వామ్మో.. వైరస్‌

ABN , First Publish Date - 2021-05-06T05:52:25+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ అతి వేగంగా విజృంభిం చడానికి డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ కారణమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావి స్తున్నాయి.

వామ్మో.. వైరస్‌
కాళ్లలో వ్యాక్సిన్‌ కోసం..

 వాయు వేగంతో డబుల్‌ మ్యుటెంట్‌ విస్తరణ

జిల్లా కేసుల్లో వెలుగులోకి ఈ లక్షణాలు 

1304 మందికి పాజిటివ్‌.. 8,707 యాక్టివ్‌ 

పాజిటివ్‌ల కాంటాక్టులపై పర్యవేక్షణ

రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం కిటకిట


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 5 : జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ అతి వేగంగా విజృంభిం చడానికి డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ కారణమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావి స్తున్నాయి. రాష్ట్రంలో కర్నూలులో తొలిసారిగా బయటపడిన కొవిడ్‌ డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ల్యాబ్‌ టెస్టుల్లో వెల్లడవుతున్న పాజిటివ్‌ ఫలితాల్లో కనిపిస్తోందని ఆరోగ్య శాఖ ఎపిడిమాలజిస్టులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న కరోనా వేరియంట్లలో తాజాగా వ్యాప్తి చెందుతున్న డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. జిల్లాలో కొద్ది రోజులుగా వెల్లడవుతున్న పాజిటివ్‌ నిర్ధారణ కేసుల్లో ఈ ప్రమాదకర డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా యు వత కొవిడ్‌ వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరు గుతుండడమే కరోనా కేసులు పెరగడానికి దారి తీస్తోందని, ఆ మేరకు ఒకరి అజాగ్రత్త వల్ల ఇంట్లో మిగతా వారందరూ వైరస్‌ బారిన పడుతున్నారని విశ్లేషించారు.


  1304 పాజిటివ్‌ కేసులు

బుధవారం సాయంత్రం వరకు జిల్లాలో 1,304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎనిమిది వేల 707కి పెరిగింది. నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో మూడింట ఒక వంతు ఏలూరు నగరం, పరిసర ప్రాంతాలకు చెందినవే. ఇప్పటివరకు జిల్లాలో 452 వెరీ యాక్టివ్‌, 183 యాక్టివ్‌ కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు వీరి సంఖ్య అధికారికంగా 603కు చేరింది. మరోవైపు ఈ కొవిడ్‌ సంక్రమణ గొలుసును తెగ్గొట్టడానికి ఏర్పాటు చేస్తోన్న కంటైన్మెంట్‌ జోన్లలో ఫీవర్‌ క్లీనిక్‌లను నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోం క్వారంటైన్‌ / హోం ఐసొలేషన్‌లో వున్న పాజిటివ్‌ బాధితులు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు 14 రోజులపాటు ఇల్లు వదిలి బయటకు రాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతలను ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు వలంటీర్లకు అప్పగించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తు ల్లో కొవిడ్‌ లక్షణాలు అభివృద్ధి చెందుతుంటే వారికి టెస్ట్‌ చేయిస్తారు. టెస్టులో పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే స్థానిక వైద్యాధికారి పర్యవేక్షణలో వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆసుపత్రికి తరలిస్తారు. ఆశా వర్కర్లు వారి పరిధిలోని ఇళ్లను రోజూ సందర్శించి జ్వరం కేసులు ఉన్నట్టయితే ఆ వివరాలను ఏఎన్‌ఎంకు తెలియజేయడంతోపాటు గ్రామ వలంటీర్‌ యాప్‌లో నమోదు చేయించాలని ఆదేశించారు.


రెండో డోసుతో.. కిటకిట

రెండో డోసు కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌లో బుధవారం దాదాపు 80 శాతానికిపైగా టీకా మందు నిల్వలు ఖాళీ అయ్యాయి. ఏలూరు కలెక్టరేట్‌ సహా మొత్తం 135 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 37 వేల డోసుల వ్యాక్సిన్‌ను రెండో డోసు వారికి నిర్వహించగా భారీ సంఖ్యలో లబ్ధిదారులు తరలివచ్చారు. పూర్తిగా రెండో డోసు వారి కోసమే నిర్దేశిస్తూ లబ్ధిదారుల జాబితాలను పంపినప్పటికి కొన్నిచోట్ల మధ్యాహ్నం నుంచి తొలి డోసుకు వచ్చిన వారికి వేశారు. అందుబాటులో వున్న నిల్వలతో గురువారం జిల్లాలో 10–15 సీవీసీల్లో మాత్రమే టీకా మందు పంపిణీ జరగనుంది.


ఇంటినే ఆసుపత్రిగా..

ఆచంట, మే 5 : కరోనా సోకితే ప్రతీ ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. ఏమైపోతామోనని ఆందోళన చెందుతారు. మరో వైపు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత.. బెడ్‌ దొరికినా ఆక్సిజన్‌ అందక బాధితులు విలవిల్లాడిపోతారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆచంట మండలం బాలంవారిపేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో అతని భార్య, కుమారుడు తల్లడిల్లారు. ఇంతలోనే అతని ఆక్సిజన్‌ లెవల్స్‌ 70కు పడిపోయాయి. వారు ఆచంట ఏఎన్‌ఎం జి.చిట్టికుమారి ద్వారా ఆచంట వేమవరం పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ ఎన్‌.వర ప్రసాద్‌ను సంప్రదించారు. ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరక్కపోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటివద్దే ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.  

Updated Date - 2021-05-06T05:52:25+05:30 IST