మట్టి మాయాజాలం

ABN , First Publish Date - 2022-01-28T06:16:54+05:30 IST

జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మెరక చేస్తోంది.

మట్టి మాయాజాలం

కాంట్రాక్టర్లకు కాసులు
ప్రభుత్వానికి బిల్లు భారం 8 జగనన్న కాలనీల పూడికలో దోపిడీ

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి) :
జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మెరక చేస్తోంది. లే అవుట్‌లలో రహదారులు వేస్తోంది. ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మట్టితో సహా రవాణా చార్జీలు, మెరక ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బిల్లులు మంజూరు చేస్తోంది. కానీ కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా ఎక్కడ మట్టి దొరికితే అక్కడ మట్టిని కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్ల మాటున రాజకీయ నేతలకు ఇది కలిసి వస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు అడ్డంగా దోచేస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు. కాలువ గట్లు, చెరువులు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఊర చెరువుల తవ్వకాలు సాగించాలంటే పంచాయతీలు, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులైతే సంబంధిత అధికారులు, కాలువ గట్లకు ఇరిగేషన్‌ అధికారులు అనుమతి తప్పనిసరి. మైనింగ్‌ శాఖ కొలతలు వేసి అప్పగించాలి. మట్టికి రుసుం చెల్లించాలి. ఇవేమీ లేకుండానే అడ్డగోలుగా తవ్వుతున్నారు. పోలవరం కుడి కాలువ, తాడిపూడి కాలువ గట్టు, మైనర్‌ ఇరిగేషన్‌, ఊర చెరువుల్లోని మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్‌ శాఖకు చెందిన తాడిపూడి కాలువ తవ్వకానికి అధికారికంగా అనుమతులు జారీచేసింది. అనుమతు లకు, తవ్వకాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోనూ తాడిపూడి మట్టిని అనుమతుల మాటున తరలిస్తున్నారు. ఎర్రకాలువ, వైడ్‌ డ్రెయిన్‌ మట్టిని ఇదే తరహాలో గుల్ల చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి ఆశీస్సులు ఉండడంతో అధికారులు ఇటువైపు తొంగి చూడడం లేదు. కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు.


ప్రభుత్వ ఖజానాకు గండి
తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం దండగర్రలో చెరువులో దాదాపు 300 లారీల కంకర మట్టిని తరలించే ప్రణాళిక చేసుకున్నారు. జగనన్న కాలనీల్లో ఇది వరకే మట్టిపూడిక నిర్వహించారు. రహదారులు వేసే పనిలో అధికారులు నిమగ్నమ య్యారు. దీంతో కంకర మట్టి ఉన్న కాలువ గట్లు గుల్లవుతున్నాయి. చెరువుల్లో పరిమితికి మించి తవ్వకాలు సాగిస్తున్నారు. కంకర మట్టి కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తోంది. కాలువ గట్టు మట్టి అయితే క్యూబిక్‌ మీటర్‌ రూ.500లకు అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మరోవైపు ప్రజా ప్రతినిధులకు సొమ్ములు ముడుతున్నాయి. బినామీల పేరుతోనే పనులు నిర్వహిస్తూ బిల్లులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు.

Updated Date - 2022-01-28T06:16:54+05:30 IST