నీరుగారిన ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2021-01-26T05:55:29+05:30 IST

నీటి పారుదల శాఖకు నిధుల కొరత వెంటాడుతోంది. పశ్చిమ డెల్టా డివిజన్‌ పరిధిలో ఆధునికీకరణ పనుల కోసం సమర్పించిన రూ. 250 కోట్ల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వం తిప్పి పంపింది.

నీరుగారిన ప్రతిపాదనలు

రూ.250 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులకు చుక్కెదురు

నీటిపారుదల శాఖకు నిధుల కొరత 

నిధులు లేక వెనక్కు పంపిన ప్రభుత్వం 

ప్రభుత్వం ఆదేశిస్తేనే మళ్లీ  ప్రతిపాదనలు

బకాయిలు విడుదల చేయని వైనం

టెండర్లకు ముందుకురాని కాంట్రాక్టర్లు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

నీటి పారుదల శాఖకు నిధుల కొరత వెంటాడుతోంది. పశ్చిమ డెల్టా డివిజన్‌ పరిధిలో ఆధునికీకరణ పనుల కోసం సమర్పించిన రూ. 250 కోట్ల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వం తిప్పి  పంపింది. చిన్నపాటి కారణాలు చూపుతూ ప్రతిపాదనలకు బ్రేక్‌ వేసింది. ప్రతిపాదనలు రూపకల్పన చేసే సమయంలో జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న ఒక కారణం అందులో పొందు పరిచింది. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదంటూ నీటిపారుదల శాఖ సిబ్బంది విశ్వసిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వాలు ఆమోదించేవి. పనులు నిర్వహించేవారు. ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించడంతో జిల్లా నీటి పారుదల శాఖ అధికారుల్లో ఒకింత నిరుత్సాహం అలముకుంది. ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వస్తే తప్ప ప్రతిపాదనలు పంపలేమన్న నిస్సహాయతలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వం తిప్పి పంపిన ప్రతిపాదనల్లో వంతెనలు, కల్వర్టులు, స్లూయిస్‌లు, లాక్‌ల నిర్మాణాలు వంటి పనులు ఉన్నాయి. నీటి ప్రవాహ వేగాన్ని పెంచడంలో ఆధునికీకరణ పనులు కీలకం కానున్నాయి. అయినా ప్రభుత్వం కొర్రీలు వేస్తూ ప్రతిపాదనలు తిప్పికొట్టింది. మరోవైపు బకాయిలు కూడా విడుదల చేయడం లేదు. గడచిన మూడేళ్లనుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కాంట్రాక్టర్‌ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేవు.వేసవిలో చేపట్టే పనులకు కూడా అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఓఅండ్‌ఎం నిధుల పనులు సైతం చేయలేక పోతున్నారు. నామినేషన్‌ పద్ధతిపై పనులు చేయించాలన్నా కష్టతరమవుతోంది. నీటి సంఘాలు ముఖం చాటేస్తున్నాయి. 


ఏళ్ల తరబడి బకాయిలు పెండింగ్‌

గడచిన మూడేళ్ల నుంచి ఓఅండ్‌ఎం నిధులతో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించలేదు. శెట్టిపేట డివిజన్‌ పరిధిలోనే ఓఅండ్‌ఎం పనులకు సంబంధించి రూ.18కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దాదాపు అంతే మొత్తంలో భీమవరం డ్రెయినేజీ విభాగం పరిధిలో బకాయిలు పేరుకు పోయాయి. ఆఽధునికీకరణకు సంబంధించి రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు పెండింగ్‌లో ఉండడం ఇదే మొదటిసారి.ఓఅండ్‌ఎం నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేసేవారు. రైతులు చెల్లించే నీటి తీరువా నుంచి నిధులు విడుదలయ్యేవి. పశ్చిమ డెల్టా రైతులు ఎప్పటికప్పుడు నీటి తీరువా చెల్లిస్తున్నారు. రైతుల చెల్లించే నీటిపన్ను నుంచే ఓఅండ్‌ఎం నిధులను కేటాయి స్తున్నారు. ప్రభుత్వం గడచిన మూడేళ్ల నుంచి బకాయిలు విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూడు, గర్రపుడెక్క తొలగింపు, పూడికతీత వంటి పనులను చేపట్టక పోతే నీటి ప్రవాహం మందగిస్తుంది. ఇటువంటి అత్యవసర పనులను వేసవిలో చేపడుతుంటారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తే పనులు వేగవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే కొద్దిపాటి వర్షాలకు సైతం పంటపొలాలు నీట మునిగే ప్రమాదం ఉంది. 


Updated Date - 2021-01-26T05:55:29+05:30 IST