కుటుంబాల్లో కల్లోలం..

ABN , First Publish Date - 2021-05-17T06:09:14+05:30 IST

కరోన మహమ్మారి జీవితాలను సర్వ నాశనం చేస్తూ.. కుటుంబాలను దిక్కూ మొక్కూ లేకుండా రోడ్డున పడేస్తోంది.

కుటుంబాల్లో కల్లోలం..

కరోనాతో జీవితాలు ఛిద్రం

పాలకొల్లు/జంగారెడ్డిగూడెం/ఆకివీడు/తాడేపల్లిగూడెం రూరల్‌/ఇరగవరం/పెంటపాడు, మే 16 : కరోన మహమ్మారి జీవితాలను సర్వ నాశనం చేస్తూ.. కుటుంబాలను  దిక్కూ మొక్కూ లేకుండా రోడ్డున పడేస్తోంది. అప్పటి వరకు ఆనందంగా వున్న కుటుంబాల్లో వరుస మరణాలు దిగ్ర్భాంతికి గురి చేస్తున్నారు. రోజులు, వారాల వ్యవధిలో ముగ్గురు, నలుగురి వరకు ఆప్తులు దూరమవుతుండటంతో పెను విషాదంతో కుప్పకూలుతున్నాయి. అయిన వారు కాలం చేసినా.. తెలియకుం డానే రోజులు, నెలలు గడపాల్సిన దుస్థితి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మందికి తమవాళ్లు అప్పటికే కరోనాతో పోయారన్న సంగతే తెలియడం లేదు. కోలుకున్నాక తెలిస్తే వారి గుండెలు బద్ధలవుతున్నాయి. ఆధారాన్ని కోల్పోయి రాత్రికి రాత్రే రోడ్డు మీద పడుతున్నాయి. ఎదిగొచ్చిన పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. కన్న వారిని కోల్పోయి చిన్నారులు.. భర్తను కోల్పోయి భార్యలు కన్నీరు మున్నీరవుతున్నారు. కడచూపుకూ నోచుకోలేక పోయామేనని కన్నీటి పర్యంతమవుతున్నారు. పాలకొల్లుకు చెందిన ఓ పెద్దాయన భార్య చనిపోయి రెండు నెలలు తిరక్కుండానే హైదరాబాద్‌లోని మనుమరాలు మృత్యువాత పడింది. విషయం పెద్దాయనకు తెలియకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు పెద్దాయన సెల్‌ఫోన్‌ను రిపేరు వచ్చిందంటూ తీసేసుకున్నారు. టీవీల్లో వార్తలు తెలిస్తే తట్టుకోలేరని, పొరపాటున జారిపడినట్టు టీవీని బద్దలుకొట్టారు. ఈ విషయం తెలియని ఆయన.. ఇంత ఆస్తులుండి నా కోసం ఓ సెల్‌ ఫోన్‌, ఓ టీవీ ఇవ్వలేరా ? అంటూ దీనంగా అడిగే సరికి వీరికి ఏం చెప్పాలో  అర్థం కాక మనసులోనే కుమిలిపోతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పాలకొల్లులోని ఓ ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆరోగ్యం మెరుగు పడింది, ఇంటికి తీసుకుని వెళ్లవచ్చని డాక్టర్లు చెప్పారు. కానీ, వారం క్రితమే అతడి తల్లి, ఒక రోజు క్రితం బావమరిది చనిపోయాడని ఈ విషయాలు అతడికి తెలిస్తే ఆరోగ్యం క్షీణిస్తుం దని భయపడ్డారు. మరి కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని బంధువులు ప్రాధేయపడ్డారు. కుటుం బానికి ఆర్థికంగా దన్నుగా.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఓ భరోసాగా.. కష్టనష్టాల్లో ధీమాగా ఉండే పెద్దలను కోల్పోయిన వారిదైతే మాటలకందని బాధ. కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి గ్రామాలు, పట్టణాల్లో ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి !  


  మూడు రోజుల్లో..  తల్లీ కొడుకులు

ఈ నెల 2న ఆకివీడుకు చెందిన కమ్యూనిస్టు నేత మారుబోయిన లెనిన్‌బాబు కరోనాతో చనిపోతే.. ఈ విషయం తెలియకుండానే.. ఆయన తల్లి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న తల్లి సావిత్రమ్మ ఐదో తేదీ మరణించారు. లెనిన్‌బాబుకు అంతిమ సంస్కారాన్ని ముగ్గురు కుమార్తెలు జరిపారు. తర్వాత ఆయన భార్య, పెద్ద కుమార్తెకు కరోనా రావడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకొని ఐదు రోజుల క్రితం ఆకివీడు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడం ఆ కుటుంబాన్ని దహించేస్తోంది. ఆ ఇంట ఇప్పుడు మునుపటి ఆనందం లేదు. విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు.  


