Abn logo
Oct 13 2021 @ 00:03AM

అంతకు మించిన పొగడ్త ఏముంటుంది!

కాస్త బొద్దుగా ఉంటే అదేదో వింతలా చూస్తారు కొందరు. కానీ పైకి కనిపించే ఆకారమే సమస్తం కాదంటోంది పూజా మూర్తి. ‘గుండమ్మ’గా బరువైన పాత్రలో మెప్పించి... లావుగా ఉండే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపిన ఈ బుల్లితెర నటి ‘కథ’ ‘నవ్య’కు ప్రత్యేకం... 


నటనంటే తెలియని రోజుల్లో నటినయ్యాను. ఎల్‌కేజీలో ఉండగా ఓ కన్నడ సీరియల్‌తో మొదలైంది నా ఈ ప్రయాణం. అక్కడితో ఆగిపోలేదు. బాల నటిగా చాలా సీరియల్స్‌ చేశా. ఏడో తరగతికి వచ్చే వరకు నటిస్తూనే ఉన్నా. అయితే హైస్కూల్‌ కదా! చదువు మీద శ్రద్ధ పెట్టాలని బ్రేక్‌ తీసుకున్నా. పీయూసీ పూర్తయింది. డిగ్రీలో చేరా. ఏడేళ్ల కిందట... అంటే బీకాం ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా ఓ అవకాశం తలుపు తట్టింది. కన్నడ సీరియల్‌ ‘మిలన’లో కథానాయకి పాత్ర. అదీకాకుండా అన్నేళ్ల విరామం తరువాత వచ్చిన ఆఫర్‌. కాదనలేకపోయా. అలా మళ్లీ ఎంట్రీ ఇచ్చాను. 

మధ్యలో ఉద్యోగం... 

‘మిలన’ తరువాత మరో నాలుగైదు కన్నడ సీరియల్స్‌లో నటించాను. అంతా బానే సాగిపోతుందనుకున్న సమయంలో ఊహించని బ్రేక్‌. నేను కొంచెం లావు అవ్వడం వల్ల ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. బాధనిపించింది. అలాగని దిగులుపడుతూ కూర్చోలేదు. ఉద్యోగంలో చేరాను. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా! వాస్తవానికి మాది కర్ణాటకలోని కోలార్‌. నేను అక్కడే పుట్టాను. తరువాత బెంగళూరు వచ్చి స్థిరపడ్డాం. 


స్నేహితురాలి ద్వారా... 

ఉద్యోగంలో రెండేళ్లు భారంగా గడిచాయి. మంచి కొలువు. జీవితానికి ఢోకా ఏంలేదు కానీ ఏ మూలో చిన్న వెలితి. నా బాల్యమంతా కెమెరాల ముందే సాగింది. ఊహ తెలిసినప్పటి నుంచి పరిశ్రమతో అనుబంధం. ఆ సమయంలో నా స్నేహితురాలి ద్వారా ‘జీ తెలుగు’ వారి ‘గుండమ్మ కథ’ సీరియల్‌కు ఆఫర్‌ వచ్చింది. తనది హైదరాబాద్‌. ఓ టీవీ చానల్‌లో పని చేస్తోంది. సీరియల్‌లో నాదే ప్రధాన పాత్ర కావడంతో ఒప్పుకున్నాను. ఇది మొదలై మూడున్నరేళ్లయింది. అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. 


నన్ను నిలబెట్టింది...  

‘గుండమ్మ కథ’లో ‘గీత’ ఉరఫ్‌ ‘గుండమ్మ’ పాత్ర నాది. పూర్తి స్థాయి కుటుంబ కథ ఇది. ఒక లావుగా ఉండే అమ్మాయికి ఈ సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటినే కాకుండా కుటుంబంలోని సమస్యలను కూడా తెలివిగా ఆ అమ్మాయి ఎలా పరిష్కరించుకొంటుందన్నదే కథ. ఆ యువతే ‘గుండమ్మ’. కన్నడలో నాలుగైదు సీరియల్స్‌ చేసినా... నాకంటూ ఒక గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ కేరెక్టరే. సామాజిక మాధ్యమాల ద్వారా వేల మంది ప్రేక్షకులు ‘బాగా చేస్తున్నారం’టూ అభినందనలు తెలుపుతుంటారు. అవన్నీ చూసినప్పుడు నా ఆనందానికి హద్దులుండవు. 


