సాగు చేసేదెట్టా...

ABN , First Publish Date - 2021-06-14T04:13:50+05:30 IST

మొన్నటి వరకూ ధాన్యం అమ్ముకోవడానికి అగచాట్లు పడిన రైతులకు ఇప్పుడు ధాన్యం సొమ్ము రావడంలో జాప్యం జరగడంతో సాగు కష్టాలు మొదలయ్యాయి.

సాగు చేసేదెట్టా...

 రైతుల ఖాతాల్లో జమకాని రబీ ధాన్యం సొమ్ము 

 పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేదు...

 రైతులపై పెరుగుతున్న రుణదాతల ఒత్తిడి


దండగర్రకు చెందిన బందెల కృష్ణకు ఎకరం పొలం సొంత భూమి ఉంది. దానితోపాటు మరో 10 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. అయితే ఈపొలం ధాన్యాన్ని ఏప్రిల్‌ నెలలో ఆర్‌బీకే ద్వారా ప్రభుత్వానికి అమ్మాడు. ప్రభుత్వం నుంచి రూ.7 లక్షల వరకూ అతనికి రావాల్సి ఉంది. కానీ నేటికి పైసా రాలేదు. దీనికి తోడు క్రాప్‌ లోన్‌ కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి. ఇదిలా ఉంటే ఏడాది లోపు ఆ లోను సొమ్ము కట్టకుంటే ప్రభుత్వం నుంచి లభించే సబ్సీడి కూడా వర్తించదు. బకాయిల చెల్లింపు, ఖరీఫ్‌ పంటకు పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

ఉప్పరగూడెం శివారు తాళ్లపాలెంకు చెందిన సి.వెంకట్రావుకు మూడెకరాల పంట ధాన్యాన్ని మే మొదటి వారంలో ప్రభుత్వానికి తూశాడు. అయితే నేటికీ ఆ ధాన్యం సొమ్ములు పడలేదు. ధాన్యం తూసేందుకు సంచులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ రైతు ఇప్పుడు సొమ్ముల కోసం సంకట స్థితిలో పడ్డాడు.


తాడేపల్లిగూడెం అగ్రికల్చర్‌, జూన్‌ 13: మొన్నటి వరకూ ధాన్యం అమ్ముకోవడానికి అగచాట్లు పడిన రైతులకు ఇప్పుడు ధాన్యం సొమ్ము రావడంలో జాప్యం జరగడంతో సాగు కష్టాలు మొదలయ్యాయి. ఒక పక్క గతేడాది తెచ్చిన క్రాప్‌లోను కట్టలేక ఒక వైపు, పండించిన పంట ఒబ్బిడి చేసేందుకు సహకరించిన కోత మిషన్‌, ట్రాక్టర్‌లకు బకాయిలు చెల్లించలేక మరో వైపు నలిగిపోతున్నారు. ఈ బకాయిలు ఇలా ఉండగా మెట్ట ప్రాంత రైతులకు సాగు కష్టాలు మొదలయ్యాయి. దీంతో అయిన కాడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మాదిరిగా దళారులకు ధాన్యం తూస్తే కనీసం పెట్టుబడికి అయినా దళారుల నుంచి సొమ్ము తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సొమ్ముల కోసం ఎవరిని అడగాలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. 

ఖరీఫ్‌ సాగుకు పాట్లు... 

రబీ సీజన్‌ పూర్తయింది. మెట్ట ప్రాంత రైతులు అప్పుడే ఖరీప్‌ పనులు ప్రారంభించారు. రబీ పంట ధాన్యం సొమ్ము రాకపోవడంతో అప్పులు చేసి మరీ పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎటు చూసినా రైతుల వద్ద సొమ్ములు లేకపోవడంతో భారీగా వడ్డీలు వసూలు చేసే వ్యాపారుల వద్ద సొమ్ములు తెచ్చి సాగుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతుల కష్టం వడ్డీల రూపంలోపోయేలా కనిపిస్తోంది. 

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

భీమడోలు, జూన్‌ 13 : రైతులు అమ్మిన ధాన్యం సొమ్ములను వెంటనే చెల్లించా లని కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో కౌలు రైతు సంఘం అధ్యక్షుడు  శ్రీరామ చంద్ర మూర్తి పేర్కొంటూ రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం అమ్మి రెండు నెలలు అయినా సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2021-06-14T04:13:50+05:30 IST