కోళ్లు..కత్తులు

ABN , First Publish Date - 2022-01-17T06:27:33+05:30 IST

సంక్రాంతి సందడికి తెరపడింది. మూడు రోజుల పాటు విందు వినోదాలతో అంతా పండగ చేసుకున్నారు. బంధుమిత్రుల రాకతో ఊళ్లన్నీ కళకళలాడాయి. పండుగ ముగియడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పందెం రాయుళ్లు ఈ మూడు రోజులు క్షణం తీరిక లేకుండా గడిపారు. తెల్లవారింది మొదలు ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు కోడిపందేలతో చెలరేగిపోయారు.

కోళ్లు..కత్తులు

సంక్రాంతి సందడికి తెర

మూడు రోజులూ.. వేడుకల్లో మునిగి తేలారు

సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణాలు

చెలరేగిన పందెగాళ్లు..లక్షల్లో సాగిన పందేలు

యథేచ్ఛగా కోసాట, గుండాట

 

సంక్రాంతి సందడికి తెరపడింది. మూడు రోజుల పాటు విందు వినోదాలతో అంతా పండగ చేసుకున్నారు. బంధుమిత్రుల రాకతో ఊళ్లన్నీ కళకళలాడాయి.  పండుగ ముగియడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పందెం రాయుళ్లు ఈ మూడు రోజులు క్షణం తీరిక లేకుండా గడిపారు. తెల్లవారింది మొదలు ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు కోడిపందేలతో చెలరేగిపోయారు.   పందేలు కోట్లు దాటాయి. వేల సంఖ్యలో కోళ్లు నేలవాలాయి. పందేలకు జతగా కోసాట, గుండాట వంటి జూదాలు ముమ్మరంగా నిర్వహించారు.


భీమవరం, జనవరి 16 : మూడు రోజుల సంక్రాంతి పండుగ సంబరంలాగా సాగింది. విందులు, వినోదాలు, కోడిపందేలు, జూదాలు, సర్వరుచుల సమ్మేళనంగా మారింది.. ఈ పండుగలో కోడి పందేలు, అందులో జూదాలే హైలెట్‌గా నిలిచాయి. జూద క్రీడలు వద్దు.. సంప్రదాయ క్రీడలు ముద్దు.. అంటూ పోలీస్‌ అధికారుల ఎన్ని చెప్పినా చివరికి కోడి పందాలే  గెలిచాయి. పుంజుల కాళ్ళకు కత్తులు కట్టి పోటీలపై లక్షలల్లో పందేలు కాశారు. ఒక్కో అసెంబ్లీలో పుంజులపై కనీసం రూ.15 కోట్లు చేతులు మారాయి. కొవిడ్‌ నిబంధనల ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పందెం బరుల వద్ద జనం రద్దీ భారీగా కనిపించింది. ఈ పండుగ వాతావరణంలో మహిళలు సైతం కొన్నిచోట్ల బెట్టింగులు కాశారు. మద్యం ఏరులై పారింది. 


అంతగా కనిపించని వీఐపీలు 

సంక్రాంతి పేరు చెప్తే కొన్ని సంవత్సరాలుగా గోదావరి జిల్లాలకు పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కార్ల సంఖ్య బాగానే కనిపించింది. ఈసారి టూరిస్టుల సంఖ్య భారీగానే వచ్చినప్పటికీ వీఐపీలు మాత్రం మూడు రోజులూ అంతగా కనిపించలేదు. ఉండి నియోజకవర్గం సీసలిలో మాత్రం ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీనివాసరాజు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, పలువురు బీజేపీ నేతలు కోడిపందేల్లో కనిపించారు. మిగతా చోట్ల కూడా కొన్ని ముఖ్యమైన నాయకులు మాత్రమే కనిపించారు. కొవిడ్‌ భయంతో వీఐపీలు రాలేదంటున్నారు. 