ఇంకేం కావాలి..! 

నటనకు సంబంధించి అభినందనలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటి కంటే నాకు బాగా కిక్కు ఇచ్చింది, గర్వంగా అనిపించింది మాత్రం బయట కొన్ని ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు... ‘‘గుండమ్మ’ను చూసి స్ఫూర్తి పొందామ’ని చాలామంది చెప్పడం! ముఖ్యంగా లావుగా ఉన్న అమ్మాయిలైతే... ‘మీ పాత్ర మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అన్నారు. అంతకు మించిన పొగడ్త ఉంటుందా! కాస్త లావుగా ఉంటే చాలు... అలాంటి వాళ్లను చూసి ఏవేవో మాట్లాడుతుంటారు. ఆకారం ఒక్కటే ముఖ్యం కాదు కదా! 


అలాంటివేమీ లేవు... 

నేను... నా కెరీర్‌... ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. లక్ష్యాలు, కలలు లాంటివేవీ లేవు. ప్రస్తుతం పోషిస్తున్న ‘గుండమ్మ’ చాలెంజింగ్‌ రోల్‌. ప్రేక్షకులు మెచ్చిన రోల్‌. భవిష్యత్తులో కూడా ఇలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనేది నా కోరిక. అలాగని ఇదే చేయాలని కూర్చోను. కథాబలమున్న ఏ పాత్రయినా ఓకే. 


అమ్మానాన్నలతోనే... 

నాకు ఖాళీ దొరికితే బెంగళూరు వెళ్లిపోతా. అమ్మా నాన్నలతో గడుపుతాను. నాన్న సివిల్‌ కాంట్రాక్టర్‌. అమ్మ కొవిడ్‌ ముందు వరకు ఓ కంపెనీలో మేనేజర్‌గా చేసింది. నేనొక్కదాన్నే సంతానం. మిగతా రంగాలతో పోలిస్తే నేనున్న పరిశ్రమ భిన్నమైనది. ఆడపిల్లను ఇటు వైపు పంపించాలంటే పెద్దవాళ్లు జంకుతారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. తొలినాళ్ల నుంచి నాతో కలిసి ప్రయాణిస్తున్నవారున్నారు. అలాగే ఇప్పుడు కలిసి పని చేస్తున్న టీమ్‌లో ఎవరు ఎలాంటి వారో, ఎలా ఉంటారో అమ్మావాళ్లకు తెలుసు. ఇక భయపడాల్సింది ఏముంటుంది! 

 హనుమా 


ఇంట్లో తెలుగే...

తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నావని అడుగుతుంటారు. మేం కన్నడవాళ్లమైనా మా ఇంట్లో మాట్లాడేది తెలుగులోనే. చూసేది కూడా తెలుగు సినిమాలే. అమ్మావాళ్లయితే టీవీల్లో వచ్చే ఏ తెలుగు సినిమానీ వదిలిపెట్టరు. నాకు హర్రర్‌ సినిమాల పిచ్చి. థియేటర్‌కు వెళితే అవి తప్ప వేరేవి చూడను. కోలార్‌లో అత్యధికులు తెలుగులోనే మాట్లాడతారు. అన్నట్టు నాకు తమిళం కూడా వచ్చు. 


పర్సనల్‌ టచ్‌

ఇష్టమైన నటులంటూ ఎవరూ లేరు 

స్కూల్‌, కాలేజీల్లో త్రోబాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌... అన్నీ ఆడేది. 

భరతనాట్యం అదరగొడుతుంది 

హర్రర్‌ మూవీస్‌ బాగా చూస్తుంది 

అమ్మ, స్నేహితులతో బయటకు వెళ్లడం... మ్యూజిక్‌ వినడం... ఇవే హాబీలు.