కేసుకు లక్షలు

ABN , First Publish Date - 2021-05-18T05:52:12+05:30 IST

కరోనా ప్రైవేటు వైద్యం ఖరీదైంది. ఆసుపత్రి స్థాయిని బట్టి కనీసం రెండు నుంచి పది లక్షలకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. కాస్త స్థోమత ఉన్నవారు ధైర్యంగా ముందడుగు వేస్తుంటే.. మధ్య తరగతి కుటుంబాలు లక్షలు అప్పులు చేసి మరీ వెళుతున్నారు.

కేసుకు లక్షలు

ఖరీదైన కరోనా వైద్యం 

ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్యాకేజీలు 

అయినా బెడ్‌ దొరికితే మహా భాగ్యం

అప్పులు చేసి మరీ చికిత్స

ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లోనూ అధిక ధరలే 

మెరుగైన వైద్యం కోసమని కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులకు..


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

తాడేపల్లిగూడెంకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి విజయవాడలో చికిత్స పొందారు. ఆక్సిజన్‌ అంత అవసరం లేకున్నా వైద్యానికి రూ.4 లక్షలు ఖర్చు అయ్యింది. 

ఇదే పట్టణానికి చెందిన వెంకట్రామయ్య ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా రూ.3 లక్షలు ఖర్చు అయ్యింది. మరింత మెరుగైన వైద్యానికి హైదరా బాద్‌కు వెళ్లారు. ఇందుకు మరిన్ని లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. 

భీమవరానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పది రోజుల చికిత్సకైన ఖర్చు అక్షరాల ఏడు లక్షలు. డబ్బు పోతే పోయింది. ప్రాణం దక్కిందని ఊపిరి పీల్చుకుంటున్నాడు. 

భీమవరానికే చెందిన మరో ప్రముఖుడు హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని 12 రోజులకు రూ.6 లక్షల బిల్లు చెల్లించుకున్నారు. భీమవరంలోను వైరస్‌ తీవ్రత ఆధా రంగా బిల్లు లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. 

తాడేపల్లిగూడెంలో పోతురాజనే వ్యాపారి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జిల్లాలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మొత్తానికి వ్యాధి నుంచి బయటపడ్డారు. కోలుకునే సరికి అయిన ఖర్చు రూ.10 లక్షలు.


కరోనా ప్రైవేటు వైద్యం ఖరీదైంది. ఆసుపత్రి స్థాయిని బట్టి కనీసం రెండు నుంచి పది లక్షలకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. కాస్త స్థోమత ఉన్నవారు ధైర్యంగా ముందడుగు వేస్తుంటే.. మధ్య తరగతి కుటుంబాలు లక్షలు అప్పులు చేసి మరీ వెళుతున్నారు. ఐసీయూ, ఆక్సిజన్‌ సరఫరా వున్న ఆసుపత్రుల్లో చేరాలన్న ఆత్రుత బాధితుల్లో ఏర్పడింది. ప్రభుత్వం ఓ వైపు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లను నిర్వహిస్తోంది. ఆరోగ్యశ్రీ ఆసు పత్రుల్లోనూ ఉచితంగానే వైద్య సేవలందిస్తోంది. ప్రభుత్వా సుపత్రుల్లో బెడ్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వైద్యం తప్పడం లేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆస్తులమ్మి అయినా వ్యాధి నయం చేసుకోవాలన్న తలంపుతో ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో అనధికారికంగానే ఆసుప త్రుల్లో వైద్యం నిర్వహిస్తున్నా సరే అక్కడే వైద్యం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక బెడ్‌ పొందాలంటే రోజుకు కని ష్టంగా రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. దీంతోపాటు వైద్య ఖర్చులు భరించాలి. మొత్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేవారు లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో అనధికారికంగా ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారని విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంత ఖర్చయినా వెనుకాడకుండా బాధితులు ఎగబడుతున్నారు. కరోనా అంటే గుండెల్లో భయం గూడు కట్టుకుంటోంది.  అదే ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరేలా చేస్తోంది. 


సీటీ స్కాన్‌లో స్కోరే ప్రామాణికం

ప్రైవేటు ఆసుపత్రుల్లోనే సీటీ స్కాన్‌లో ఉండే స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గరిష్టంగా 15 లోపు స్కోర్‌ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్‌ కల్పిస్తున్నారు. అంతకుమించి ఉంటే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకోవడానికి నిరాకరి స్తున్నాయి. లక్షణాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో కొందరు మందులు వాడడం లేదు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే కిట్‌లను వాడుతున్నారు. దగ్గు ఉన్నా సరే దానికి సరపడా ఔషధాలను వినియోగించడం లేదు. దీంతో ఊపిరితిత్తుల్లో వైరస్‌ అధికమవుతోంది. సిటీ స్కాన్‌లో స్కోర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఇటువంటి వారికి విజయవాడ వంటి నగరాల్లోనే బెడ్‌లు లభ్యమవుతున్నాయి.  


