తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ ఘన విజయం

ABN , First Publish Date - 2020-07-13T05:47:20+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగిన...

తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ ఘన విజయం

సౌతాంప్టన్: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగిన ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ఆటతీరుతో రాణించి మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలో తడబడినప్పటికీ మిడిలార్డర్ రాణించడంతో 6 వికెట్ల కోల్పోయి పైచేయి సాధించింది. విండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో చేజ్  37 పరుగులు, బ్లాక్‌ ఉడ్ 95 పరుగులు, డౌరిచ్‌ 20 పరుగులతో రాణించారు. హోల్డర్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్‌ 3 వికెట్లు, బెన్ స్టోక్స్ 2 వికెట్లు, మార్క్ ఉడ్ ఒక వికెట్ తీశారు.


తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ బౌలర్లు హోల్డర్ 6 వికెట్లు, గాబ్రియేల్ 4 వికెట్లు తీసి రాణించడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో సత్తా చాటిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (65), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (61) అర్ధసెంచరీలతో రాణించగా పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగుల ఆధిక్యం సాధించింది. శుక్రవారం మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 102 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌కు నాలుగు, జేమ్స్‌ అండర్సన్‌కు మూడు, బెస్‌కు రెండు వికెట్లు దక్కాయి.


114 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు రోరీ బర్న్స్‌(42), సిబ్లే(50) పరుగులతో శుభారంభం ఇచ్చారు. డిన్లీ(50), క్రాలే(76), స్టోక్స్(46) పరుగులతో రాణించినప్పటికీ విండీస్ బౌలర్ల ధాటికి ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయారు. దీంతో.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 313 పరుగులకు ఆలౌటైంది. విండీస్ 200 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించి ఆరు వికెట్ల నష్టానికి టార్గెట్‌ను సాధించింది.

Updated Date - 2020-07-13T05:47:20+05:30 IST