అంతా రోడ్లపైనే

ABN , First Publish Date - 2021-05-14T05:41:29+05:30 IST

సెకండ్‌ వేవ్‌గా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కరోనా గురించి జనానికి పట్టడం లేదు.

అంతా రోడ్లపైనే
ఏలూరు వంగాయగూడెంలో రద్దీ

పట్టణాల్లో కనిపించని భౌతికదూరం

మార్కెట్లు, మెయిన్‌రోడ్లపై గుంపులుగా జనం

మద్యం, కిరాణా, మందుల దుకాణాలు కిటకిట

ఉదయం పది నుంచి మధ్యాహ్నం 

12 వరకు జనసందోహం

ప్రధాన పట్టణాల్లో ఆంధ్రజ్యోతి పరిశీలన 


ఏలూరు రూరల్‌, భీమవరం క్రైం, తణుకు, పాల కొల్లు అర్బన్‌, తాడేపల్లిగూడెం, మే 13 (ఆంధ్రజ్యోతి): సెకండ్‌ వేవ్‌గా  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కరోనా గురించి జనానికి పట్టడం లేదు. జిల్లాలోని ఏలూరు నగ రంతో పాటు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాల కొల్లు, నిడదవోలు తదితర పట్టణాల్లో కొందరు మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతూ కనిపించారు. ఎవరైనా ‘మాస్క్‌ పెట్టుకో బాబూ’ పెద్దలు చెబుతుంటే  ‘చాల్లే.. చెప్పొచ్చావులే’  అన్నట్టు చూస్తున్నారు. మరికొందరు ఎదురు దాడికి దిగుతున్నారు. మేమింతే అంటూ ముందుగా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ కొవిడ్‌ విజృంభణకు, అనేకమంది ప్రాణాల బలికి పరోక్షంగా కారణం అవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కిరాణా, మద్యం, మందుల దుకాణాల్లో రద్దీ అసాధారణంగా ఉంటున్నది. కొనుగోలుదారులు ఒకరిపై మరొకరు పడుతూ సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అసలు మార్కెట్‌కు ఎందుకు వచ్చాంరా బాబూ అని కొందరు ఆందోళన చెందుతుంటూ మరికొందరు మాకేం కాదులే అనే ధీమాతో జనంలో కలియ తిరుగుతున్నారు. కొందరు అవసరంతో వస్తుంటే.. మరికొందరు సరదాకు వస్తున్నారు. 


గూడెం గుండెల్లో రైళ్లు

తాడేపల్లిగూడెం.. కిరాణా, పండ్లు, ఉల్లిపాయల హోల్‌ సేల్‌ మార్కెట్‌లతో నిత్యం రద్దీ ఉండే వాణిజ్య కేంద్ర పట్టణం. ఇక్కడ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుస్తున్నారు. తక్కువ సమయం కావడంతో.. ఆ సమయంలో జనం పెద్దఎత్తున రోడ్లపై వస్తున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నా భౌతిక దూరం పాటించడం లేదు. మద్యం, మందులు, కిరాణా షాపుల వద్ద రద్దీ ఎక్కువ కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు పడుతూ తోపులాటలు జరిగాయి. వీరిని నియంత్రించడం దుకాణ దారులకు పెద్దసవాల్‌గా మారింది. గురువారం ఉదయం పది నుంచి 12 గంటల వరకు జరిపిన ఆంధ్రజ్యోతి పరి శీలనలో రోడ్లన్నీ మామూలు రోజులకంటే అధికంగా కిటకిట లాడాయి. బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌, శేషమహల్‌ జంక్షన్‌, మెయిన్‌రోడ్‌ ప్రాంతాల్లో రద్దీతో నడిచేందుకు ఇబ్బం దులు పడే పరిస్థితి వచ్చింది. ఈ జనాన్ని చూస్తుంటే కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేసేందుకు రంగంలోకి దిగుతు న్నారు. ఉదయం నుంచి షాపులు, రద్దీ వున్న ప్రాంతాల్లో కూడా వీరు మైక్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తే రద్దీ నియంత్రణ తప్పుతుంది. 


 తణుకులో బయటకొస్తే.. బుక్కే ! 

తణుకు పట్టణంలో ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా.. రహదారులపై రద్దీ తగ్గడం లేదు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కిటకిటలాడుతున్నాయి. కిరాణా, మందులు, మద్యం షాపుల వద్ద ఎవరూ నియంత్రణ పాటించడం లేదు. ఒకరికొకరు రాసుకుని మరీ వెళ్లి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా దుకాణాలు కరోనా కారకాలుగా మారుతున్నాయ నడంలో సందేహం లేదు. వైరస్‌ సోకిన బాధితులు ఇళ్లల్లో వున్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ రోడ్లపైకి వచ్చి.. కరోనా విజృంభణకు అవకాశం ఇస్తున్నారు. ఉదయం పది గంటల తర్వాత మెయిన్‌రోడ్‌, రాష్ట్రపతి రోడ్డు, డైలీ మార్కెట్‌,  నరేంద్ర సెంటర్‌, వెంకటేశ్వర సెంటర్‌లలో రద్దీ కనిపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతుంది. గతంలో మాదిరి రోడ్లపైకి వచ్చేవారికి టైమ్‌ స్లాట్‌ ఇస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు, అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. 


