విజయం ఊరిస్తోంది..

ABN , First Publish Date - 2020-07-12T09:12:23+05:30 IST

వెస్టిండీస్‌- ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రెండు సెషన్ల పాటు ఆతిథ్య ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ...

విజయం ఊరిస్తోంది..

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 284/8

ప్రస్తుత ఆధిక్యం 170

మరో రెండు వికెట్లపై విండీస్‌ దృష్టి


సౌతాంప్టన్‌: వెస్టిండీస్‌- ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రెండు సెషన్ల పాటు ఆతిథ్య ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడినప్పటికీ.. ఆట చివరి గంటలో విండీస్‌ బౌలర్లు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. ఓదశలో 249/3తో పటిష్టంగా కనిపించిన ఆతిథ్య జట్టుకు 200+ ఆధిక్యం ఖాయమే అనిపించింది. కానీ కరీబియన్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు టపటపా వికెట్లను కోల్పోయింది. దీంతో శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 8 వికెట్లకు 284 పరుగులు చేసింది. క్రీజులో ఆర్చర్‌ (5), వుడ్‌ (1) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్‌ క్రాలే (76), సిబ్లే (50) అర్ధసెంచరీలు చేశారు. స్టోక్స్‌ (46) ఫర్వాలేదనిపించాడు. గాబ్రియెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇక ఆదివారం ఆటకు చివరి రోజు కావడంతో తొలి సెషన్‌లో వీలైనంత త్వరగా రెండు వికెట్లు తీసి విజయం సాధించాలనే పట్టుదలతో విండీస్‌ ఉంది.

నిదానంగా..: హోల్డర్‌ పేస్‌, రోచ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ధాటికి నాలుగో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్లు బర్న్స్‌(42), సిబ్లే అతి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. పట్టుదలను ప్రదర్శిస్తూ ఇరువురూ క్రీజులో పాతుకుపోయారు. 15/0 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆతిథ్య జట్టు ఓ దశలో తొమ్మిది ఓవర్లలో మూడు పరుగులు మాత్రమే సాధించింది. ఇక డ్రింక్స్‌ తర్వాత విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు 16 ఓవర్లలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ నుంచి వచ్చింది 17 పరుగులే కావడం గమనార్హం. అయితే ఓపిగ్గా ఆడుతున్న ఈ జోడీని 37వ ఓవర్‌లో చేజ్‌ విడదీశాడు. అవుట్‌సైడ్‌కు ఆవల వెళుతున్న బంతిని కట్‌ షాట్‌ ఆడబోయిన బర్న్స్‌ క్యాచ్‌ అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 2017 తర్వాత ఇంగ్లండ్‌ తరఫున ఓపెనర్లు అందించిన అత్యధిక భాగస్వామమిదే. లంచ్‌ విరామానికి జట్టు 79/1 పరుగులతో ఉంది. 

ఆదుకున్న క్రాలే, స్టోక్స్‌: బ్రేక్‌ తర్వాత విండీస్‌ మరో కీలక వికెట్‌ను దక్కించుకుంది. 52వ ఓవర్‌ తొలి బంతికి సిబ్లే తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. అయితే రెండో బంతికి బౌల్డ్‌ అయినా అది నోబాల్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ మూడో బంతిని ఫ్లిక్‌ చేయబోయిన సిబ్లే చివరకు కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతని పోరాటం ముగిసింది. అయితే మరో వికెట్‌ కోల్పోకుండా ఈ సెషన్‌ను ముగిస్తారనుకున్నా 65వ ఓవర్‌లో డెన్లీని చేజ్‌ అవుట్‌ చేశాడు. ఇక చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ను ఆదుకునే బాధ్యత క్రాలే, స్టోక్స్‌ తీసుకున్నారు. ఈ ద్వయం జట్టు ఆధిక్యాన్ని వంద దాటించింది. అలాగే చేజ్‌ ఓవర్‌లో ఫోర్‌ బాది క్రాలే అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అటు స్టోక్స్‌ వేగం కనబరుస్తూ  ఫోర్లతో చెలరేగాడు. కానీ వరుస ఓవర్లలో స్టోక్స్‌ను హోల్డర్‌.. క్రాలేను జోసెఫ్‌ పెవిలియన్‌కు చేర్చడంతో నాలుగో వికెట్‌కు 98 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఇక బట్లర్‌ (9) నిరాశపర్చగా అటు గాబ్రియెల్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో జట్టు భారీ ఆధిక్యంపై ఆశలు వదులుకున్నట్టే. ఇక నాలుగో రోజు కూడా పేలవ అంపైరింగ్‌ కొనసాగింది.


రెండో ఆల్‌రౌండర్‌గా...

బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా (64 టెస్టుల్లో) నాలుగు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. మూడో రోజు ఆటలో జోసెఫ్‌ వికెట్‌ తీయగానే అతడు ఈ ఫీట్‌ సాధించాడు. విండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ 63 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి ముందున్నాడు. ఓవరాల్‌గా ఈ మైలురాయికి చేరిన వారిలో ఇయాన్‌ బోథమ్‌, కపిల్‌ దేవ్‌, కలిస్‌, వెటోరి ఉన్నారు.


సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204 ఆలౌట్‌; వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 318 ఆలౌట్‌; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 284/8 (జాక్‌ క్రాలే 76, సిబ్లే 50, స్టోక్స్‌ 46, బర్న్స్‌ 42, గాబ్రియెల్‌ 3/62, అల్జారీ జోసెఫ్‌ 2/40, రోస్టర్‌ చేజ్‌ 2/71).

Updated Date - 2020-07-12T09:12:23+05:30 IST