జూదాలే లక్ష్యంగా శిబిరాలు

సంక్రాంతిలో సంప్రదాయ కోడి పందేలు పేరుకు మాత్రమే..! కత్తికట్టి బరిలో దిగిన పుంజులపై పందేలు భారీగానే సాగాయి. భోగి రోజు నుంచి మొదలు కనుమ రోజు వరకు యథేచ్ఛగా సాగాయి. బరులు చెంతనే నిర్వహించిన పేకాటలో యువత పెద్దలు, పిల్లలు కూడా పెద్ద ఎత్తున డబ్బులు పందేలు కాసి, జేబులు ఖాళీ చేయించుకున్నారు. ఇవే కాకుండా గుండాటలు కూడా పెద్దఎత్తున ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి సందడి పేరుతోనే అన్ని రకాల జూదాలు కోట్ల రూపాయల టర్నోవర్‌ సాగింది. జూదాలు వేసే నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా 20 కోట్లు రూపాయలు వరకూ బరులు నిర్వాహకులకు ముందస్తుగానే చెల్లించుకున్నట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. దీనిపై పోలీసుశాఖ కూడా సమగ్ర నివేదికను సేకరించింది. జూదాన్ని తగ్గించడానికి మకర సంక్రాంతి రోజున సాయంత్రం 8 గంటలకు నిలుపుదల చేశారు. కనుమ రోజున ఉదయం 6 గంటల నుంచే పందేలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల లోపు ముగించాలని కొన్నిచోట్ల పోలీసులు హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాల్లో మూసి వేసినప్పటికీ శివారు ప్రాంతాల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు సాగాయి. 


పందెంగా స్విఫ్ట్‌ కారు

ఆకివీడు రూరల్‌ జనవరి 16: ఆకివీడు మండలం అయి భీమ వరం గ్రామానికి చెందిన ఇద్దరు కోడి పందేలలో మారుతి స్విప్ట్‌ కారు గెలుపొందారు. ఆకివీడు సరిహద్దులోని కృష్ణా జిల్లా ఆల పాడు వద్ద జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన డింకీ కోడిపందేలలో ఇరు వైపులవారు కలిసి స్విప్ట్‌ కారును కొనుగోలు చేశారు. పందెం గెలిచిన వారు స్విప్ట్‌ కారు సొంతం చేసుకునే విధంగా పందెం వేసుకున్నారు. అయిభీమవరం వాసులు గెలిచి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు చేతుల మీదుగా కారు తాళం తీసుకున్నారు. 


 పెన్నాడలో బుల్లెట్‌ 

పాలకోడేరు : పెన్నాడ గ్రామంలో కోడిపందెం యమరంజుగా సాగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి రూ.2.40 లక్షలతో బుల్లెట్‌ కొని కోడిపందేల బరికి తీసుకొచ్చారు. ఆ ఇద్దరు ఎవరి పుంజు గెలిస్తే బుల్లెట్‌ వారిసొంతం అన్నట్టుగా పందెం బరిలో పెట్టారు. దీనికి నిర్వాహకులు కూడా సై అన్నారు. ఈ పందెంలో పెన్నాడ గ్రామానికి చెందిన కౌరు రామయ్య బుల్లెట్‌ను గెలుచుకొని ఆదే బరిలో రెండు రౌండ్లు వేసి హల్‌చల్‌ చేశారు. 


గూడెంలో పందుల పోటీలు 

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 16: తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం పందుల పోటీలు  హోరాహోరీగా సాగాయి. సంక్రాంతిలో పోటీలు వేసేందుకు తర్ఫీదు ఇచ్చిన పందులను రెండు గ్రూపులుగా వదిలారు. ఈ పోటీల్లో పందులు నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడ్డాయి. ప్రతీ ఏటా నిర్వహించే ఈ పోటీలను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చి వాటిపై పందేలు కూడా కాశారు. 




Updated Date - 2022-01-17T06:27:33+05:30 IST