Abn logo
Oct 27 2021 @ 23:32PM

డెంగీ డేంజర్‌ బెల్స్‌

ఏలూరు మండలంలో పెరుగుతున్న కేసులు 

ఇప్పటి వరకు మండలంలో 40... శనివారపుపేటలోనే 8 నమోదు

అధికారుల నిర్లక్ష్యం.. తూతూమంత్రంగా చర్యలు

ఏలూరు రూరల్‌, అక్టోబరు 27 : 

ఏలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో డెంగీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అధికారికంగా మండలంలో 40 డెంగీ కేసులు నమోదు కాగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పారిశుధ్యం విషయంలో వైద్య సిబ్బంది, అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో సీజనల్‌  వ్యాధులతో పాటు డెంగీ విజృంభిస్తోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో విష జ్వరాలు సోకడం వల్ల  ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు.


ఏలూరు మండలంలో డెంగీ విజృంభిస్తోంది. వర్షాకాలం వర్షాలతో జనా వాసాల మధ్య అక్కడక్కడ నీరు నిలిచి దోమల సమస్య పెరగడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏలూరు మండ లంలోని శనివారపుపేటలో డెంగీ కేసులు వెలుగుచూశాయి. అధికారులు నిర్ల క్ష్యంతో గ్రామాల్లో పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. శని వారపుపేటలో ఐదు రోజుల క్రితం ఇద్దరికి జ్వరం వచ్చి తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించగా డెంగీగా తేలింది. అయితే మండలంలో ఇప్పటి వరకూ డెంగీ కేసులు 40 నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 8 కేసులు శనివారపు పేటలోనే నమోదయ్యాయి. బాధితులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది కోలుకోగా మరికొంత మంది చికిత్స పొందుతు న్నారు. అయితే లెక్కల్లోకి రాని ప్రైవేటు ఆస్పత్రుల్లో చిక్సిత పొందిన డెంగీ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 సీజన్‌కు అనుగుణంగా మురుగువాడలు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. జాలిపూడిలో మలే రియా, చాటపర్రు, పాలగూడెం, శనివారపుపేట ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కు వగా నమోదవుతున్నాయి. చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద ఎక్కువగా ఉంది.

 విష జ్వరాలు ముప్పేటదాడి చేసి డెంగీ కేసుల సంఖ్య అమాంతంగా పెర గడంతో అధికారులు దృష్టి సారించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవి, జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ మలేరియా అధికారి గోవిందరావు తదితరులు శనివారపుపేటలో డెంగీ ప్రబలిన ప్రాంతాల్లో పరిశీలించారు. ఆయా పరిసరాల్లో చెత్తాచెదారం, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గురించి గ్రామస్థులతో చెప్పి శుభ్రం చేయించారు. మురుగునీరు నిల్వ లేకుండా చూసుకుంటూ ఏమాత్రం లక్షణాలు ఉన్నా వైద్యుని సంప్రదించా లని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు వస్తే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం చేసుకోవద్దని సూచనలు చేశారు. డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 


సూపర్‌ శానిటేషన్‌ చేశాం : కార్యదర్శి ఠాగూర్‌, శనివారపుపేట

గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాం. డెంగీ ప్రబలిన ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టాం. డ్రైయిన్లలో మురుగు నిల్వ ఉండ కుండా యుద్ధప్రాతిపదికన సిల్టు తొలగించాం. ఖాళీ తొట్టెలు, రబ్బర్‌ ట్యూబ్‌లను తొలగించాం. పరిసర ప్రాంతాలన్నీ బ్లీచింగ్‌ జల్లి శుభ్రం చేశాం.


డెంగీపై భయం వద్దు.. అప్రమత్తంగా ఉండండి

జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ప్రసాద్‌ 

దెందులూరు, అక్టోబరు 27 : డెంగీ జ్వరాల పట్ల భయపడకుండా  ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ప్రసాద్‌ అన్నారు. గోపన్నపాలెం, వేగవరం, డెంగీ జ్వరాలు నమోదైన ప్రాంతాల్లో సర్పంచ్‌ కోటి నాగమల్లేశ్వరి, కుమార్‌, గోపన్నపాలెం ప్రభుత్వాస్పత్రి వైద్యులు డాక్టర్‌ త్రినాథ్‌రెడ్డితో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు జ్వరాల నివారణకు ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహి స్తున్నామన్నారు. గ్రామస్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తున్నా మన్నారు. వారి వెంట డాక్టర్లు గోవిందరావు, ఎంపీహెచ్‌వో నాగరాజు, పందిర శ్రీను, సూపర్‌వైజర్‌ సూర్యనారాయణ, ఏఎన్‌ఎం పద్మ, రమేష్‌ వైసీపీ నేత కామ కుమార్‌, మాజీ సర్పంచ్‌ కొండేటి హనుమంతు, ఉప సర్పంచ్‌ హేమసాగర్‌, ఎంపీటీసీ ఏనుగు అంజలి ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

శనివారపుపేట డెంగీ ప్రబలిన ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి తదితరులు