మాకు టీకా కావాలి

ABN , First Publish Date - 2021-04-17T05:25:44+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు.

మాకు టీకా కావాలి
కాళ్ళ పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌కు నిరీక్షిస్తున్న జనం

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు 

వ్యాక్సిన్‌ అందక నిరాశగా వెనుతిరుగుతున్న జనం 

అవగాహనకు ఊరూవాడా ప్రచారం

మళ్లీ వచ్చేస్తోంది.. చుట్టుముట్టేస్తోంది.. ఎక్కడా చూసినా.. ఎక్కడ విన్నా అదే మాట.. కరోనా.. కరోనా.. సెకండ్‌ వేవ్‌ భయపెడుతోంది.. తుమ్ము వచ్చినా.. దగ్గు వచ్చినా ఉలిక్కిపడుతున్నారు. జ్వరం వచ్చిందంటే ఆసుపత్రు లకు పరుగులు పెడుతున్నారు.. నిన్న మొన్నటి వరకూ వ్యాక్సిన్‌ అంటేనే ఏమవుతుందోనని భయపడినవారు.. నేడు వ్యాక్సిన్‌ వేస్తారా వేయరా అంటూ క్యూ కడుతున్నారు. కరోనా అంతలా పరిస్థితిని మార్చేసింది.. అందరి మోములో మళ్లీ నేనున్నానే భయాన్ని చూపుతోంది. అయితే వ్యాక్సిన్‌ అందకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. 


కాళ్ళ/ఆకివీడు/ పాలకోడేరు/ ఉండి, ఏప్రిల్‌ 16 :  కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతి రోజు పీహెచ్‌సీలకు రావడం, వ్యాక్సిన్‌కు వేచి చూసి నిరాశగా వెనుదిరగడం ప్రజల వంతు అవుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటూ ప్రభుత్వం ఊరూవాడా ప్రచారం చేసింది. టీకా ఉత్సవ్‌ పేరిట 14, 15 తేదీలలో  అందరికి వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పడంతో ప్రతి రోజు వందలాది మంది ప్రతీ రోజూ వ్యాక్సిన్‌కు పీహెచ్‌సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీరా ఆసుపత్రికి వస్తే తమను వైద్య సిబ్బంది పటించుకోవడం లేదని వాపో తున్నారు. అయితే ఆసుపత్రుల వద్ద వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు, ఉండి తదితర మండలాల పీహెచ్‌సీలలో గురువారం, శుక్రవారం కూడా వ్యాక్సిన్‌ వేయలేదు. సోమవారం వరకూ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదనే సమాచారంతో సెకండ్‌ డోస్‌ వేయించుకోవాల్సిన ప్రజలు ఆగ్రహిస్తున్నారు. సోమవారం కూడా వ్యాక్సిన్‌ రాకపోతే ప్రజలు ఆందోళనలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.  వ్యాక్సిన్‌ స్టాకు రాకపోవడంతో వైద్యులు, సిబ్బంది ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.ఉండి, యండగండిలో గత రెండు రోజులుగా వ్యాక్సిన్‌కు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి మరి!


 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

పెనుగొండ/భీమవరం రూరల్‌, ఏప్రిల్‌ 16 : కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని పెనుగొండ సీహెచ్‌సీ హెడ్‌ నర్స్‌ ఈవీ.సుబ్బలక్ష్మి అన్నారు. సీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భీమవరం ఎంఈవో సీతారారాజు అన్నారు. ఎస్‌సీహెచ్‌ బీఆర్‌ఎం పాఠశాలలో పరిశుభ్రత పై హెచ్‌ఎంలు, ఇతర సిబ్బందికి శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి కేవీ సురేష్‌బాబు, తాడి రమేష్‌,  డాక్టర్‌ సులక్షణమణి, బీ శెరా, పి.రామారావు తదితరులు పాల్గొన్నారు. 


మాస్క్‌ లేకుండా బయటకు వస్తే ఫైన్‌..

పాలకోడేరు/పెనుమంట్ర,ఏప్రిల్‌16: పని ఉంటేనే బయటకు రావాలి తప్ప అనవసరంగా బయటకు రావొద్దని పాలకోడేరు ఎస్‌ఐ రామచంద్రరావు అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మాస్క్‌పై అవగాహన కల్పించారు. మాస్క్‌ లేకుండా వాహనాలపై వెళుతున్న వారిని ఆపి శుక్రవారం ఎస్‌ఐ రామచంద్రరావు, సిబ్బంది కరోనా నిబంధనలు వివరించారు. అనంతరం మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధించారు.  మాస్క్‌ లేకండా తిరిగితే జరి మానా విఽధిస్తామని పెనుమంట్ర పోలీసులు మైక్‌ ద్వారా హెచ్చరించారు. బయటకు వచ్చినపుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. ఎస్‌ఐ రమేష్‌ పర్యవేక్షణలో బ్రాహ్మణ చెరువు సెంటర్‌లో తనిఖీలు చేశారు.  


కరోనా నియంత్రణ అందరి బాధ్యత : సీఐ

పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 16 : కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు అన్నారు. పట్టణంలో పోలీసులతో కలిసి శుక్రవారం  గాంధీ బొమ్మల సెంటర్‌ నుంచి యడ్ల బజారు వరకూ అవగాహన ర్యాలీ చేశారు.  కరోనా నియంత్ర ణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. మాస్కులు ధరించనివారికి మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రెహ్మన్‌, ప్రసాద్‌, ఏఎస్‌ఐ ఏసుబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-17T05:25:44+05:30 IST