పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ కోసం పోరాడదాం

ABN , First Publish Date - 2022-01-22T05:01:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ లను అమలుపర్చాలని, పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర సమస్యలపై ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలన్నీ ఐకమత్యంతో పోరాటాలు సాగించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎ.ఎస్‌.ఆర్‌.చంద్రమూర్తి (రాంబాబు) తెలిపారు.

పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ కోసం పోరాడదాం
అర్బన్‌ పీహెచ్‌సీ వద్ద నినాదాలు చేస్తున్న ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ నాయకులు

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ లను అమలుపర్చాలని, పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర సమస్యలపై ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలన్నీ ఐకమత్యంతో పోరాటాలు సాగించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎ.ఎస్‌.ఆర్‌.చంద్రమూర్తి (రాంబాబు) తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పీఆర్సీ సాధన సమితి కింద ఏర్పాటు చేయబడిన ఉద్యమ కార్యాచరణ రూపొందించే అవకా శం ఉందని, భవిష్యత్‌ కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పా రు. ఐక్యతతోనే సమస్యలను సాధించుకోవాలని పేర్కొన్నారు.

ఉద్యోగుల ఆందోళనకు సీపీఎం మద్దతు
ఏలూరు టూటౌన్‌, జనవరి 21: పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారాం అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం నగర అధ్యక్షుడు పి.కిషోర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. పీఆర్సీపై ఎంతో ఆశగా ఎదురు చూసిన ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్‌ కంటే పీఆర్సీ తక్కువగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎ.రవి, డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌, ఆర్‌.లింగరాజు, టి.రామకృష్ణ, టి.నాగమణి పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు రూరల్‌, జనవరి 21: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాం ట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులు పీఆర్సీ కోసం ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్‌ రాజు, కార్యదర్శి సి.హెచ్‌.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్న నాయకులను గృహ నిర్బంధం, అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యని అభివర్ణించారు. ఇటువంటి చర్యలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ఉద్యమం మరిం త ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి స్పందించా లన్నారు. లేనిఎడల సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల నిరసన
ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 21 : నూతన పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజా రోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సంఘ జిల్లా కోశాధికారి జె.గోవిందరావు మాట్లాడుతూ మెరుగైన ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాత విధానంలోనే హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను కొనసాగించాలని కోరారు. సచివాలయ సిబ్బందిని ఏవిధమైన పరీక్షలు లేకుండా రెగ్యులరైజ్‌ చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, వ్యతిరేక విధానాలు విడనాడాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ మహేశ్వరి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:01:39+05:30 IST