సీపీ తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి

ABN , First Publish Date - 2022-01-23T05:27:28+05:30 IST

సీపీ తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి

సీపీ తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి

హనుమకొండ క్రైం, జనవరి 22 : వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తరుణ్‌జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆయన.. వివిధ హోదాల్లో పనిచేశారు. 2021 ఏప్రిల్‌ 7వ తేదీన వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా హైదరాబాద్‌ నుంచి బదిలీపై వచ్చారు. హరియానా రాష్ట్రానికి చెందిన జోషి.. డెంటల్‌ డాక్టర్‌గా చదువు పూర్తిచేసి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సివిల్స్‌ రాసి ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత గోదావరిఖని ఏఎస్పీగా, ఆదిలాబాద్‌ జిల్లా ఓఎస్డీగా సేవలందించారు. 2009, 2010 సంవత్సరంలో వరంగల్‌ ఓఎస్డీగా పని చేశారు. అలాగే వైజాగ్‌ రూరల్‌ ఎస్పీగా, తర్వాత గ్రేహౌండ్స్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీగా పనిచేశారు. 2020లో డీఐజీగా పదోన్నతి పొంది, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచి జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం తరుణ్‌జోషి వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన జోషిని కమిషనరేట్‌ పోలీసు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఐజీని కలిసిన వారిలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, పుష్ప, అడిషనల్‌ డీసీపీలు సాయిచైతన్య, వైభవ్‌ గైక్వాడ్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి పంకజ్‌తో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 



 

Updated Date - 2022-01-23T05:27:28+05:30 IST