సో.. శాండ్‌

ABN , First Publish Date - 2021-06-14T04:53:34+05:30 IST

పేదల ఇళ్ల పథకాన్ని ఇసుక కష్టాలు వెంటాడుతున్నాయి

సో.. శాండ్‌

పేదల ఇళ్లకు ఇసుక కష్టాలు

ఉచిత ఇసుక దొరక్క ఇక్కట్లు

అమ్మకానికే కాంట్రాక్టర్ల ప్రాధాన్యం

కొన్నిచోట్ల ఇసుక టోకెన్ల పంపిణీ

సరఫరాకు నిరాకరించిన రీచ్‌లు

కొన్నిచోట్ల కొనుక్కుంటున్న వైనం

భీమవరానికి చెందిన ఒక ‘గృహ నిర్మాణ పథకం’ లబ్ధిదారుడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తానన్న ఇసుక కోసం అందు బాటులో వున్న ఇసుక రీచ్‌కు వెళ్లాడు. కానీ ఆయనకు అక్కడ ఇసుక లభించలేదు. ప్రభుత్వ అధికారులు లబ్ధిదారుడిగా తనకు ఇచ్చిన ఆధార పత్రాన్ని చూపినా వారు అతడికి ఇసుక ఇవ్వలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు. 

ఏలూరులో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులను గుర్తించారు. కానీ వారికి ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వలేదు. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టుకున్న కొంత మంది సమీపంలోని తమ్మి లేరులో డబ్బులిచ్చి ఇసుక కొనుక్కుంటున్నారు. 

ఏలూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి)

పేదల ఇళ్ల పథకాన్ని ఇసుక కష్టాలు వెంటాడుతున్నాయ నడానికి ఇవి తాజా ఉదాహరణలు. పథకం అమలులో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా ఉచితంగా రావాల్సిన ఇసుకకు పేదలు తమ కష్టార్జితాన్ని ధారపోయాల్సి వస్తోంది. లేదంటే నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 1,70,699 మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరుచేసింది. వాటిలో 1,39,353 ఇళ్ల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 20 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఆసక్తిని బట్టి మూడు కేటగిరీలుగా నిర్ణయించి వారిని గృహ నిర్మాణానికి ప్రోత్సహించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయిం చారు. కానీ అందుకు తగిన ఏర్పాట్లు జరగలేదు. ఫలితంగా ఇళ్లు ప్రారంభిం చిన వారికి ఇసుక కష్టాలు మొదల య్యాయి. గృహ నిర్మాణ పథకం అమలుకు కావాల్సిన ఇసుక సరఫరా నిమిత్తం జిల్లాలో రెండు రీచ్‌లను కేటాయించి నట్లు అధికారులు చెప్పారు. జిల్లాలోని లబ్ధిదారులంరికీ అక్కడే ఇసుక సరఫరా చేస్తారు. ఏ రీచ్‌లలో ఇసుక సరఫరా చేస్తారనే విషయంలో లబ్ధిదారులకు సమాచారం లేదు. దీంతో తమకు అందుబాటులో వున్న రీచ్‌ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు లబ్ధిదారులకు రీచ్‌లను కేటాయిస్తూ టోకెన్లు జారీ చేశారు. ఆ టోకెన్లు తీసుకు వెళ్లిన వారికి ఇసుక లభించలేదు. హాలోగ్రామ్‌ లేదని, అవి సరైన ఆధారపత్రాలు కాదని వంక పెట్టి రీచ్‌ నిర్వాహకులు అమ్మకానికే ప్రాధాన్యం ఇచ్చారు. భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. 

ఉచితం లేదంటున్న నిర్వాహకులు 

ఏలూరు పరిసర ప్రాంతాల లబ్ధిదారులకు ఎలాంటి గుర్తింపు పత్రం అధికారులు జారీ చేయలేదు. కొందరికి తాడేపల్లిగూడెం స్టాక్‌ పాయింట్‌, కొవ్వూరు రీచ్‌లను కేటాయిస్తూ చీటీలు రాసి ఇచ్చారు. ఆ రెండుచోట్లా ఇసుక సరఫరా చేయలేదు. ఇసుక అమ్మకాన్ని జేపీ సంస్థకు కేటాయించడంతో వారు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించా ల్సిన అధికారులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. దీంతో ఉచిత ఇసుక పొందలేకపోయిన లబ్ధిదారులు ఇసుక కోసం దగ్గరలో వున్న వంగూరులోని తమ్మిలేరు లోయర్‌ ఆర్డర్‌ స్ట్రీమ్‌పై ఆధారపడ్డారు. ఇదే అదనుగా ఇసుక అమ్మకందారులు లబ్ధిదారులను దోచేస్తున్నారు. రూ.250 చేసే ఒక్కో ఎడ్లబండి ఇసుకకు రూ.850 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదే అంశం శనివారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలోను చర్చకు రాగా, ఆయన జిల్లాలో 4 రీచ్‌లను ఈ పథకం కింద కేటాయించినట్లు తెలిసింది. కొవ్వూరు దగ్గరలోని చిడిపి, నిడదవోలు సమీపంలోని పెండ్యాల, పెనుగొండ మండలంలోని నడిపూడి, సిద్ధాంతం రీచ్‌లను కేటాయించినట్లు, ఇవి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్న సమాచారం.

ఇసుక ఇవ్వాల్సిందే : శ్రీనివాసరావు, మైన్స్‌ ఏడీ

పేదల ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ప్రకటించిన 1.8 లక్షల రూపాయల్లో దీనిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రైవేటు సంస్థ అయినా ఇసుక ఇవ్వాల్సిందే. దీనిపై చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-06-14T04:53:34+05:30 IST