వ్యాక్సిన్‌.. 39 లక్షలు

ABN , First Publish Date - 2021-10-22T05:17:38+05:30 IST

జాతీయస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద కోట్ల డోసులను అధిగమించిన నేపథ్యంలో గురువారం ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు.

వ్యాక్సిన్‌..  39 లక్షలు
క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో, డీఐవో తదితరులు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో క్యాండిల్‌ ర్యాలీ, సంబరాలు

టీకా వేయించుకున్న వారిలో మహిళలే అధికం

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 21 : జాతీయస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద కోట్ల డోసులను అధిగమించిన నేపథ్యంలో గురువారం ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన వ్యాక్సిన్‌ పంపిణీ ఇప్పటి వరకు దశల వారీగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 39 లక్షల 8 వేల 21 డోసులు సరఫరా చేశారు. ఇందులో 24 లక్షల 26 వేల 963 డోసులు మొదటి డోసుకు, 14 లక్షల 81 వేల 58 డోసులు రెండో డోసుకు వినియోగిం చారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో పురుషులు 17 లక్షల 87 వేల 411 మంది, మహిళలు 21 లక్షల 20 వేల 86 మంది ఉన్నారు. కోవిషీల్డ్‌ 32 లక్షల 59 వేల 233 డోసులు, కోవాగ్జిన్‌ 6 లక్షల 48 వేల 788 డోసులు పంపిణీ చేశారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో 18–44 ఏళ్ల వయసున్న లబ్ధిదారులు 17 లక్షల 17 వేల 351 మంది, 45–60 ఏళ్ల లబ్ధిదారులు 14 లక్షల 41 వేల 462 మంది, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు 7 లక్షల 49 వేల 208 మంది ఉన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన జనాభా అందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు అవసరమై నంత మేర వ్యాక్సిన్‌ నిల్వలు దిగుమతి అవుతున్నందున అర్హులందరికీ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఐడీఎస్‌పీ అధికారి డాక్టర్‌ జోషిరాయ్‌, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా జనాభాలో వ్యాక్సిన్‌కు అర్హులైన లబ్ధిదారుల్లో 74 శాతం మందికి టీకా మందు పంపిణీ చేశారు. వీరిలో తొలి డోసు 84 శాతం మందికి, రెండో డోసు 61 శాతం మందికి వేశారు.

Updated Date - 2021-10-22T05:17:38+05:30 IST