Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిలిచినా రారేం..?

తాడేరు వంతెన శిథిలమై 15 నెలలు

టెండర్లు పిలిచినా రాని కాంట్రాక్టర్లు

30 గ్రామాల ప్రజల ఇక్కట్లు..

భీమవరం, డిసెంబరు 5 : సుమారు రూ.40 కోట్ల వ్యయంతో వేసిన రోడ్డు.. చిన్న వంతెన లేక ప్రయాణికులకు ఉపయోగంలో లేకపోయింది. ఆ మార్గంలో వంతెన శిథిలమవడంతో బస్సులు నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. భీమవరం నుంచి మత్స్యపురి మీదుగా నరసాపురానికి 32 కి.మీ ఆర్‌అండ్‌బీ రహదారి ఉంది. 2016లో ఈ రహదారిని రెండు విభాగాలుగా రూ.30 కోట్లతో నిర్మించారు. రూ.7 కోట్లతో మత్స్యపురి వద్ద గొంతేరు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు. దీంతో 30 గ్రామాల ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. నరసాపురం, భీమవరం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించాయి. ఇంతలో గతేడాది ఆగస్టులో భీమవరం పట్టణ శివారు తాడేరు వద్ద గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌పై ఉన్న పాత వంతెన శిఽథిలమవడంతో రాకపోకలు ఆగిపోయాయి. 30 గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నూతన వంతెన కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.1.90 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఎవరూ స్పందించలేదు. రెండో దఫా మళ్లీ పిలిచారు. సీన్‌ రిపీట్‌ ! ఇప్పుడు మూడోసారి టెండర్లు పిలవనున్నారు. చిన్న వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిస్తే బిల్లులు రావనే భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.. ఈ రోడ్డుపై భీమవరం, నరసాపురం, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు. 15 నెలలుగా వంతెన పనిచేయక 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.భీమవరం రావాలంటే వీరవాసరం మండలం నుంచి తిరిగి రావాల్సిందే. మొన్న సంక్రాంతికి రూ.20 లక్షలతో ఐరన్‌ రేకు వేసి తాత్కాలిక మరమ్మతు చేపట్టారు. ప్రస్తుతం ఆ వంతెనపై చిన్న కార్లు, ఆటోలు మాత్రమే వెళుతున్నాయి. ఈ కర్మ ఎంత కాలమంటూ ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
Advertisement