మునిసిపల్స్‌ ఏ వైపు?

ABN , First Publish Date - 2021-02-25T05:23:26+05:30 IST

మున్సిపల్స్‌ ఎటువైపు మొగ్గు చూపిస్తున్నాయి. అర్హత, ఆర్థిక బలం, రాజకీయ స్థోమత ఉన్నవారే సాధారణంగా ఎన్నికల్లో కలబడతారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

మునిసిపల్స్‌ ఏ వైపు?

కొత్త నామినేషన్లు ఉంటాయా ఉండవా

అన్ని పార్టీల్లోనూ ఇదే టెన్షన్‌

రాయబేరాలకు కాసేపు విరామం

తుది నిర్ణయం వెలువడిన తరువాతేమళ్లీ ఆరంభం 

ఆ దిశగానే  అధికార వైసీపీ అడుగులు

కొత్తగా నామినేషన్లు వేయాల్సి వస్తే 

విజయం వైపు విపక్షాల ఆశలు


(ఏలూరు– ఆంధ్రజ్యోతి)  

మున్సిపల్స్‌ ఎటువైపు మొగ్గు చూపిస్తున్నాయి. అర్హత, ఆర్థిక బలం, రాజకీయ స్థోమత ఉన్నవారే సాధారణంగా ఎన్నికల్లో కలబడతారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సామాజిక వర్గాల వారీగా ఎక్కడ బలం ఉంటే అక్కడ రంగంలోకి దిగడానికి రిజర్వేషన్లు అనుకూలించకపోయినా పైపైన పెత్తనం చేస్తారు. అయితే ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణకు మాత్రమే గడువు మిగిలి ఉంది. కానీ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తీర్పు రిజర్వు కాగా, అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రెండు రోజులుగా పందాను మార్చి సైలెంట్‌ దాల్చాయి. తీర్పు వెలువడిన తరువాత అనుకూలత, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగాలని ఎడాపెడా కసరత్తులు చేస్తున్నాయి. 

గత ఏడాది మునిసిపల్‌ ఎన్నికల పోరులో అధికార వైసీపీకి ధీటుగా మిగిలిన పార్టీలు రంగంలోకి దూకేందుకు ఒకింత సంకోచించాయి. ప్రతి పక్ష తెలుగుదేశం మాత్రం ఏలూరు  కార్పొరేషన్‌తోపాటు మిగతా మునిసిపాలిటీ ల్లోనూ పార్టీ తరపున అభ్యర్థులను ఖరారు చేసి రంగంలోకి దింపే బాధ్యత స్థానిక నేతలకే అప్పగించింది. దీనికి అనుగుణంగానే టీడీపీతో సహా మిగతా పార్టీల్లోనూ సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాస్తంత మెరుగైన, ధైర్యం ఉన్నవారి చేత నామినేషన్లు వేయించారు. ఆ తరువాత కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికలు కాస్త వాయిదా పడ్డాయి. అన్నింటి కంటే మించి ఎవరెవరు ఏకం అవుతారు. ఇంకెందరు విడివిడిగా పోటీ చేస్తారనేదానిపై ఒక రాజకీయ స్పష్టత పూర్తిగా రాలేదు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే సర్దుబాటుకు ప్రయత్నిద్దామంటూ వైసీపీయేతర పక్షాలు అన్ని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే ఎన్నికలు కాస్త టక్కున వాయిదా పడ్డాయి. ఈ పరిణామం అప్పట్లో వైసీపీకి షాక్‌ ఇవ్వగా మిగిలిన పార్టీలు కూడా ముందుగా కాస్త వ్యతిరేకించినా ఆ మరుసటి వారం రోజుల్లోనే లాక్‌డౌన్‌ ఆరంభం కావడంతో ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించాయి.

