Abn logo
Sep 26 2021 @ 23:39PM

సముద్రం అల్లకల్లోలం

పీఎం లంక వద్ద ఎగసిపడుతున్న అలలు

ఎగసిపడుతున్న అలలు

రేపటి వరకు వేట నిషేధం...గులాబ్‌ ఎఫెక్ట్‌

నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 26: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆదివారం సాయంత్రం నుంచి ప్రభావం మరింత పెరిగింది. దీంతో అలలు ఎగసిపడుతున్నాయి. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్‌ తీరందాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన బోట్లన్నీ  ఒడ్డుకు చేరాయి. ఆదివారం మత్స్యకారులెవరూ వేటకు వెళ్లలేదు. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో దరిచేరిన బోట్లు, వలలను భద్రపర్చుకున్నారు. మరోవైపు తుఫాన్‌ తీరం దాటినా.. ఈ ప్రభావం రెండు మూడు రోజులు ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మత్స్యశాఖ అధికారులు వేట నిషేధాన్ని ఈనెల 28 వరకు పొడిగించారు. తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నరసాపురంలో కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 08814–275048, 0844–296465 అని తెలిపారు.

రైళ్ల రూటు మార్పు

తుఫాన్‌ కారణంగా జిల్లా మీదగా భువనేశ్వర్‌, హౌరా వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళ రూట్‌ మార్చారు. కొన్ని రైళ్ళ సమయాలను మార్చారు. చైన్నై–హౌరా, యశ్వంత్‌పూర్‌–పూనా, హైదరాబాద్‌– హౌరా, సికింద్రాబాద్‌–హౌరా, త్రివేండ్రం –కోల్‌కతా, తిరుపతి–హౌరా, తిరుపతి –బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఈ రైళ్ళను బలాషా, బిలాస్‌పూర్‌, టాటానగర్‌ మీదుగా రూటు మళ్లించారు. ఈనెల 26 నుంచి 28 వరకు ఈ రైళ్ళు షెడ్యూల్‌ను మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక హౌరా–యశ్వంత్‌పూర్‌, హౌరా–పాండిచ్చేరి రైళ్ళ సమయాలను మార్చారు.