కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకు మోషేన్‌రాజు ప్రస్థానం

ABN , First Publish Date - 2021-06-15T05:15:29+05:30 IST

సామాన్య కుటుంబం నుంచి కాంగ్రెస్‌ రాజకీయాల్లో యువకుడిగా ప్రవేశించి భీమవ రం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ప్రస్థానం ప్రారంభించి శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యారు.. కొయ్యే మోషేన్‌రాజు.

కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకు మోషేన్‌రాజు ప్రస్థానం

భీమవరం, జూన్‌ 14 : సామాన్య కుటుంబం నుంచి కాంగ్రెస్‌ రాజకీయాల్లో యువకుడిగా ప్రవేశించి భీమవ రం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ప్రస్థానం ప్రారంభించి శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యారు.. కొయ్యే మోషేన్‌రాజు. షెడ్యూల్‌ కులాల సామాజిక వర్గానికి చెందిన ఆయన అన్ని సామాజిక వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. భీమవరానికి చెందిన ఆయన 1965లో జన్మించారు. బీఏ పూర్తి చేశారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1987 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై పట్టణ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. దీంతో పార్టీలో ఆయనకు గుర్తింపు లభించింది. ఇలా ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. 2009లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత రెండు దఫాలుగా రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి పార్టీలో కీలక పదవులు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ విభాగంలోను పదవులు నిర్వహించారు. కొంత కాలంపాటు ఉండి అసెంబ్లీ ఇన్‌చార్జీగా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ జిల్లాలో ముఖ్య నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో జగన్‌ సీఎం అయిన తరువా త జిల్లాలో తొలి పర్యటన మోషేన్‌రాజు కుమార్తె వివాహానికి హాజరుకావడం ఆయనకు వున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కుల, మత, సామాజిక వర్గాలకు అతీతంగా, అందరితోను వివాద రహితుడుగా గుర్తింపు తెచ్చుకున్న మోషేన్‌రాజుకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 


 మరిన్ని సేవలందించే అవకాశం

ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. దివంగత రాజశేఖరరెడ్డి అనుచరుడిగా.. అప్పటి నుంచి పార్టీకి ఎన్నో సేవలందించాను. అప్పగించిన పార్టీ పదవుల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించా.. ఇప్పుడు బృహత్తర బాధ్యతను అప్పగించారు. దీనికి అనుగుణంగా పార్టీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తా.. ప్రజలకు సేవలందిస్తా..

                 – మోషేన్‌రాజు


Updated Date - 2021-06-15T05:15:29+05:30 IST