పెదపాడులో ఆర్‌ఎంపీ, పీఎంపీల హవా

ABN , First Publish Date - 2021-05-06T05:02:38+05:30 IST

కరోనా... ఆ పేరే పలకడానికి భయపడుతున్న వేళ.. కొవిడ్‌కు గురైన వారి భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిలువునా దోచేస్తున్నారు.

పెదపాడులో ఆర్‌ఎంపీ, పీఎంపీల హవా

పెదపాడు, మే 5 : కరోనా... ఆ పేరే పలకడానికి భయపడుతున్న వేళ.. కొవిడ్‌కు గురైన వారి భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిలువునా దోచేస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలైన జ్వరం, ఒంటినొప్పులు ఏ ఇతర లక్షణాలు కన్పించినా ప్రభుత్వ వైద్యులను సంప్రదిం చాల్సింది పోయి సమీపంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు వెళ్లి ఒళ్లు గుల్ల చేసుకుని, జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. కొవిడ్‌ చికిత్సను పక్కదారి పట్టిస్తున్న వీరు తొలుత వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని చెప్పకుండా వారికి కమీషన్లు వచ్చే సిటీ స్కానింగ్‌ల వైపు రోగులను, వారి బంధువులను పరుగులు పెట్టిస్తున్నా రు. వారి మాటలను నమ్మి స్కానింగ్‌లు చేయించుకుంటూ ఆర్‌ఎంపీలు అందించే అరకొర వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా పెదపాడులో ఆర్‌ఎంపీగా చెప్పుకునే ఒక యువకుడు కొవిడ్‌ బారినపడిన వ్యక్తిని స్కానింగ్‌లు, వైద్యం పేరుతో మూడు రోజులు కాలయాపన చేసినట్టు సమాచారం. సరైన వైద్యం అందక ప్రాణాల మీదకొచ్చిన ఆ వ్యక్తి ప్రభుత్వ వైద్యుల సహకారంతో ఆశ్రంలో చేరి తుదకు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేగింది. అనుమతులు లేనిదే కోవిడ్‌ వైద్యం చేయరాదన్న నిబంధనలు తుంగలో తొక్కి స్కానింగ్‌లు, వైద్యం పేరిట జేబులు గుల్ల చేస్తూ ప్రాణాలమీదకు తెస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-06T05:02:38+05:30 IST