర సరకులపై పడుతోంది. పప్పుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వంటనూనెలు సలసల కాగుతు న్నాయి. కూరగాయలు మిడిసి పడుతున్నాయి. మొత్తంపైన సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌ అనూహ్యంగా పెరిగిపోయింది. గతంలో సరకుల కోసం నెలకు రూ.4 వేలు అయ్యేది. ఇప్పుడు ఒక కుటుంబానికి రూ.6 వేలు అవుతోంది. కేవలం ధరలు పెరుగుదలతో అదనపు బడ్జెట్‌ పెట్టాల్సి వస్తోంది. దీనికితోడు గ్యాస్‌ ధరలు పెరిగాయి. ప్రస్తుతం వంట గ్యాస్‌ రూ.850లకు చేరిపోయింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గిపోయింది. గతంలో వంట గ్యాస్‌ రూ.600 ఉండేది. కేంద్ర ప్రభుత్వం రూ.100 రాయతీ ఇచ్చేది. గ్యాస్‌ పెరుగుతూ వస్తే రాయితీ పెంచేది. వినియోగదారులపై పెద్దగా భారం పడేది కాదు. ఇప్పుడు వంట గ్యాస్‌ ఎంత ఉన్నాసరే రాయితీ మాత్రం రూ.10 నుంచి రూ.15 వరకే ఇస్తున్నారు. దాంతో సామాన్య కుటుంబాలకు వంట గ్యాస్‌ పెను భారం అవుతోంది. ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం ఉన్న నిత్యావసర సరకుల ధరలకు, ప్రస్తుత ధరలకు పొంతన లేకుండా పోయింది. పప్పుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర, తెలం గాణల నుంచి పప్పులు దిగుమతి అవుతుంటాయి.

డీజల్‌ ధరల పెరుగుదల ప్రభావం

ఇంధన ధరలు పెరుగుదలతో రవాణా భారం అధికమైంది. పప్పుల ధరల పెరుగదలకు ఇది కూడా కారణమవుతోంది. కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు, శనగపప్పు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇవి మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజల్‌ ధరల పెరుగుదల నిత్యావసర సరకులపై మున్ముందు మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా అదే మాదిరిగా పెరుగుతున్నాయి. పంట దిగుబడులు తగ్గి పోవడం ఒక కారణమైతే, రవాణా ఖర్చులు అధికం కావడంతో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టలేదు. వాస్తవానికి జనవరి నెలలో ఉల్లి ధర సాధారణ స్థాయికి చేరుకోవాలి. సగటున రూ. 20 నుంచి రూ. 30 మధ్యలో ఉండాలి. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి రూ.50 ధర పలుకుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాల కిరాయిలు కూడా పెంచేశారు. ఆ ప్రభావం వీటిపై పడుతోంది. కూరగాయల ధరలు కూడా తినేలా కనిపించడం లేదు.. వీటికితోడు ఆయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతు న్నాయి.ఆరు నెలల క్రితం పామాయిల్‌, సన్‌ ఫ్లవర్‌ ధరలు సాధారణ స్థాయిలో ఉండేవి. ఇప్పుడు లీటరు ప్యాకెట్‌పై ఏకంగా రూ.50 పెరిగింది. సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌కు ఇతర దేశాలపై అధికంగా ఆధార పడుతున్నారు. మలేషియా, థాయి లాండ్‌, ఇండోనేషియాల నుంచి పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలను దిగుమతి చేస్తుంటారు. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది. దానికితోడు రవాణా వ్యయం అధికం అవడంతో వంటనూనెల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.             


      గతంలో     ఇప్పుడు

కందిపప్పు     రూ.90     రూ. 110

మినపపప్పు   రూ.80      రూ.100

పెసరపప్పు    రూ.100    రూ. 110

శనగ పప్పు    రూ. 60    రూ. 75

పామాయిల్‌   రూ. 80     రూ. 120

సన్‌ఫ్లవర్‌     రూ. 100    రూ. 150

వేరుశనగ     రూ. 120    రూ. 165 


Updated Date - 2021-03-02T05:17:37+05:30 IST