Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెండింగ్‌లో కష్టార్జితం

ధాన్యం కొనుగోళ్లలో మహిళలకు మొండిచేయి

రూ.20 కోట్లకు పైగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం

అంతకు మించే ఉంటుందంటున్న మహిళా సమాఖ్య 


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మొండిచేయి చూపింది. ధాన్యం కొనుగోలులో కీలకపాత్ర వహించిన ఐకేపీ కేంద్రాలను పక్కన పెట్టి సొసైటీలు, రైతు భరోసా కేంద్రాలకు బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా వందల మంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించిన మహిళలకు దినసరి వేతనాన్ని పెండింగ్‌లో పెట్టింది. మహిళా సమాఖ్యలకు రావాల్సిన కమీషన్‌ను చెల్లించడం లేదు. 2016 నుంచి ఐకేపీ కేంద్రాలకు చెల్లించాల్సిన సొమ్ములు విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఎప్పటికప్పుడు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొన్ని కేంద్రాలకు 2017–18 సంవత్సరం వరకు బిల్లులు చెల్లించారు. అక్కడ నుంచి అన్ని కేంద్రాలకు నిలిపి వేశారు. ఫలితంగా మహిళలు కొనుగోలు కేంద్రాల్లో పని చేసేందుకు ముందుకు రావాలంటే హడలిపోయేవారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రతి సీజన్‌లోనూ మహిళలను మారుస్తూ వచ్చారు. కొత్తవారిని నియమించారు. ప్రభుత్వం కమీషన్‌ విడుదల చేయకపోవడంతో ఇటువంటి దుస్థితి ఏర్పడింది. మొత్తంగా ఈ కేంద్రాలకు రూ.100 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు మహిళా సమాఖ్యలు లెక్క చెబుతున్నాయి. ఇటీవల అధికారులు లెక్క తేల్చి కేవలం రూ.20 కోట్లు మాత్రమే మహిళా సమాఖ్యలకు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మొత్తానికి బిల్లులు మంజూరు చేస్తే కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహించే మహిళలకు ఊరట లభించేది. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి ఐకేపీ కేంద్రాలను ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో 350 సొసైటీలు, డీసీఎంఎస్‌లకు మాత్రమే ఏజన్సీలుగా నియ మించింది. వాటి కింద 874 రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. ఐకేపీ కేంద్రాలను తొలగించిన ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలపై స్పందించడం లేదు. మహిళల కష్టార్జితాన్ని ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
Advertisement