12 దాటితే లాక్‌

ABN , First Publish Date - 2021-05-05T06:04:41+05:30 IST

విరుచుకుపడుతున్న కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి రానుంది.

12 దాటితే లాక్‌

మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు

ప్రజా రవాణాకు బ్రేకులు

అత్యవసరాలకు మాత్రమే అనుమతి

 బయటకు వస్తే కఠిన చర్యలు

జిల్లాలో సిద్ధమైన యంత్రాంగం


(తాడేపల్లిగూడెం, ఆంధ్రజ్యోతి ) : 

విరుచుకుపడుతున్న కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే  వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. బుధవారం నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. దీనికోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.  అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. మెడికల్‌ షాపులు, అంబులెన్సులు,   హాస్పటల్స్‌,  ఇతర ప్రభుత్వ సేవలు,  మీడియాకు మినహాయింపు ఇచ్చారు.

జిల్లాలో బుధవారం నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.రాష్ట్ర మంత్రి మండలి కూడా ఈ విషయంపై చర్చించింది. పట్టణాలు, పల్లెల్లోనూ పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంది. 12 తర్వాత ఎటువంటి ప్రయాణాలు చేయడానికి వీలు లేదు. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. వాస్తవానికి జిల్లాలో కేసులు పెరుగుతుం డడంతో స్వచ్ఛందంగా వ్యాపారులు పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ వచ్చారు. తాడేపల్లిగూడెం, భీమవరం, పట్టణంతో పాటు పల్లెల్లోనూ సాయంత్రం వేళ షాపులను మూసివేస్తున్నారు.ప్రస్తుతం ప్రభుత్వమే పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు పల్లెల్లోనూ 12 గంటల తరువాత  కర్ఫ్యూ అమలు జరగనుంది. మార్కెట్‌ తెరచే సమయంలోనూ అవసర మైన వారు మాత్రమే బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.    


గతేడాది ఇదే సమయంలో...

గతేడాది జిల్లాలో ఇదే సమయంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు జరిగింది. కేవలం కిరాణాషాపులు, పాల ఉత్పత్తులు, మందుల షాపులు, కూరగాయల మార్కెట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అవి కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కొంత కాలం నడిపారు. అప్పట్లో జిల్లాలో గరిష్టంగా రోజుకు 1200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయినా ప్రజలు భయంబ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వం పటిష్టమైన లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఈ ఏడాది పరిస్థితి మరింత తీవ్ర మైంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కేసులు 2 వేల మార్కును దాటే శాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే తొలిరోజుల్లో తక్కువ కేసులు నమో దయ్యాయి. ఇతర జిల్లాల్లో ప్రతీ రోజు వందల కేసులు నమోదైతే పశ్చిమలో 100 లోపే కేసులు నమోద య్యేవి. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటువంటిది రెండు వారాల వ్యవధిలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. కేసులు అమాంతం పెరిగిపోయాయి. పట్టణాల్లో మరింత తీవ్రమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు పట్టణాల్లో సాయంత్రం 6 గంటల తరువాత షాపులు మూసివేయాలనే పరిమితి విధించుకున్నారు. అయినా కరోనా కట్టడి కాలేదు. దాంతో ప్రజా రవాణా అరికడితేనే కరోనా కట్టడి అవుతుందని అధికార యంత్రాంగం భావిస్తున్నది. అందుకు అనుగుణంగా బుధవారం నుంచి లాక్‌డౌన్‌ అమలుకు సిద్ధమవుతోంది. మందుల షాపులు మాత్రమే ఎప్పటిలాగా అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసేవలు కూడా ఏసమయంలోనైనా పొందే అవకాశం ఉంది. 


 మద్యం షాపులూ మధ్యాహ్నం వరకే..

ఏలూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ కూడా మద్యం షాపుల నిర్వహణ సమయంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉండే మద్యం దుకాణాలను బుధవారం నుంచి ఉదయం 6 నుంచి 12 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచుతారు. 


నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళ వారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. 12 గంటల తరువాత ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావడానికి వీలు లేదని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. అత్యవసర సేవలు, వ్యవసాయ పనులు మినహా సాధారణ వర్తక, వాణిజ్యాలను 12 గంటలకే ఆపేయాలన్నారు. పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్టుల్లో లక్షణాలు ఉన్నవారి వద్ద నుంచే నమూనాలు సేకరించాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జేసీ హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌వో ఉదయభాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌, డీఎంహెచ్‌వో సునంద పాల్గొన్నారు. 


12 గంటల వరకూ 144 సెక్షన్‌ : డీఐజీ

ఏలూరు క్రైం, మే 4 : ఏలూరు రేంజ్‌ పరిధిలో కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేప ట్టామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు చెప్పారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ జవహర్‌రెడ్డి, వైద్యశాఖ చీఫ్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఎస్పీలు, కమిషనర్లు, రేంజ్‌ డీఐజీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  డీజీపీ సవాంగ్‌ మాట్లాడుతూ రెండు వారాల కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. డీఐజీ మోహనరావు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, అనంతరం కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అత్యవసర సేవలకు మినహా ఎవరికీ రోడ్లపైకి రావడానికి అనుమతులు లేవన్నారు. 


 కరోనా నియంత్రణకు సహకరించండి : ఎస్పీ 

కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. జిల్లాలో పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. దుకాణాలు మధ్యా హ్నం 12 గంటల అనంతరం తెరిస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.




Updated Date - 2021-05-05T06:04:41+05:30 IST