మరి ఇప్పుడేం జరగబోతోంది : 

ఏలూరు కార్పొరేషన్‌లో అధికార వైసీపీకి ధీటుగా దాదాపు 30 డివిజన్లలో నువ్వా నేనా అనే స్థాయిలో టీడీపీ పక్షాన అభ్యర్థులు రంగంలోకి  దిగారు. మిగిలిన 20 వార్డుల్లోనూ అప్పుడు ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన అభ్యర్థులు బరిలోకి దిగారు. కానీ వైసీపీలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి డివిజన్ల వారీగా పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకరు అభ్యర్థిగా ఇంకొకరిని డమ్మీగా నామినేషన్లు వేయించారు. అయితే అప్పటికప్పుడు ఈ వర్గాల మధ్య సర్దుబాటు కుదరకపోవడంతో వైసీపీ ఈ నిర్ణయానికి దిగింది. ఇప్పుడదే ఆ పార్టీలో మొత్తం కొత్త సంకేతాలిస్తుంది. తాజా రాజకీయ పరిణామాల క్రమంలో కొన్ని డివిజన్లలో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం వైసీపీలో ఒకింత గందరగోళం సృష్టించింది. ఎలాగూ పార్టీ అభ్యర్థులను మారిస్తే డమ్మీగా నామినేషన్‌ వేసిన వారు అంతో ఇంతో స్థోమత కల్గినవారే కావడంతో ఆ పార్టీనేతలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి తోడు తెలుగుదేశంలో ఉన్న బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడంతో పాటు బరి నుంచి తప్పించడం వైసీపీ వ్యూహాల్లో ఇంకొకటి. అలాగే మిగితా మునిసిపాలిటీల్లోనూ దాదాపు ఈ తరహా పరిస్థితే ఉంది. అయితే నామినేషన్‌ వేసిన అభ్యర్థులను మాత్రమే రంగంలో ఉంచుతామని ఈ విషయంలో ఎవరు సందేహించాల్సిన అవసరంలేదని వైసీపీ పైపైకి చెప్తూనే ఉంది. కానీ పాత ఎన్నికల ప్రక్రియను స్థంభింపచేసి ఇప్పుడు కొత్తగా అన్ని స్థానాలకు నామినేషన్లు వేసుకునే ప్రక్రియ కొనసాగించాలని ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ సూచించాలని కోరుతూ కొందరు కోర్టుకెక్కారు. 

ఒకవైపు పార్టీల మధ్య నెలకొన్న వివాదాలు, బెదిరింపులు, ఒత్తిళ్ళు కొనసాగుతూ ఉండగానే మరోవైపు కోర్టు ఉత్తర్వు ఎలా ఉండబోతోందో అనేది అతి పెద్ద సస్పెన్స్‌గా మారింది. ప్రత్యేకించి నామినేషన్లకు న్యాయస్థానం ఓకే చేస్తే రసవత్తర రాజకీయ పోరుకు నాందిపలకడమే కాకుండా స్వేచ్ఛగా  నామినేషన్లు వేసే ప్రక్రియకు తెర తీసినట్లవుందని భావిస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణకు దగ్గరగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తో సహా జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం వంటి మునిసిపాలిటీలను సరికొత్త సస్పెన్స్‌ సృష్టించింది. ఈ నిర్ణయం  ఎలా ఉండబోతుందనే దానిపైనే అందరూ దృష్టి పెట్టారు. మరోవైపు అధికార వైసీపీ గడిచిన కొద్దిరోజులుగా ఏలూరు కార్పొరేషన్‌తో సహా మిగతా మునిసిపాలిటీల్లోనూ విపక్ష అభ్యర్థుల కోసం వేట ఆరంభించింది. అనేక ఆఫర్లు ఇచ్చారు. ఏదో రూపంలో విపక్షాల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే చాలు అనే ధోరణిలోనే ముందుకెళ్ళారు. అయితే గడిచిన రెండు రోజులుగా వైసీపీ రాయబారాలు తగ్గాయి. కారణం తీర్పు వెలువడిన తరువాతే ముందుకెళ్దామనే పార్టీ పెద్దల సూచనలతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు దాదాపు మున్సిపల్స్‌లో ప్రచారం కంటే సస్పెన్సే కొనసాగుతుంది. 


Updated Date - 2021-02-25T05:23:26+05:30 IST