  ఏలూరులో గుంపులు గుంపులు

ఏలూరు నగరంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో, కొందరు నడుచుకుంటూ గుంపులుగా కనిపించారు. వన్‌టౌన్‌ మెయిన్‌ బజార్‌, పవర్‌ పేట రైల్వే స్టేషన్‌ రోడ్‌, ఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌ఆర్‌ పేటల్లోని దుకాణాల వద్ద జనం కిక్కిరిసాయి. చాలా షాపుల వద్ద కనీసం శానిటైజర్లు పెట్టలేదు. క్యూ లైన్లలో ఉండాలని చెప్పడం లేదు. తమ వ్యాపారం సాగుతుందా ? లేదా ? అందరికంటే మనమే ఎక్కువ అమ్మకాలు సాగించాలన్న లక్ష్యంగా కొందరు కరోనాను సైతం లెక్క చేయడంలేదు. మద్యం, కిరాణా, మందుల దుకాణాల్లో రద్దీ కనిపించింది. మొదటి వేవ్‌లో జిల్లాలోనే అధిక కేసులు ఇదే నగరంలో కనిపించగా, సెకండ్‌ వేవ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జనంలో మార్పు రాకపోతే ఈ కేసుల పరంపరం ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.  అధికారులు, పోలీసులు రద్దీ ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేసి జనం భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లతో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


  భీమవరంలో భయం లేదా ?

భీమవరంలో 500కు పైగానే సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు ప్రభుత్వ లెక్కలు ప్రకారం నమోదయ్యాయి. అనధికారి కంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మరింత మంది ఉంటారు. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ కోట్లలో టర్నోవర్‌ జరిగే భీమవరం మార్కెట్‌కు చుట్టు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపుల వద్ద క్యూ కడుతు న్నారు. వారి వారి అవసరాలకు రావడాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రద్దీ పెరిగింది. భౌతక దూరం మరిచి ఒకరినొకరు తోసుకోవడంపై పోలీసులే ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు ఏ మాత్రం భయం లేకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. పట్టణంలోని ప్రకాశం చౌక్‌, బుధవారం మార్కెట్‌, మావుళ్లమ్మ గుడి రోడ్‌, సరోవర్‌ సెంటర్‌, అడ్డ వంతెన, బోంబే స్వీట్స్‌ సెంటర్లలో కిరాణా షాపులు, కూరగాయలు, మెడికల్‌ షాపులే కాకుండా మద్యం షాపులు వద్ద కూడా క్యూ కడుతున్నారు. వివాహాల సీజన్‌ కావడంతో వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కొందరు ఈ జనాన్ని చూసి కొనుకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. 


  పాలకొల్లు.. జనం హడావుడి

మధ్యాహ్నం 12 గంటలకు కర్ఫ్యూ అమలువుతుంది. 11 గంటల నుంచే పాలకొల్లు రద్దీగా మారుతోంది. వ్యాపార సంస్థల వద్దకు ప్రజలు అవసరమైన నిత్యావసర వస్తువులు, పండ్లు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. మరో వైపు మందుబాబులు మద్యం షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. గాంధీబొమ్మ సెంటర్‌, మెయిన్‌ రోడ్‌, బస్టాండ్‌ సెంటర్‌, బంగారం కొట్టు సెంటర్లలోని దుకాణాల వద్ద ఎక్కడికక్కడ గుంపులు, గుంపులుగా గుమిగూడి ఉంటున్నారు. కరోనా భయం అంటే ఏమిటో తెలిసినట్లు కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


  నిడదవోలులో రద్దీని పట్టించుకోలేదు

కరోనా కర్ఫ్యూ టైమ్‌లోనే రాదు.. ఎప్పుడైనా.. ఎవరికైనా.. వైరస్‌ సోకవచ్చు. అత్యవరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బైటకు రావద్దని అధికారులు మొత్తుకుంటున్నా కొంతమందిలో చైతన్యం కనిపించడం లేదు. అత్యవసర పనులపైన, సరుకులు తెచ్చుకునేందుకు, విధి నిర్వహణకు రోడ్లపైకి వస్తే తప్పు లేదు. కానీ కొందరు పనిలేక పోయినా వస్తున్నారు. ఇలాంటి వారితో మిగిలిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలులో గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెయిన్‌ రోడ్‌, గణేశ్‌ చౌక్‌ సెంటర్‌, యర్నగూడెం రోడ్డుతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ మెడికల్‌, వస్త్ర, కిరాణా దుకాణాల వద్ద ప్రజల రద్దీతో బిజీబిజీగా మారిపోతున్నాయి. చాలాచోట్ల గుంపులుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. 




Updated Date - 2021-05-14T05:41:29+05:30 IST