వ్యాక్సిన్‌ వృథా !?

ABN , First Publish Date - 2021-10-18T05:03:27+05:30 IST

వ్యాక్సిన్‌ వృథా చేశారంటూ తూర్పుగోదావరి జిల్లాలో కొందరు వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ కావడంతోపాటు, రాష్ట్రంలో కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీకా పంపిణీ లెక్కల్లో ఒకింత లొసుగులు ఉన్నాయంటూ సంకేతాలు అందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

వ్యాక్సిన్‌ వృథా !?

 పక్క జిల్లాలో టీకా పంపిణీలో లొసుగులపై వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు

 జిల్లాలోనూ వృథా వాస్తవమేనా ?

 అవకాశమే లేదంటున్న వైద్యాధికారులు


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 17: వ్యాక్సిన్‌ వృథా చేశారంటూ తూర్పుగోదావరి జిల్లాలో కొందరు వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ కావడంతోపాటు, రాష్ట్రంలో కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీకా పంపిణీ లెక్కల్లో ఒకింత లొసుగులు ఉన్నాయంటూ సంకేతాలు అందడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ నిల్వల లెక్కలపై ఆరా తీయడంతోపాటు, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్యతో సరిపోల్చుకునే ప్రక్రియపై అంతర్గత మూల్యాంకన అనధికారికంగా జరుగుతున్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పక్కాగా జరుగుతోందని అధికార వర్గాలు చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ కొంతమేర లొసుగులకు దారితీసిన పరిస్థితులు, సాంకేతిక సమస్యలను సైతం కాదనలేమని కొందరు వైద్య సిబ్బంది వాపోతున్నారు.

 తొలుత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన వైద్య సిబ్బంది, పోలీసు శాఖల లబ్ధిదారుల వివరాలన్నింటినీ పక్కాగా సేకరించి ఆన్‌లైన్‌ చేశారు. దీంతో టీకా మందు సరఫరా సాఫీగా జరగడానికి కారణమైంది. ఆ తరువాత సీనియర్‌ సిటిజన్లు, తదుపరి 45–60 వయస్సు గ్రూపు లబ్ధిదారులకు వ్యాక్సినేషన్‌ను విస్తరించడంతో క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి క్రమేణా పెరిగింది. ఇక 18–44 వయస్సు గ్రూపునకు కూడా అర్హత కల్పించడంతో ఊపిరి సలపనంత పని అయ్యింది. తొలి నాళ్ళల్లో లబ్ధిదారు ఆధార్‌ కార్డు సంఖ్యను ఆన్‌లైన్‌లో లింక్‌ చేసిన తరువాతే వ్యాక్సిన్‌ వేసేవారు. దీనికి కనీసం 10–15 నిమిషాల సమయం పట్టేది. దీనికితోడు పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్‌ సరఫరా జరిగేది. క్రమేణా వ్యాక్సిన్‌ సరఫరా పెరగడం, ఆ మేరకు లబ్ధిదారులు సీవీసీల వద్ద గంటల తరబడి వేచి ఉండడం, ఆ తదుపరి రోజువారి టార్గెట్‌లను విధించి అదేరోజు లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందేనని ఒత్తిళ్ళు, మౌఖిక ఆదేశాలు పెరగడంతో క్షేత్ర స్థాయిలో పలు చోట్ల ఆన్‌లైన్‌ బదులుగా ఆఫ్‌లైన్‌ విధానంలోనే టీకా మందు పంపిణీ జరిగింది. ఇలా ఆఫ్‌లైన్‌లో టీకా మందు వేసినా లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ చేయకపోవడం కొన్ని చోట్ల జరిగింది. ఫలితంగా వ్యాక్సిన్‌ పంపిణీ భౌతికంగా జరిగినా వివరాలు రికార్డులకు ఎక్కలేదు. పలువురు వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు కోవాగ్జిన్‌ కోసం నమోదు చేసుకోగా సంబంధిత సీవీసీలో కొవిషీల్డ్‌ మాత్రమే ఉండడం వలన దానినే వేశారు. ఇలా వ్యాక్సిన్‌ బ్రాండ్‌ మారినప్పుడు స్లాట్‌లో వ్యాక్సిన్‌ పేరు మార్చకపోవడం వలన రికార్డుల్లో లెక్కలు తారు మారుకావడానికి అవకాశం ఏర్పడింది. తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న లబ్ధిదారులకు  రెండో డోసుకు నిర్ణీత గడువు (84 రోజులు, 28 రోజులు) వచ్చినప్పుడే అర్హులుగా నిర్ధారిస్తారు. కాని చాలా చోట్ల ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్ణీత గడువుకు ముందే రెండో డోసు వ్యాక్సిన్‌ను వేసినట్టు చెబుతున్నారు.


 అవసరమైన మేరకే టీకా మందు సరఫరా.. 

 కలెక్టర్‌, జేసీల ఆదేశాలు, ప్రణాళిక ప్రకారమే జిల్లాలో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. పీహెచ్‌సీల వారీగా అవసరమైన మేరకే టీకా మందు పంపిణీ చేస్తున్నాం. వ్యాక్సినేషన్‌పై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు 

చేసిన 104 కాల్‌ సెంటర్‌కు ఇంతవరకు ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాకపోవడమే జిల్లాలో పారదర్శకతకు నిదర్శనం. 

– డాక్టర్‌ నాగేశ్వరరావు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి

Updated Date - 2021-10-18T05:03:27+05:30 IST