మరో షాక్‌

ABN , First Publish Date - 2022-01-28T06:19:35+05:30 IST

నిన్నటి వరకు ఓటీఎస్‌ అంటూ పేదల ఇళ్లకు పది నుంచి ఇరవై వేల వరకు బకాయిల పేరిట వసూళ్లు చేశారు.

మరో షాక్‌

నిన్న ఓటీఎస్‌
నేడు ఓటీసీ !

భీమవరం, జనవరి 27 : నిన్నటి వరకు ఓటీఎస్‌ అంటూ పేదల ఇళ్లకు పది నుంచి ఇరవై వేల వరకు బకాయిల పేరిట వసూళ్లు చేశారు. ఇక ఇప్పుడు ఓటీసీ అంటూ లే అవుట్లపై దృష్టి పెట్టి వీలైనంత వరకు లాగేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వన్‌ టైమ్‌ కన్వర్షన్‌ స్కీం (ఓటీసీ) అధికార పార్టీలో గుబు లు రేపుతోంది. ఈ మూడేళ్లలో అడ్డగోలుగా అనుమతి లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసింది వారే. గ్రామం, పట్టణం తేడా లేకుండా పంట భూములను పూడ్చేసి చాలా చోట్ల అమ్మకాలు జరిపారు. మునిసిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో అయితే మరీ ఎక్కువ. సంక్రాంతి కానుకగా వెల్లడైన ఈ స్కీమ్‌లో భాగంగా ముందు గ్రామాలు, వార్డుల వారీగా కన్వర్షన్‌ ఫీ ఎగ్గొట్టిన రియల్‌ భూముల వివరాల సేకరణకు సర్వే చేయాలి. ప్రస్తుతానికి ఈ ఆదేశాలు ఇంకా సచివాలయాలకు అందలేదు. వ్యవసాయ భూముల్లో కట్టుకున్న నిర్మాణాలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం రాబట్టుకునేందుకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీచేసినా రహస్యంగా ఉంచింది. సంక్రాంతి సమయంలో బయట పడింది. ప్రభుత్వం ప్రస్తుతం వన్‌ టైం సెటిల్మెంట్‌ పేరుతో 1983 నుంచి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని వారికి ఓ పథకం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. దీనిపై విమర్శలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా వన్‌టైం కన్వర్షన్‌ పేరుతో మరో కొత్త స్కీమ్‌ తీసుకురావాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.  


వన్‌టైం కన్వర్షన్‌ స్కీం ఇలా..

ఓటీసీ కింద వ్యవసాయ భూముల్లో ఏమైనా నిర్మాణాలుంటే.. వాటికి పెనాల్టీ నాలా పన్ను కడితే క్రమబద్ధీకరిస్తారు. సాధారణంగా కన్వర్షన్‌ ఫీజు ఆ ప్రాంతంలో రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఉండే భూమార్కెట్‌ ధర నమోదై విలువ ఆధారంగా పన్ను విధించే ధర ఉంటుంది. భూమిని ఏ రకంగా మార్పు చేస్తున్నా రిజిస్ట్రేషన్‌ విలువలో ఐదు శాతం చెల్లించాలి. నాలా పన్నుగా మరో ఐదు చెల్లించేలా ఆదేశాలున్నాయి. ఒకవేళ పూడిక చేసి భవనం నిర్మిస్తే మరో మూడు శాతం అదనంగా పన్ను ఫీజు రూపంలో చెల్లించాలి. అదనపు శాతంపై స్పష్టత లేదు. నిజానికి పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్‌ చేయించుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేస్తారు. గ్రామీణ   ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ చేయడానికి అవకాశం ఉండకపోయినా ఈ మధ్య  చాలా మంది రైతులు పొలాల్లోనే ఇళ్లు, వ్యవసాయానికి అవసరమైన నిర్మాణాలు, ఫామ్‌ హౌస్‌లు నిర్మాణాలు చేసుకుంటున్నారు. అవి పొలంలో ఉంటాయి కాబట్టి ఎలాంటి అనుమతులు తీసుకోరు. ఇప్పుడు వాటన్నింటికీ చట్టబద్ధంగా అనుమతి ఇవ్వాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తోంది.

వలంటీర్లతో జాబితా సేకరణ
ప్రతీ వార్డు, గ్రామానికి వున్న వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇటువంటి వ్యవసాయ భూముల్లో ఉన్న నిర్మాణాల పూర్తి సమాచారం ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా సేకరించారు. ఉత్తర్వులు వస్తే తుది సర్వేతో ఎగవేత భూములు జాబితా ఖరారు చేసి నోటీసుల జారీకి రంగం సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు అందుకున్న నిర్ణీత కాల పరిమితిలో క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తీసుకోనున్నాయి. ఇప్పటికే ఓటీఎస్‌  పేరుతో చేపట్టిన పథకంపై    తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే అన్ని ఇళ్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు  చేస్తున్నారని విపక్షాలు  విమర్శిస్తున్నాయి.  ఈ క్రమంలో ఓటీసీ పథకంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-28T06:19:35+05:30 IST