Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాపం.. పసివాడు

బతికుండగానే శ్మశానానికి..

కాటి కాపరి సమాచారంతో ఆసుపత్రికి..

పసికందు ఆచూకీ కోసం అధికారుల ఆరా 

రాజమహేంద్రవరం శ్మశానవాటికలో ఘటన

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స


కొవ్వూరు: ఏ తల్లి కన్నబిడ్డో పాపం. కనుగుడ్డు కూడా తెరవకుండానే కాటికి చేరాడు. తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చగా పడుకోవాల్సిన చిన్నారి. నెలలు నిండలేదనో, మరి ఏ కారణమో తెలియదు. ఏం జరిగిందో ఏమో గాని పుట్టిన వెంటనే బాబును బాక్స్‌లో పెట్టి రాజమహేంద్రవరం స్మశానవాటికలో వదిలివేసిన విషాద ఘటన ఇది. కొవ్వూరులోని నియోనిటల్‌ అంబులెన్స్‌ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం. రాజమహేంద్రవరం శ్మశాన వాటికకు ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో అప్పుడే పుట్టిన మగ బిడ్డ చనిపోయిందని తీసుకువచ్చి ఒక పెట్టెలో ఉంచి వెళ్లిపోయారు.


పెట్టెలో ఉన్న మగశిశువు బతికి ఉండడం గమనించిన కాటికాపరి శివ స్థానిక మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్న వెంకటేష్‌, తుంపాల దేవి దంపతుల సహాయంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేందుకు నిరాకరించడంతో, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కొవ్వూరు 108 నియోనిటల్‌ (చిన్న పిల్లలకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌) అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది శాంతకుమార్‌, పైలట్‌ బుల్లిరాజులు శిశువుకి అత్యవసర వైద్య సేవలందించారు. మరింత మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనిటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. శిశువుకు సంబంధించిన సమాచారం లేనందున తూర్పుగోదావరి జిల్లా ఐసీడీఎస్‌ అధికారులకు, పశ్చిమ గోదావరి జిల్లా 108 మేనేజర్‌ కె.గణేష్‌కుమార్‌కు సమాచారం అందజేశామన్నారు. 

Advertisement
Advertisement