రేవులో ఛార్జీల బాదుడు

ABN , First Publish Date - 2021-10-19T05:14:29+05:30 IST

నరసాపురం– పాలకొల్లు మధ్య రోడ్డు మార్గంలో దూరం 10 కిలోమీటర్లు.

రేవులో ఛార్జీల బాదుడు

 200 మీటర్ల ప్రయాణానికి రూ.15 

నరసాపురం, అక్టోబరు 18:

నరసాపురం– పాలకొల్లు మధ్య రోడ్డు మార్గంలో దూరం 10 కిలోమీటర్లు. ఆర్టీసీ బస్సులో వెళితే రూ.10 టిక్కెట్‌, ఇటు నరసాపురం సఖినేటిపల్లి రేవుల మధ్య దూరం కేవలం 200 మీటర్లే. అయితే ఛార్జీ రూ.15 రూపాయలు, సైకిల్‌ తీసుకుని వెళితే...  రూ.20, బైక్‌ మీద రేవు దాటాలంటే రూ.30 జేబులో ఉండాల్సిందే. నిత్యం వేలాది మంది  ఈ రేవుల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఛార్జీల బాదుడు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ నిర్వహణలోనే ఛార్జీలు ఈ విధంగా ఉంటే..  పాటదారుడు చేతిలోకి రేవు వెళితే... టిక్కెట్‌ ధరలు ఏ విధంగా పెరుగుతాయోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వానికి అదాయం వచ్చే రేవుల్లో నరసాపురం– సఖినేటిపల్లి రేవు మొదటి స్థానంలో ఉంది. ఏటా పాట ద్వారా సుమారు రూ.2 కోట్లు పైనే ఆదాయం వస్తుంది. నిత్యం 5వేల నుంచి 10 వేల మంది ఈ రేవు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యామ్నాయంగా చించినాడ వంతెన ఉన్నప్పటికీ దగ్గరమార్గం కావడంతో ఎక్కువ మంది రేవు దాటి వెళ్లేందుకే మక్కువ చూపుతుంటారు. బ్రిటీష్‌ హయాం నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఈ కారణంగానే ఏటా నిర్వహించే రేవు పాట నిర్వహణలో కాంట్రాక్టర్లు రేవును దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. 

       గతంలో టిక్కెట్‌ ధరలను ప్రభుత్వం నిర్ధేశించేది. పాటదారుడు పెద్ద మొత్తంలో రేవును దక్కించుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే టిక్కెట్‌లను విక్రయించాల్సి వచ్చేది. అయితే ఈ విధానాన్ని మార్చి జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి అధికారాలు కల్పించారు. ఈ కమిటీలో ప్రజాప్రతినిధులతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఆధికారులు సభ్యులుగా ఉన్నారు. గతంలో రేవు టిక్కెట్‌ ధర రూ.5 ఉండేది. దీన్ని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రూ.10కి పెంచింది. మూడేళ్ళ క్రితం వరకు ఇదే ధర కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేవు పాట పెండింగ్‌ పడింది. టెండర్లు వేసినా... కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఈకారణంగా రెండేళ్ళ నుంచి పాట కొనసాగడం లేదు. ప్రభుత్వమే రేవు నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. టెండర్లు పెండింగ్‌ పడినా.. టిక్కెట్‌ ధరలను మాత్రం భారీగా పెంచేశారు. గతంలో రూ.10 ఉన్న టిక్కెట్‌ను రూ.15 చేశారు. సైకిల్‌పై రేవు దాటాలంటే రూ.20, ఆదే బైక్‌ అయితే రూ.30, జంతువులను తీసుకెళితే... రూ.15, జంతువు పెద్దది అయితే రూ.30, 20 కేజీలు దాటిన లగేజీకి రూ.20  టిక్కెట్‌ ధరలను నిర్ధేశించారు. పాటదారుడు లేకపోవడంతో పంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది, కార్యదర్శులు రేవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు షిఫ్ట్‌లుగా 12 మంది విధులు చేపడుతున్నారు. పంటు మీద డ్రైవర్‌, ఇతర ఇద్దరు సిబ్బంది, డీజిల్‌కు మాత్రమే ఖర్చు ఉంటుంది. అయినా ఛార్జీలు భారీగా పెరగడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలోనే ఛార్జీలు ఈ విధంగా  ఉంటే.. రేవు పాటదారుడు చేతిలోకి వెళితే.. ఛార్జీలు ఇంకెంత పెరుగుతాయోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మండల పరిషత్‌ అధికారులు మాత్రం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సిపార్సుల మేరకు ఛార్జీలు పెంచామని చెప్పడం కొసమెరుపు. 

Updated Date - 2021-10-19T05:14:29+05:30 IST