సమరానికే సై

ABN , First Publish Date - 2021-03-04T05:25:56+05:30 IST

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా మిగతా నాలుగు మున్సిపాల్టీల్లోనూ పెద్దగా ఏకగ్రీవాలు లేకుండానే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది.

సమరానికే సై

ఏకగ్రీవ ఎత్తుగడలు ఢమాల్‌

ఏలూరు 3, నాలుగుచోట్ల 16తోనే సరి 

కొవ్వూరులో టీడీపీ, వైసీపీ ఒప్పందాలపై ఆగ్రహం

జంగారెడ్డిగూడెం, నిడదవోలులో అన్ని స్థానాల్లో పోటీ 

మొత్తం మీద 142 వార్డు, డివిజన్లకు 434 మంది పోటీ 

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా మిగతా నాలుగు మున్సిపాల్టీల్లోనూ పెద్దగా ఏకగ్రీవాలు లేకుండానే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. అధికార వైసీపీ ఎన్నో వ్యూహాలతో మరెన్నో ఒత్తిడులతో మెజార్టీ స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలను తప్పించి తమకు అనుకూలంగా ఫలితాలు మళ్లించు కోవడానికి విఫలయత్నం చేసింది. కానీ ఒక్క కొవ్వూరులో మినహా దాదాపు అన్నిచోట్ల వైసీపీ దూకుడుకు కళ్లెం పడింది. మొత్తం ఏకగ్రీవాలు 19కే పరిమితమయ్యాయి. మిగతా డివిజన్లు, వార్డులన్నింటి లోనూ ముఖాముఖీ లేదా బహుముఖ పోటీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల బరిలో తేల్చుకోవడానికి ఆయా పార్టీల అభ్యర్థులు,పార్టీ ముఖ్య నేతలు మొగ్గు చూపడం వైసీపీ కన్ను పడకుండా, చేజిక్కకుండా తమ వారిని రహస్య ప్రదేశాలకు తరలిం చడంతో ఏకగ్రీవం ముప్పు తప్పింది. జిల్లా అంతటా ఇక పురపోరు మరింత రసకందాయంలో సాగనుంది. 

ఏకగ్రీవాలకు అడ్డంకులు

మంత్రులు ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు కార్పొరేషన్‌లోనూ మరో మంత్రి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు మున్సిపాల్టీలోనూ ఏకగ్రీవాల సంఖ్య అనూహ్యంగా ఉంటుందని వైసీపీ లెక్కలు గట్టింది. చోటామోటా నేతలు ఏకగ్రీవాల దిశగా విపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించారు. కవ్వించారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా వీటిలో మూడు డివిజన్లు మాత్రమే ఏకగ్రీవమై ఇవన్నీ వైసీపీ వశమయ్యాయి. ఇక్కడ ఏకగ్రీవ డివిజన్ల సంఖ్య దాదాపు 10 వరకూ ఉండవచ్చునని అటు వైసీపీ, ఇటు టీడీపీ ఒక దశలో అంచనాకు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు 48 గంటల ముందే తెలుగుదేశంతో సహా మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురికాకుండా కొంతమేర కట్టడి చేశాయి. పార్టీ గెలుపు అవకాశాలను గుర్తు చేశారు. ఏలూరు కన్వీనర్‌ బడేటి చంటి, ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, మాజీ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సహా పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పలువురు సీనియర్లు పదేపదే వ్యూహాలు మార్చి అభ్యర్థులు వైసీపీ వలలో చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఒక్కో డివిజన్‌ అభ్యర్థి రంగం నుంచి తప్పుకుంటే పది నుంచి రూ.25 లక్షలు నగదు, అదీ ఇదీ లేకుంటే బెదిరింపులు జరిగినా చివరకు ఇవన్నీ వీగిపోయాయి. ఏలూరు కార్పొరేషన్‌లో 47 డివిజన్లను ఎన్నికలు జరగబోతుండగా టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు, ఇండిపెండెంట్లతో 172 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లైంది. మంత్రి నానికి ఏలూరు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎంఆర్‌డీ బలరామ్‌ సహా మిగతా నేతలు పార్టీ గెలుపు కోసం వ్యూహాలకు సిద్ధపడుతున్నారు. పుర పోరులోనూ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా పోలింగ్‌ సమయంలో ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ సీపీఐతో కూడా ఎన్నికల పొత్తు ఉండడంతో తెలుగుదేశం కేవలం 44 డివిజన్లలోనే పోటీకి దిగుతోంది. బహుముఖ పోటీల వల్ల కొన్ని కీలక డివిజన్లలో ఓట్ల చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. ఉద్యోగులు, మధ్య తరగతి వర్గీయులు, ఒక సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌లో బిగ్‌ఫైట్‌ దాదాపు ఆరంభమైనట్లే. 


మిగిలిన మున్సిపాలిటీల్లో..  

