Abn logo
Sep 24 2021 @ 00:00AM

ప్రైవేటు ఫీజుల భారం..ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వైపు మొగ్గు

కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

 కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల తాకిడి

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 24: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకూ ఈ ఏడాది విద్యార్థుల తాకిడి విపరీతంగా ఉంది. ఎయిడెడ్‌ రంగం నుంచి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వైదొలగడంతో కొత్తగా రూపాంతరం చెందిన అన్ని ఎయిడెడ్‌ కళాశాలల్లో ఫీజులు భారీగా ఉండడంతో పాటు, ప్రభుత్వ రాయితీలు, తక్కువ ఫీజులు, ఇతర పథకాలు తదితర ప్రయో జనాల కారణంగా ప్రభుత్వ కళాశాలల వైపు డిగ్రీ ప్రథమ సంవత్సరంలోకి అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఈ ఏడాది క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం ఏలూరు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలన్నింటికీ ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త కోర్సులు, నిష్ణాతులైన అధ్యాపకులు, మౌలిక సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షిస్తోంది. 2008లో ప్రారంభమైన కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈ ఏడాది అదనపు హంగులను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో బీఏ, బీకాం, బీఎస్సీ లలో ఏడు కొత్త కోర్సుల్లో మొత్తం 240 సీట్లను డిగ్రీ ప్రఽథమ సంవత్సరానికి ప్రత్యేకించారు. ఎయిడెడ్‌ కళాశాలల ఎత్తివేతతో వస్తున్న డిమాండ్‌ను పరిష్క రించేందుకు మూడు అదనపు తరగతి గదులను అందుబాటులోకి తీసుకురాగా, కళాశాల ఆవరణలో ఉన్న ఒకటిన్నర ఎకరాల స్థలంలో నూతన భవనాల నిర్మా ణానికి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు తుది ఆమోదం దశలో ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎయిడెడ్‌ రంగం నుంచి ప్రభుత్వం ఉప సంహరిం చుకోవడంతో సంబంధిత కళాశాలలన్నీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళా శాలలుగా మారిపోయాయి. ఉదాహరణకు బీఏ, బీకాం వంటి డిగ్రీ కోర్సులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏడాదికి రూ.3,447లను నిర్ధారించగా, అదే ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో రూ.12 వేలుగా ఉంది. ఇక బీఎస్సీ కోర్సు చదవాలంటే ఏడాదికి రూ.3,697లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉండగా, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో మాత్రం రూ.16 వేలుగా ఉందని కళాశాల అధికార వర్గాలు వెల్లడించాయి. ఫీజులు తక్కువగా ఉండడంతో పాటు, అర్హత కలిగిన విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్సుమెంటు, విద్యా దీవెన పథకం కింద ఏడాదికి రూ.20 వేలు, తదితర ప్రయోజనాల వల్ల ఈ ఏడాది ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు.

 

ప్రవేశాలకు గడువు పొడిగింపు

డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలూరు

డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించారు. ఇదే సమయంలో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు కూడా ఇచ్చుకోవచ్చు. తరగతులు అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అన్‌ఎయిడెడ్‌ కళాశాలల కంటే ఫీజులు తక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కళాశాలకు ‘నాక్‌’ అక్రిడిటేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు విద్యార్థులు ఇంటర్‌ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు వస్తే ఉచితంగానే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.