పేకాడుతున్న 608 మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T06:30:31+05:30 IST

నరసాపురం సబ్‌డివిజన్‌ పరిధిలో సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.

పేకాడుతున్న 608 మంది అరెస్టు

రూ.21.44 లక్షలు స్వాధీనం : డీఎస్పీ వీరాంజనేయరెడ్డి

నరసాపురం టౌన్‌, జనవరి 15: నరసాపురం సబ్‌డివిజన్‌ పరిధిలో సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. డివిజన్‌ పరిధిలో పేకాడుతున్న 608 మందిని అరెస్ట్‌ చేసినట్లు  డీఎస్పీ వీరాంజనేయరెడ్డి శుక్రవారం తెలిపారు. మూడు రోజుల నుంచి డివిజన్‌లో పరిధిలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసి రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసు కున్నట్లు తెలిపారు. నరసాపురం సర్కిల్‌లో 47, పాలకొల్లు టౌన్‌ 110, రూరల్‌ 152, పెనుగొండ సర్కిల్‌ 56, భీమవరం 32, భీమవరం 2లో 32, భీమవరం రూరల్‌ 180 మందిని అరెస్టు చేశామన్నారు. గుండాట అడుతున్న 174 మందిని అరెస్టు చేసి రూ 3.10 లక్షలు నగదు, 28 గుండాట బోర్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోడి పందేలు ఆడుతున్న 440 మందిని అరెస్టుచేసి రూ.4.38లక్షల నగదు, 229 కోళ్లు, 249 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.

తిల్లపూడిలో రూ.4 లక్షలు స్వాధీనం


పాలకొల్లు, జనవరి 15: రూరల్‌ మండలం తిల్లపూడిలో పేకాట స్థావరంపై దాడి చేసి రూ. 4.16 లక్షల నగదు, 5 కార్లు, 26 సెల్‌ఫోన్‌లు, 16 మోటారు సైకిళ్లు స్వాధీ నం చేసుకున్నారు. ఏలూరు స్పెషల్‌ బ్రాంచి పోలీసు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. పలువురు జూదర్లును అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జిల్లా క్రైం మీటింగ్‌లో పోలీసు ఉన్నతాధికారులు జూద కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సూ చించారు. ఒక ఎస్‌ఐ స్పందిస్తూ పండుగకు ముందు అధికారులు ఇలాగే చెప్తారు.. పండుగ సమయానికి వదిలేయమంటారని అసహనం వ్యక్తం చేయడంతో పోలీసు ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ ఎస్‌ఐ పని చేస్తున్న మండలంలో కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ కారణంగానే తిల్లపూడిలో దాడులని పోలీసు వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


వీరవాసరం : వీరవాసరం గ్రంధివారి పుంత సమీపంలో పేకాడుతున్న ఏడు గురిని అరెస్టు చేసి రూ.34,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ఎస్‌ రామచంద్రరావు తెలిపారు. కొణితివాడ, నవుడూరు గ్రామాల్లో కోడిపందేల బరులపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.2,700 నగదు, నాలుగు కోడిపుంజలు, నాలుగు కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజులగరువు లో పేకాడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రూ.4500, మత్స్యపురిపాలెంలో గుండాట నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి రూ.11,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. మత్స్యపురిపాలెంలో కోడిపందేలపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసి రూ.2,400 నగదు, రెండు కోళ్లు, రెండు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామచంద్రరావు తెలిపారు.

Updated Date - 2021-01-16T06:30:31+05:30 IST