సర్వే సంకటం

ABN , First Publish Date - 2021-01-20T05:51:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే నెలరోజులు కావస్తున్నా తొలి అడుగులోనే ఉంది.

సర్వే సంకటం

 భూముల సర్వేకు సాంకేతిక కష్టాలు

 అందుబాటులోకి రాని సాఫ్ట్‌వేర్‌

భీమవరం, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే నెలరోజులు కావస్తున్నా తొలి అడుగులోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 21 ప్రారంభిస్తే మన జిల్లాలో 23న చాగల్లు మండలం నందిగంపాడులో ప్రారంభించారు. నాలుగు రెవెన్యూ డివిజన్లు వారీగా తొలి విడతలో సర్వే జరిగే గ్రామాల వివరాలను సంబంధిత సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు ఇప్పటికే ప్రకటించారు. ప్రతి డివిజన్‌లోనూ ఈ సర్వే ప్రక్రియను మూడు విభాగాలుగా చేశారు. ఇందులో ప్రభుత్వ భూముల సర్వేకు మాత్రం ఆదేశాలొచ్చాయి. అయితే సర్వే ఎలా చేయాలి.. డేటా ఏ విఽధంగా అప్‌డేట్‌ చేయాలి..? సమస్యలు, వివాదాలు ఎలా పరిష్కరించాలనే అంశాలపై స్పష్టమైన విధివిధానాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ)విడుదల కాలేదు. దీంతో సిద్ధంగా ఉన్న సర్వేయర్‌లు, సాంకేతిక సిబ్బంది ప్రాథమికంగా వచ్చిన ఆదేశాల మేరకు తొలిదశలో గ్రామంలో ప్రభుత్వ భూమిని, గ్రామ కంఠం, గ్రామ సరిహద్దులు మాత్రమే గుర్తించే పనిలో ఉన్నారు. కొత్తగా విధుల్లోకి తీసుకున్న సాంకేతిక సిబ్బందికి శిక్షణ పూర్తికాలేదు. సాప్ట్‌వేర్‌  పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. 


జిల్లాలో సర్వే ఇలా..

జిల్లాలో సమగ్ర భూసర్వేకు 8.5 లక్షల హెక్టార్లను ఎంపిక చేశారు. ప్రతి గ్రామానికి ఒక సర్వే టీం ఏర్పాటుచేశారు. రూపొందించిన సర్వే కోసం క్రాస్‌ టెక్నాలజీ(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌) సిద్ధం చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియా భాగస్వామ్య సహకారంతో ఈ సర్వే చేపడతారు. ఇం దుకు ఇప్పటికే జిల్లాలో 48 మండలాలలో గ్రామ సచివాలయాలలో సుమారు 800 గ్రామ సర్వేయర్‌లను తీసుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే, ఇన్‌స్పెక్షన్‌ ఆఫ్‌ సర్వే, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, మండలస్థాయిలో డిప్యూటీ సర్వేయర్లు, గ్రా మస్థాయి సర్వేయర్లు, వెలుగు సర్వేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఇలా 1700 మంది పాల్గొంటున్నారు. 


క్షేత్రస్థాయిలో సమస్యలెన్నో..

డ్రోన్‌ టెక్నాలజీపై సిబ్బందికి తగిన అవగాహన లేదు. భూమి హక్కుపై పత్రాలతో యజమానులు సర్వే సమయంలో హాజరు కావాలి. ఇతర ప్రాంతా ల్లోని వారు రాలేకపోతే  ఏం చేయాలి ? ఒక గ్రామం సర్వే పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందనేది తెలియదు. అప్పటి వరకు యజ మానులు నిరీక్షించాల్సిందే. పట్టణ ప్రాంతాల్లో రికార్డుల్లో ఉన్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి వ్యత్యా సం ఉంటుంది. భూయజమానులకు మధ్య తలెత్తే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2021-01-20T05:51:16+05:30 IST