కొవ్వూరు మున్సిపాల్టీలో అనూహ్యంగా టీడీపీ, వైసీపీలు పరస్పరం అర్థం చేసుకుని సర్దుబాటుకు ప్రయత్నించగా జనసేన, బీజేపీ మిగతా పార్టీలు రంగం నుంచి తప్పుకునేది లేదని పోటీకే సై అనడంతో కొవ్వూరు వ్యవహారం కాస్త తిరగబడింది. మొత్తం 23 వార్డులున్న ఈ మున్సిపాల్టీలో ఇప్పటికే 9లో వైసీపీ, 4లో టీడీపీ సర్దుబాటు చేసుకుని ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసుకోగలిగాయి. ఇక మిగతా పది డివిజన్లలో మాత్రం ఈపార్టీల ఎత్తుగడ ఫలించలేదు. మిగతా చోట్ల బీజేపీ 6 వార్డుల్లోనూ జనసేన 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 4 కొవ్వూరు మున్సిపాల్టీలో మిగతా పది స్థానాల్లో ఏకంగా 27 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే 86 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీలకు షాక్‌ ఇచ్చేలా మిగతా పార్టీలు వేసిన ఎత్తుగడ కాస్త కొవ్వూరులో ఫలించింది. 

నర్సాపురం మున్సిపాల్టీలో 28 వార్డులు ఉండగా 75 మంది పోటీ చేస్తున్నారు. మూడు వార్డులను ఇప్పటికే వైసీపీ కైవశం చేసుకుంది. 69 మంది తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. ఆర్థిక బలం కలిగిన అభ్యర్థులు అత్యధికంగా ఉండడంతో ఇక్కడ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లు కాకుండా వ్యక్తిగత తీరును బట్టి సమకూరే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీలు భారీ ఎత్తున వ్యూహరచన చేశాయి. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తతపల్లి సుబ్బారాయుడు వంటి వారు తమ పార్టీ పక్షాన గెలుపుకోసం బరిలో దిగారు. టీడీపీ, జనసేన ఇక్కడ ఉమ్మడిగా బరిలో ఉండగా ఇది కాస్త కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. 

నిడదవోలు మున్సిపాల్టీలో 28 వార్డులు ఉండగా ఇప్పటికే దాదాపు 70 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరో 91 మంది బరిలో నిలిచారు. వైసీపీ, టీడీపీ ఇక్కడ ఢీ అంటే ఢీ అంటున్నాయి. 


జంగారెడ్డిగూడెంలో టీడీపీ, జనసేన పొత్తు

జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో టీడీపీ, జనసేన పొత్తుకు దిగాయి. ఇది కాస్త వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసింది. ఇక్కడ ముందస్తుగా వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థిగా ప్రచారం సాగిన ఒకరిని ఆ అవకాశం ఇప్పుడు లేదంటూ పక్కన బెట్టారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కొంత అసంతృప్తిలో పడ్డారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్ధి రమాదేవికి మద్దతు మరింత పెరిగింది. పార్టీ ముఖ్యులంతా జంగారెడ్డిగూడెంలో బస చేసి ఎన్నికల నిర్వహణకు నడుం బిగించారు. ఈనగర పంచాయతీలో కూడా 29 వార్డులు ఉండగా 66 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా, మరో 69 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా వివిధ పార్టీలు పోటీలో ఉన్నాయి. 


కొవ్వూరులో 13 ఏకగ్రీవం

ఏలూరు కార్పొరేషన్‌తో సహా నర్సాపురం, కొవ్వూరులోనూ కేవలం 19 స్థానాలే ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నిక జరగనున్న దాదాపు 142 డివిజన్‌, వార్డు స్థానాలకు 434 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటిదాకా రెండు విడతలుగా నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి సంఖ్య 398కి పైగానే ఉంది. కొవ్వూరు పురపాలక సంఘం 23 వార్డులకు 13 ఏకగ్రీవమయ్యాయి. వైసీపీ నుంచి ఎన్నికైన తొమ్మిది మందిలో.. 5వ వార్డు మద్దిపట్ల సాయిగీత, 6 మన్నె పద్మ, 11 తోట లక్ష్మీప్రసన్న, 12 అంకోలు లిల్లీవెంకట పద్మావతి, 15 అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, 17 రుత్తల ఉదయభాస్కరరావు, 20 పతివాడ నాగమణి, 21 సఖినేటిపల్లి చాందిని, 22 కంఠమణి రమేష్‌బాబు ఉన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన నలుగురిలో.. 7వ వార్డు పాలూరి నీలిమ, 16 కండెల్లి రామారావు, 18 మర్రి రాము, 19 కిలాని వీర వెంకటలక్ష్మీ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఏలూరులో మూడు..

ఏలూరు ఒకటో డివిజన్‌లో ఆర్నేపల్లి అనురాధ,  మూడో డివిజన్‌ బొద్దాని అఖిల, 32వ డివిజన్‌ సునీతా రత్నకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

నరసాపురంలో  మూడు..

నరసాపురం ఐదో వార్డు వన్నెంరెడ్డి శ్రీనివాస్‌, పదహారో వార్డు గొర్ల జయరాజ్‌ సింగ్‌, 27వ వార్డు గోరు రమణారెడ్డి ఏకగ్రీవమయ్యారు. 


ఎన్నికల నియమావళి అమలు చేయాలి : డీఐజీ కేవీ మోహనరావు

ఏలూరు క్రైం, మార్చి 3 : ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. రేంజ్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల డీఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఎవరైనా ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు అధికారులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వలంటీర్లతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాల పరిమితిలోగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. వీసీలో మూడు జిల్లాల డీఎస్పీలు బాలచంద్రారెడ్డి, ఏలియాసాగర్‌, ఎ.శ్రీనివాసరావు, ఎం.శ్రీలత, ఏటీవీ రవికుమార్‌, ఎన్‌.సత్యానందం, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.  




Updated Date - 2021-03-04T05:25:56+05:30 IST