ఇతర జిల్లాలవైపు చూపు

జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరక్కపోవడంతో సిఫారసులు చేయాల్సి వస్తోంది. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ముందుగానే లక్షలు చెల్లించి చేరుతున్నారు. ఇతర జిల్లాల్లో చేరితో ఆర్థిక భారం మరింత అధికమవుతోంది. అయినా ఆక్సిజన్‌ స్థాయి పడిపోతుందన్న ఆందోళనతో ప్రైవేటు వైద్యం వైపు ఆసక్తి చూపుతున్నారు. 


ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనూ ప్యాకేజీలే 

జిల్లాలో ప్రభుత్వం 34 ఆరోగ్యశ్రీ ఆసు పత్రులను గుర్తించింది. అందులో కరోనాకు చికిత్స అందజేయాలని నిర్ణయం తీసుకుం ది. కానీ కొన్ని ఆసుపత్రులు ప్యాకేజీలను అమలు చేస్తున్నాయి. ఏలూరు, భీమవరం, తణుకులోని కొన్ని ఆసుపత్రులు ప్యాకేజీలను వసూలు చేస్తున్నాయి. రోజుకు గరిష్టంగా రూ.1.50 లక్షలు వసూలు చేసే ఆసుపత్రులు ఉన్నాయి. నిర్ధారించిన ధరలను వసూలు చేయాలని ఒక దశలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొన్ని తాము సేవలు అందించలేమని స్పష్టం చేశాయి. భీమవరంలో ఇలా రెండు ఆసుపత్రులు వైద్యం అందించేందుకు నిరాకరించాయి. తమ వద్దకు ఇతర రోగాలతో వచ్చే బాధితులు రాకుండా పోతున్నారని కారణం చూపి కరోనా చికిత్స నుంచి వైదొలగాయి. మిగిలిన ఆసుపత్రుల్లో ఇప్పటికీ ప్యాకేజీలు అమలు జరుగుతున్నాయి. అయినా సరే బెడ్‌ దొరకడమే మహా భాగ్యమన్న రీతిలో కరోనా బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 


కరోనా మందుల ధరలు రెట్టింపు

 కృత్రిమ కొరత.. బ్లాక్‌ మార్కెట్‌

నరసాపురం, మే 17 : కొందరు వ్యాపారులు కరోనా మం దుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలతో బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని నరసాపురం, పాల కొల్లులతోపాటు చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెమెడిసివిర్‌ ఇంక్షన్‌తోపాటు కరోనా నియంత్రణకు వినియో గించే మరికొన్ని మందులు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నా రు. మరికొందరు కృతిమ కొరత సృష్టించడంతో కొన్ని మందు ల ధరలు రెట్టింపయ్యాయి. వైద్యులు కరోనా బాధితులకు ఫాబిఫ్లూ టాబ్లెట్‌లు రాస్తున్నారు. గతంలో గ్లాన్‌మార్క్‌ కంపెనీ కి చెందిన 36 ట్యాబ్లెట్‌ ధర రూ.1,250. మందుల దుకాణాల్లో డాక్టర్‌ చీటితోపాటు విధిగా ఆధార్‌ కార్డు ఇస్తే వీటిని విక్రయిం చేవారు. ప్రస్తుతం ఈ కంపెనీ మందులు మార్కెట్‌లో దొర కడం లేదు. డీలర్ల వద్ద స్టాక్‌ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించామని కొందరు వ్యాపారులు ఇదే ట్యాబ్లెట్‌లను రూ.2,200 ధరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌ గుర్తించి కొంద రు దీనికి ప్రత్యామ్నాయంగా మరో కంపెనీ ట్యాబ్లెట్లను ఢిల్లీ, ముంబయి నుంచి తీసుకొచ్చి విక్రయిస్తు న్నారు. పది ట్యాబ్లెట్‌ లను రూ.1,100 ధరకు విక్రయిస్తున్నారు. కోర్సు వాడాలంటే రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. కొవిడ్‌ బాధితులకు రక్తం గడ్డకట్టకుండా వాడే ఇంజక్షన్‌లో ఎనోక్స పారిన్‌ ఒకటి. 40 ఎంజీ ఇంక్షన్‌ ధర రూ.440, 60ఎంజీ రూ.620. ప్రస్తుతం ఈ ఇంజక్షన్లు బయట మార్కెట్‌లో దొరకడంలేదు. సరఫరా లేదం టూ ఆధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్‌ షాపుల్లో మాత్రమే రూ.వెయ్యి ధరకు లభ్యమవుతున్నాయి. కొవిడ్‌ బాధితులకు రక్తం ఎంత శాతం గడ్డ కట్టింది తెలుసుకునేం దుకు డీడైమర్‌ పరీక్ష చేస్తారు. ప్రస్తుతం ఈ టెస్ట్‌కు అవసర మైన కిట్లు దొరకని పరిస్థితి. ల్యాబ్‌ నిర్వా హకులు అధిక ధర కు కొనుగోలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల నాశిరకమైన కిట్లు దొరుకుతున్నాయి. అత్యవసరం కావడంతో వీటినే కొన్ని ల్యాబ్‌ లు వినియోగిస్తున్నాయి. చేతి గ్లౌజుల ధరలు పెరిగాయి. గతంలో బాక్స్‌ రూ.300 కాగా ప్రస్తుతం రూ.800 పెరిగింది.

Updated Date - 2021-05-18T05:52:12+05:30 IST