తలరాతలు మార్చిన చెల్లని ఓట్లు

ABN , First Publish Date - 2021-02-25T05:23:21+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఫలితాలను తారుమారు చేశాయి.

తలరాతలు మార్చిన చెల్లని ఓట్లు

ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం.. ఓటు కోసం రాజకీయ నాయకులు పడరాని పాట్లు పడుతుంటారు. ప్రత్యేకంగా సర్పంచ్‌, వార్డు ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. చెల్లుబాటు కాని ఓట్లు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంటాయి. ఓటు వేసే విషయంలో ఓటర్ల అవగాహన రాహిత్యం ఫలితాలను, మెజార్టీలను  తారుమారు చేస్తాయి. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో  అభ్యర్థుల తలరాతలు మార్చేసిన  చెల్లని ఓట్ల సంగతులు కొన్ని.. 


కొన్నిచోట్ల మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం

కొద్ది ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారు

తలలు పట్టుకున్న ఓడిన అభ్యర్థులు

ఆకివీడు మండలం గుమ్మలూరు పంచాయతీలో అనంతలక్ష్మి 937 ఓట్లు, సాయిబాబా 917 ఓట్లు సాధించారు. 23 ఓట్లతో అనంతలక్ష్మి విజయం సాధించగా చెల్లని ఓట్లు 24  నమోదు కావడం విశేషం. భీమవరం మండలం బేతపూడిలో తిరుమల యామినిదేవికి 1078 ఓట్లురాగా, మరో అభ్యర్థి కడియం రాజ్యలక్ష్మికి 1072 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు. చెల్లనివి 61 ఓట్లు, నోటా 16 వచ్చాయి.


 గొల్లలకోడేరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుక్కల లక్ష్మికి తన ప్రత్యర్థికంటే 26 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆమెకు వచ్చిన మెజార్టీ కంటే నోటా ఓట్లు, చెల్లని ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నోటా ఓట్లు 29 రాగా చెల్లని ఓట్లు 113 వచ్చాయి. రీకౌంటింగ్‌ చేసినా ఫలితం అలాగే వచ్చింది.

కాళ్ళ మండలంలోని ప్రాతాళ్ళమెరకలో గెలిచిన అభ్యర్థి కంతేటి ఉషకు 450 ఓట్లు రాగా, ఓడిన అభ్యర్థి వేగేశ్న వెంకటలక్ష్మీకి 446 ఓట్లు పోలయ్యాయి. కేవలం 4 ఓట్లు తేడాతో ఓటమి చెందారు. కానీ ఇక్కడ చెల్లుబాటు కాని ఓట్లు 29 ఉన్నాయి. కాళ్ళకూరులో గెలిచిన అభ్యర్థి సాధు శ్రీదేవికి 1398 ఓట్లు రాగా, ఓడిన అభ్యర్థి బొర్రా విజయకుమారికి 1393 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్లు తేడాతో ఓటమి చెందారు. ఇక్కడ చెల్లుబాటు కాని ఓట్లు 39 ఉన్నాయి. ఆనం దపురంలో గెలిచిన అభ్యర్థి కొలుకులూరి ధర్మరాజుకు 282 ఓట్లు రాగా, ఓడిన అభ్యర్థి ఉద్దరాజు శ్రీనివాసరాజుకి 275 ఓట్లు పోలయ్యాయి. కేవలం 7 ఓట్లు తేడాతో ఓటమి చెందాడు. కానీ ఇక్కడ చెల్లుబాటు కాని ఓట్లు 16 ఉన్నాయి.

వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ములో గెలిచిన అభ్యర్థికి 204 మెజార్టీ రాగా 294 చెల్లని ఓట్లు పడ్డాయి. అలాగే రేపాకగొమ్ము పంచాయతీలో గెలుపొందిన అభ్యర్థికి 141 ఓట్లు మెజార్టీ రాగా 184 ఓట్లు చెల్లకుండా పోయాయి. రామవరంలో గెలుపొందిన అభ్యర్థికి 4 ఓట్లు మెజార్టీరాగా 61 ఓట్లు చెల్లలేదు. కటుకూరులో గెలుపొందిన అభ్యర్థికి 40 ఓట్లు మెజార్టీ రాగా 96 ఓట్లు చెల్లలేదు. 

బ్యాలెట్‌ పేపర్‌లపై వేలిముద్రలు వేశారని అవి చెల్లవంటూ కౌంటింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయానికి నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని చింతలపూడి మండలం గనిజర్ల పంచాయతీ అభ్యర్థి చీకటి వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో 9 ఓట్లు తేడా ఉన్నాయని చెప్పారని వాటిని లెక్కిస్తే నాలుగు ఓట్లు తగ్గిందని అయితే 31 ఓట్లు మూడు వార్డుల్లో వేలి ముద్రలు పడ్డాయి చెల్లవన్నారు. తనకు 34 ఓట్లు పడినప్పటికీ చెల్లవని కౌంటింగ్‌ అధికారి తేల్చడంతో  నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయానన్నారు.