  ఉదయం ఒకరు.. సాయంత్రం ఇంకొకరు

పెంటపాడు మండలం కె.పెంటపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఉడిమూడి విజయ్‌కుమార్‌(42) కరోనా లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదే రోజు సాయంత్రం తల్లి వి.కెంపురత్నం(75) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకేరోజు కుటుంబంలో తల్లీ కొడుకులు మృత్యువాత పడటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


తల్లి.. కొడుకు.. కోడలు

పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం శివారు గొల్లవానిచెరువులో 20 రోజుల కిత్రం బోళ్ళ సుబ్బమ్మ(85) కరోనాతో మృత్యువాత పడగా.. నాలుగు రోజుల వ్యవధిలో కుమారుడు సత్యప్రసాద్‌(63) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో రెండు రోజులకు ఆయన భార్య ప్రసూన(56) చికిత్స పొందుతూ మరణించారు. వారం వ్యవధిలో తల్లిదండ్రులు, నానమ్మలను కడసారి చూసుకునే అవకాశం లేకపోవడంతో కుమార్తెలు తీవ్ర మనో వేదనకు గురయ్యారు.  


కుటుంబాన్నే చుట్టేసింది

జంగారెడ్డిగూ డెంకు చెందిన ఆడిటర్‌ కొత్త కేశవరావు రెండేళ్ల క్రితమే గుండె పోటుతో చనిపో యారు. ఆయన ముగ్గురు కుమా రుల్లో శివరామకృష్ణ ఫర్నీచర్‌ వ్యాపారం చేస్తుండగా రాజా ఆడిటర్‌గాను, సూర్యనారాయణ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కారణంగా శివరామకృష్ణ చనిపోగా, మూడు రోజుల వ్యవధిలో తల్లి లక్ష్మి,  ఆ తర్వాత వరుసగా మిగిలిన ఇద్దరు  సోదరులు చనిపోయారు. నెల వ్యవధిలో తల్లి, ముగ్గురు కుమారులు వరుస మరణాలతో కుటుంబానికి పెద్ద షాక్‌ తగిలింది. అందరితో స్నేహంగా ఉండే వీరి మరణం కుటుంబాన్నే కాదు.. బంధుమిత్రుల్లోనూ తీవ్ర విషాదాన్ని అయోమయం నింపింది. 


 ఒకే రోజులో తండ్రీ కొడుకులు

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లికి చెందిన పసుమర్తి సత్యనారాయణ(62), ఆయన కుమా రుడు శ్రీనివాసరావు (40)కు కరోనా సోకింది. ఇద్దరూ ఇంటి వద్దే చికిత్స పొందుతుండగా కుమారుడి పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆశ్రంకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోగా, మరుసటి రోజు తండ్రికి ఊపిరాడకపోవడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూ శారు. ఇద్దరూ గంటల వ్యవధిలోనే మృత్యువాత పడటంతో మగ దిక్కులేక ఆ కుటుంబం రోడ్డున పడింది. శ్రీనివాసరావు తల్లి, భార్య, కుమార్తె, కుమారుడి జీవితాల్లో ఇప్పుడు అంధకారం నెలకొంది.  


 తల్లికి సేవ చేయడానికి వచ్చి..

ఇరగవరం మండలం రేలంగికి చెందిన ఉండ్రావరపు మరియమ్మ(70)కు కరోనా సోకింది. తల్లి ఇబ్బందులు తెలుసుకుని సేవ చేసేందుకు కుమార్తె సిర్రా స్వర్ణరత్నం (55) వచ్చింది. బంధువుల సాయంతో తల్లిని తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేస్తుండగా ఆమె మృతి చెందింది. అనంతరం కుమార్తెకు కరోనా పాజిటీవ్‌ వచ్చింది. ఆమె శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి సోదరి మృతితో.. ఉద్యోగం నిమిత్తం గల్ఫ్‌లో కుమారుడు రాలేని పరిస్థితి. గ్రామస్తులే వీరి అంతిమ సంస్కారం నిర్వహించారు.


Updated Date - 2021-05-17T06:09:14+05:30 IST