గెలిచినా.. ఓడినా.. అప్పులే

ABN , First Publish Date - 2021-03-03T05:46:30+05:30 IST

మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు కొందరికి ఓటమితో పాటు అప్పులు, ఇంకొందరికి విజయంతో పాటు అప్పులు మిగిల్చాయి.

గెలిచినా.. ఓడినా.. అప్పులే

ఏలూరు రూరల్‌, మార్చి 2: మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు  కొందరికి ఓటమితో పాటు అప్పులు, ఇంకొందరికి విజయంతో పాటు అప్పులు మిగిల్చాయి. ఎన్నికలయ్యాక ఖర్చుల లెక్కలు తీస్తే వామ్మో అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఖర్చుకు వెను కాడకుండా ప్రతిష్టకు పోయి అప్పు చేసి మరీ ఖర్చుపెట్టా. ఇప్పుడు లెక్కలన్నీ చూస్తే గుండె గుభేలు మంటోందని కొంత మంది అభ్యర్థులు తమ తోటి నాయకుల వద్ద దీనంగా చెప్పుకున్నట్టు సమాచారం. గెలుపు మాట అటుంచితే చేసిన వ్యయాన్ని తెచ్చిన అప్పు చూస్తుంటే గుండె దడ పెరిగిపోతోందన్నారు. మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల్లో ఖర్చు పెరిగిందని సర్పంచ్‌గా ఎన్నికైన ఓ వ్యక్తి వాపోయాడు. ఏలూరు మండలంలోని 15 పంచాయతీలు దెందులూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. వీటిలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా 12 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్యే హోరాహోరీగా పోటీ జరిగింది. పోటీల్లో గెలుపు కోసం ఇరువర్గ అభ్యర్థులు నజరానాలు పంచారు. మండలంలోని ఓ గ్రామంలో పోటీ చేసిన అభ్యర్థి కొంత భూమిని విక్రయించి మరీ ఎన్నికల్లో దిగారు. కానీ అతని కళ్లల్లో ఆనందం మాత్రం లేదు. కొన్ని గ్రామాల్లో అయా అభ్యర్థులు భారీగానే ఖర్చు చేశారు. కొందరు నామినేషన్లు వేయక ముందు నుంచే విందు భోజనాలతో పండుగ వాతావరణం సృష్టించారు. దీంతో ఖర్చు తడిసి మోపెడైందని ఆవేదన చెందుతున్నారు. గతంలో సర్పంచ్‌ అభ్యర్థులు మాత్రమే నగదు పంచేవారు. ఈసారి మండలంలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా వార్డులకు మాత్రం పోటీ జరిగింది. పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడలేదు. ఎన్నికల అనంతరం ఓడిన అభ్యర్థులు ఓటమి భారంతో ఉండగా గెలిచిన అభ్యర్థులు  ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.  


Updated Date - 2021-03-03T05:46:30+05:30 IST