అనుభూతి, భావాలు కలిగిన కవి తిలక్‌

ABN , First Publish Date - 2021-10-25T05:16:22+05:30 IST

తెలుగు సాహిత్యంలో భావాలు, అనుభూతి కలిగిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అని సాహిత్య అకాడమి కార్యదర్శి కె.శ్రీనివాసరావు అన్నారు.

అనుభూతి, భావాలు కలిగిన కవి తిలక్‌
సమావేశంలో మాట్లాడుతున్న సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు

తణుకు, అక్టోబరు 24 : తెలుగు సాహిత్యంలో భావాలు, అనుభూతి కలిగిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అని సాహిత్య అకాడమి కార్యదర్శి కె.శ్రీనివాసరావు అన్నారు. తణుకులోని సాహిత్య అకాడమి, తిలక్‌ వేదిక సంయుక్తంగా ఆదివారం  తిలక్‌ శత జయంతి వేడుకల సదస్సు నిర్వహించారు. తిలక్‌ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారన్నారు. చలం, కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం ఎక్కువుగా ఉందన్నారు. సాహిత్య అకాడమి సంచాలకులు కె.శివారెడ్డి మాట్లాడుతూ పాఠకులను ఆకట్టుకునే శక్తి తిలక్‌ రచనల్లో ఉందన్నారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణ మాట్లాడుతూ సమాజ హితానికి సంబంధించి బహుళత్వం ఉన్న కవి తిలక్‌ అని చెప్పారు. అన్ని కోణాల్లో కవిత్వాన్ని రంగరించారని తెలిపారు. శ్రీశ్రీ కన్నా తిలక్‌ ప్రతిభావంతుడు అయినా శ్రీశ్రీ కన్నా వెనుక ఉన్నారని అన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలుగు కవిత్వంలో తిలక్‌ స్థానం అంచనా వేయడం అంతసులువు కాదన్నారు. కవిని అంచనా వేసేటప్పుడు స్థానాలు, భావోద్వేగాలు తీవ్రంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. తెలుగు కవిత్వానికి స్పృహ కల్పించిన కవి తిలక్‌ అన్నారు. 50 సంవత్సరాల నుంచి తిలక్‌ను పాఠకులు నిలబెట్టుకుం టున్నారని చెప్పారు. తిలక్‌ కవిత్వంలో స్థానికత ఎక్కువుగా ఉండేదన్నారు. ప్రముఖ కవి రసరాజు మాట్లాడుతూ కవి అయినవాడు సమాజాన్ని బతికి స్తాడన్నారు. తిలక్‌లో మానవీయ దృశ్యాలు కనిపిస్తాయని చెప్పారు. వర్తమాన కవులను అంతర్లీనంగా ప్రోత్సహించిన వ్యక్తి తిలక్‌ అని వివరించారు.  సి.మృణాళిని మాట్లాడుతూ మనిషిలో అనేక గుణాలు ఉన్నపుడే మానవుడుగా ఉంటాడన్నారు. ప్రపంచ యుద్ధంపై  రాసిన కవితలో మనిషికి చాలా విలువ ఇచ్చారన్నారని తెలిపారు. వాసిరెడ్డి నవీన్‌ మాట్లాడుతూ తిలక్‌ కవి, కధకుడు కూడా అన్నారు. మానవ విలువలు, సామాజిక విలువలు మధ్య ఉన్న ఏకైక రేఖను పట్టుకున్న వ్యక్తి తిలక్‌ అని అన్నారు. కందిమళ్ళ సాంబశివ రావు మాట్లాడుతూ జాతి జీవనాన్ని ప్రతిభింబించేది నాటకమన్నారు. తిలక్‌ మంచి నాటకాలు రచించినప్పటికి అనుకున్న రీతిలో ప్రాచుర్యం పొందలేదన్నారు. కేవలం తణుకు ప్రాంతానికి పరిమితం అవ్వడం వల్లే ఇలా జరిగిందన్నారు. తిలక్‌ లేఖలు, వ్యాసాలు గురించి శిఖామణి మాట్లాడారు. ముగింపు ఉపన్యాసాన్ని జాతీయస్ఫూర్తి సంపాదకులు డీవీవీఎస్‌ వర్మ చేయగా, మద్దాల శ్రీనివాసు కృజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డాక్టర్‌ తాతిన రామబ్రహ్మం, వత్సవాయి వెంకటరాజు, మనోరమ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:16:22+05:30 IST