వీరవాసరం మండలం బొబ్బనపల్లిలో 3 ఓట్ల ఆధిక్యతతో గూడూరి ఓంకార్‌ విజయం సాధించారు. అక్కడ ఫలితాల్లో 6 చెల్లని ఓట్లు, 6 నోటా ఓట్లు ఉన్నాయి. మెంటేపూడిలో కొల్లా సుధాకృష్ణకుమారి 6 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించగా, ఫలితాలలో 5 చెల్లని ఓట్లు, 4 నోటా ఓట్లు ఉన్నాయి. తోకలపూడిలో వీరవల్లి శ్రీనివాసరావు 7 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించగా అక్కడ ఫలితాలలో 39 చెల్లని ఓట్లు, 19 నోటా ఓట్లు ఉన్నాయి. వీరవల్లిపాలెంలో శీలబోయిన పద్మకుమారి 6 ఓట్ల తేడాతో విజయం సాధించగా 2 చెల్లని ఓట్లు, 1 నోటా ఓటు గుర్తించారు. వీరవాసరంలో 29 ఓట్ల ఆధిక్యతతో చికిలే మంగతాయారు విజయం సాధించగా ఫలితాల లెక్కింపులో 175 చెల్లని ఓట్లు, 158 నోటా ఓట్లను గుర్తించారు.

తాడేపల్లిగూడెం మండలం జగన్నాఽథపురంలో పొనుకు మాటి గౌరి 5 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. అయితే చెల్లని ఓట్లు 142 ఉన్నాయి. సర్పంచ్‌ విజేతను ప్రకటించేందుకు మూడు సార్లు రీకౌంట్‌ చేసినా అదే ఫలితం వచ్చింది. 

 జల్లికాకినాడ గ్రామ సర్పంచ్‌ బాతు నాగేశ్వరరావు ఒక ఓటు మెజారిటీతో గెలిపొందాడు. చెల్లని ఓట్లు 25, నోటాకు పడిన ఓట్లు 4 ఉన్నాయి. కొత్తపల్లిలో మద్దాల రత్న కుమారి, మెజారిటీ 12ఓట్లు, చెల్లని ఓట్లు 13, కోమర్రు గ్రామ సర్పంచ్‌ కే.శైలజకు 39 ఓట్లు మెజారిటీ రాగా చెల్లని ఓట్లు 24, నోటా 22కు ఓట్లు వచ్చాయి.

 పెదవేగి మండలంలో మొత్తం 627 ఓట్లు నోటాకు పడ్డాయి. అత్యధికంగా ముండూరులో 68 ఓట్లు, లక్ష్మీపురంలో 64, వంగూరు, విజయరాయి గ్రామాల్లో 54 చొప్పున నోటాకు ఓట్లు వేశారు. అలాగే వేగివాడ 53, బాపిరాజుగూడెంలో 35, రాయన్నపాలెంలో 33, కూచింపూడిలో 31, పెదవేగిలో 30 ఓట్లు నోటాకు వేశారు.  

– ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్వర్క్‌


ఆ..4 శాతం ఓట్లే దెబ్బ తీశాయా..?

ఏలూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఫలితాలను తారుమారు చేశాయి. అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీశాయి. రసవత్తరంగా సాగిన ఈ పోరులో చాలా చోట్ల సింగిల్‌ డిజిట్‌, డబుల్‌ డిజిట్‌ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించాయి. అయితే చాలాచోట్ల చెల్లని ఓట్లు, నోటా ఓట్లే అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసేశాయి. ఈ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన వారు ఉన్నారు.. అయితే వారు సాధించిన మెజారిటీ కంటే చెల్లని ఓట్లే ఎక్కువుగా ఉండడం ప్రత్యర్థుల విజయావ కాశాలను దెబ్బతీశాయి. ఎన్నికల సమయంలో ఓటు వినియోగంపై ఎంత అవగాహన కల్పించినా జిల్లాలో చెల్లని కోట్లు బారీగానే నమోదయ్యాయి. నిరక్షరాస్యులు, వృద్ధులు ఓటు వినియోగంలో ఎక్కువ పొర పాట్లు చేస్తుంటారని ఎన్నికల కౌంటింగ్‌ విధులు నిర్వహించిన ఉద్యోగి ఒకరు చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఇద్దరి అభ్యర్థుల గుర్తుల మధ్య ముద్ర వేయడం వల్ల వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారని చెప్పారు. జిల్లాలోని జరిగిన ఎన్నికల్లో 48 మండలాల్లో  18,74,538 ఓట్లు పోలవగా వాటిలో 60,224 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో 18,162 మంది నోటా మీటకు ఓటేశారు. అంటే దాదాపు 4 శాతం ఓట్లు అభ్యర్థులకు దక్కకుండా పోయాయి. ఈ 4శాతం ఓట్లే అనేక చోట్ల అభ్యర్థుల రాజకీయ జీవితాలను పల్టీ కొట్టించాయి.


Updated Date - 2021-02-25T05:23:21+05:30 IST