రాయితీ రభస

ABN , First Publish Date - 2021-12-06T05:07:49+05:30 IST

వ్యవసాయ యాంత్రీకరణ రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది.

రాయితీ రభస

జిల్లాకు 240 వరి కోత యంత్రాలు మంజూరు

రాయితీ సొమ్ము తర్వాత ఇస్తాం.. యంత్రాలు కొనుక్కోవాలని సూచన

నమ్మకం లేక కొందరు.. సొమ్ముల్లేక మరికొందరు వెనుకడుగు

ఫలించని వ్యవసాయ యాంత్రీకరణ పథకం


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ యాంత్రీకరణ రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. రాయితీ సొమ్ములు తర్వాత ఇస్తాం.. ముందుగా వరి కోత యంత్రాలను కొనుగోలు చేయాలని చెబుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతులకు నమ్మకం కుదరడం లేదు. ముందస్తు పెట్టుబడి లేక కొందరు.. రాయితీ ఇవ్వదన్న అను మానంతో మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ వ్యవసాయ రాయితీ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి మండలానికి ఐదు వరి కోత యంత్రా లను రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 48 మండలాల్లో 240 కోత యంత్రాలను మంజూరు చేసింది. రైతులే కంపె నీలను ఎంపిక చేసే వెసులుబాటును కల్పించింది. ఒక్కో యూనిట్‌ ధర రూ.25 లక్షలుగా ప్రకటించి, ఆ పైన ఎంత ధర ఉన్నా సరే అదనపు సొమ్ములను రైతులే భరించాలని ప్రకటించింది. ఈ రూ.25 లక్షల్లో రూ.12.50 లక్షలు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో రైతులు చెల్లించాలి. మరో 8.50 లక్షలు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగిలిన నాలుగు లక్షలు రైతులు భరించాలి. ఈ మేరకు రైతు గ్రూపులను గుర్తించి తదనుగుణంగా ఎంపిక ప్రక్రి యను పూర్తి చేశారు.వారు బ్యాంకు ఖాతాలు తెరిచి, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని ముందుగానే రైతులు చెల్లించి కోత యంత్రా లను కొను గోలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతులు వెనుకంజ వేస్తున్నారు.  బ్యాంకులు మాత్రం రైతులు ఇచ్చే గ్యారంటీ ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరి కోత యంత్రాల కంపెనీలు పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లిస్తేనే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం రాయితీ సొమ్ము తర్వాత ఇస్తామన్నా కంపెనీలు ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వం రైతు రథం పథకం కింద ఇచ్చిన ట్రాక్టర్ల విషయంలో రాయితీ సొమ్మును కంపెనీలకు ఇప్పటికీ చెల్లించలేదు. అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ప్రభుత్వ హామీని కంపెనీలు విశ్వసించడం లేదు. పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లిస్తేనే కోత యంత్రా లను సరఫరా చేస్తామని చెబుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అఽధికారులు రైతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వరి కోత యంత్రాలు కొనుగోలు చేయాలని మొత్తుకుం టున్నారు. అధికారులు భరోసా ఇస్తున్నా సరే రైతుల్లో కదలిక లేదు. ఇప్పటి వరకు జిల్లాలో పట్టుమని 30 వరి కోత యంత్రాలను కొనుగోలు చేయలేకపోయారు. ప్రభుత్వ ఉద్దేశం సబబుగానే ఉన్నా సొమ్ములు విడుదలపైనే అందరిలోనూ మీమాంస నెలకొంది. మరోవైపు ముందుస్తు పెట్టుబడి చేసేందుకు రైతులు సాహసం చేయలేకపోతున్నారు. మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. 

Updated Date - 2021-12-06T05:07:49+05:30 IST