ఏలూరు పీఠం ఎవరిది ?

ABN , First Publish Date - 2021-05-08T06:11:31+05:30 IST

జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.

ఏలూరు పీఠం ఎవరిది ?

ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ 

 ఓటర్ల జాబితాలో అవకతవకలపై పిటీషన్లు

 మార్చి 10న పోలింగ్‌ నిర్వహణ

 సుదీర్ఘ విచారణ తర్వాత ఓట్ల లెక్కింపునకు అనుమతి

 కౌంటింగ్‌ తేదీ త్వరలో వెల్లడి

 కోర్టు తీర్పుతో అధికార పార్టీ నేతల్లో ఉత్సాహం

ఏలూరు నగరపాలక సంస్థకు 

జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. హైకోర్టు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు నెలల నిరీక్షణ తర్వాతనగర ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిం ది. శుక్రవారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరుపుకోవచ్చని తీర్చునిచ్చింది. ఎన్నికల సంఘం లెక్కింపునకు ముహూర్తాన్ని ఖరారు చేయాల్సి ఉంది. 

తాడేపల్లిగూడెం, ఏలూరు టూ టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి):గతేడాది మార్చిలో నగరపాలక సం స్థకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. వీటి పరిశీలన దశలో 15న కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటి కీ 50 డివిజన్లకు 287 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏడాది తర్వాత 2021 ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 171 నామినేషన్లు మిగిలాయి. మార్చి 10న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. గెలుపుపై ధీమాతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నువ్వా నేనా అన్న రీతిలో తలప డ్డాయి. ప్రచారంలో వైసీపీ, టీడీపీ నేతలు కాక పుట్టించారు. ఒక దశలో టీడీపీ, జనసేన పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రచారపర్వం ముగుస్తుం దన్న తరుణంలో పలువురు హైకోర్టును ఆశ్రయిం చారు. ఓటర్ల నమోదులో అనేక అవకతవకలు జరి గి, తప్పులు తడకగా మారాయని, వీటిని సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి 8న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది. అప్పటి వరకు తాయిలాలు పంచుకుంటూ డబ్బులు వెదజ ల్లుతూ ప్రచారం సాగించిన అభ్యర్థులు ఒక్కసారిగా హతాశులయ్యారు. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం డివి జన్‌ బెంచ్‌ని ఆశ్రయించగా 9వ తేదీ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ ఎన్నికలు నిర్వహించు కోవచ్చని, అయితే ఓట్ల లెక్కింపు జరపవద్దని స్పష్టం చేసింది. దీంతో అటు అభ్యర్థులకు, ఇటు అధికారులకు ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. 10న పోలింగ్‌ నిర్వహించారు. 

గెలుపుపై అధికార పార్టీ ధీమా

అధికార పార్టీలో గెలుపుపై ధీమా నెలకొంది. మంత్రి ఆళ్ల నాని ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిం చారు. ప్రతిపక్షానికి స్థానికంగా పెద్ద దిక్కు లేక పోయినప్పటికీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి, దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింత మనేని ప్రభాకర్‌ అంతా తానై వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినా లెక్కింపు కోసం ఎదు రుతెన్నులు చూశారు. అప్పటి నుంచి విచారణ దఫదఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చింది. శుక్రవారం డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపు సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఏలూరు కార్పొరేషన్‌పై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో అధికార, ప్రతిపక్ష పార్టీకి ఓట్ల విషయంలో పెద్ద తేడా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీకి కాస్త అధికంగా ఓట్లు నమోదైనట్టు ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఆ లెక్కన ఇప్పుడు కార్పొరేషన్‌లో తమదే పైచేయి ఉంటుందన్న ధీమా ఆ పార్టీలో నెలకొంది. మరోవైపు సాధారణంగానే అధికార పార్టీ లోనూ గెలుపుపై ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు అనేది ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లెక్కింపులో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు దిశా నిర్దేశం చేసింది. ఎన్నికలు ముగిసినా సరే ఓట్లు లెక్కింపు వాయిదా పడడంతో అంతా నిరు త్సాహపడ్డారు. తాజా నిర్ణయంతో అందరిలోనూ గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. 


47 డివిజన్లలో పోలింగ్‌

విలీన గ్రామాలతో మొదటిసారిగా ఏలూరు నగర పాలక  సంస్థకు ఏడు విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించారు. తంగెళ్లమూడి, శనివారపుపేట, సత్రంపాడు, వెంకటాపురం, పోణంగి, చొదిమెళ్ల, కొమడవోలును నగరంలో విలీనం చేశారు.  50 వార్డులకుగాను, మూడు ఏకగ్రీవం కావడంతో.. 47 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాలతో కలిపి నగర జనాభా 2,71,876. వీరిలో ఓటర్లు 2,32,972. పోలై న ఓట్లు 1,32,478. అతి తక్కువగా 56.86 శాతం ఓట్లు పోలయ్యాయి.  ఏలూరు మేయర్‌ పీఠం జ నరల్‌ మహిళకు రిజర్వు చేశారు. వైసీపీ నుంచి 50 మంది, టీడీపీ 43, జనసేన 19, బీజేపీ 14, సీపీఐ 3, సీపీఎం 1, కాంగ్రెస్‌ 2, ఇండిపెండెంట్లు 39 మంది మొత్తం 171 మంది బరిలో నిలిచారు.


తేదీ నిర్ణయించాల్సి ఉంది : డి.చంద్రశేఖర్‌, నగర కమిషనర్‌  

ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తేదీని ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుంది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు కాపీ వచ్చిన తరువాత ఎన్నికల కమిషన్‌కు అప్పీలు చేస్తాం. ఎప్పుడు ఓట్ల లెక్కింపు జరగాలనేది ఎన్నికల కమీషన్‌ నిర్ణయం మేరకు ఉంటుంది.  


Updated Date - 2021-05-08T06:11:31+05:30 IST