యంత్రసేవ ఏది?

ABN , First Publish Date - 2021-06-18T04:47:08+05:30 IST

గతంలో వ్యవసాయంలో పశువులు ప్రముఖ పాత్ర పోషించేవి.

యంత్రసేవ ఏది?

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఊసే లేదు

ఏలూరు మండలంలో 16 రైతు సంఘాల ఏర్పాటు

అందని సబ్సిడీ యంత్రాలు..రైతుల ఆవేదన

ఏలూరు రూరల్‌, జూన్‌ 17: గతంలో వ్యవసాయంలో పశువులు ప్రముఖ పాత్ర పోషించేవి. కాలక్రమంలో గణనీయంగా తగ్గిపోవడంతో యంత్రాలు భాగ మయ్యాయి. యంత్రాలు అత్యంత ఖరీదైనవిగా ఉండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఇది అందని ద్రాక్షలా మారాయి. ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర సామగ్రిని అందించడానికి అద్దె యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అవసర మైన రైతు సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆప్కాబ్‌, డీసీసీబీ బ్యాంకుల ఆధ్వర్యంలో యంత్రాల కొనుగోలుకు అవసరమైన రుణ మొత్తాలను అందిస్తోంది. ఇందులో రైతు సంఘాలు పది శాతం పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ 40 శాతం అందించేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇప్పటికీ దాదాపు 19 నెలలు గడుస్తున్నా కాగితాలకే పరిమితం అయ్యాయే తప్ప కార్యకలాపాలకు ఏమాత్రం నోచుకోవడం లేదు. గతంలో ప్రతి ఏడాది రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు, పిల్లర్‌, రోటావేటర్‌ వంటి వ్యవసాయ పనిముట్లను అందిస్తూ చేదోడు గా ఉండేవి. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కేవలం విత్తన పంపిణీకి మాత్రమే పరిమితమయ్యాయి. రైతుకు భరోసాగా నిలవడం లేదు. అగ్రి అడ్వయిజరీ బోర్డులు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పు కోవడం తప్ప వాటి నుంచి ఏమాత్రం ప్రయోజనం లేదని అన్నదాతలు అస హనం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో 16 రైతు సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా సబ్సిడీ యంత్రాలు అందించడం లేదు. కేవలం సబ్సిడీపై వరి విత్తనాలు, టార్ఫాలిన్‌లు, పిచికారీ యంత్రాలు మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయ యాంత్రీకరణ విధానం అమలు చేస్తేనే గాని వ్యవ సాయం మరింత అభివృద్ధి చెందదని అధిక శాతం రైతులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నా రైతు భరోసా కేంద్రాల్లో కస్టం హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీచేసినా ఇప్పటికీ పీహెచ్‌సీలపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వ్యవసాయ పనిముట్లను అందించాలి

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా రైతులకు ఎటువంటి పని ముట్లను అందించలేదు. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించాలి. రైతులపై మొసలి కన్నీరు కార్చడం మార్చుకోవాలి.

–పి.రామకృష్ణ, చొదిమెళ్ల


అద్దె యంత్ర సేవా కేంద్రాలు అందుబాటులో ఉంచాలి

అద్దె యంత్ర సేవా కేంద్రాలు అందుబాటులో తెచ్చి చిన్న, సన్న కారు రైతు లకు అండగా నిలవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో దిగుబడి కంటే పెట్టుబడి అధికంగా ఉంటోంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 

– ముసలయ్య, రైతు, మాదేపల్లి 

Updated Date - 2021-06-18T04:47:08+05:30 IST