ఏడాదిలో ఎంత తేడా!

ABN , First Publish Date - 2021-04-30T06:04:46+05:30 IST

మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కోవిడ్‌ ఆసుపత్రులుగా మారిపోయాయి. కోవిడ్‌ కేంద్రాలన్నీ ఒక్కటొక్కటీ తలుపులు తెరుచుకున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులు కూడా కోవిడ్‌ వార్డులు పెంచాయి. అయినా వైరస్‌ విజృంభణ తగ్గడంలేదు. కరోనా జ్వరాలతో కుటుంబాలకు కుటుంబాలు అల్లాడుతున్నాయి.

ఏడాదిలో ఎంత తేడా!

వైరస్‌ విజృంభిస్తోంది,  మరణాలు పెరుగుతున్నాయి, పరిస్థితలు చేతులు దాటుతున్నాయి

 అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం,  భయం వదిలేసి తిరుగుతున్న జనం


తిరుపతి, చిత్తూరు- ఆంధ్రజ్యోతి

మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కోవిడ్‌ ఆసుపత్రులుగా మారిపోయాయి. కోవిడ్‌ కేంద్రాలన్నీ ఒక్కటొక్కటీ తలుపులు తెరుచుకున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులు కూడా కోవిడ్‌ వార్డులు పెంచాయి. అయినా వైరస్‌ విజృంభణ తగ్గడంలేదు. కరోనా జ్వరాలతో కుటుంబాలకు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఆక్సిజన్‌ కొతర, రెమిడెసీవర్‌ మందుల కొరత, బెడ్‌ల కొరత... పరిస్థితి తీవ్రం అయితే వైద్యం అందదనే భయం జనంలో వైరస్‌ కన్నా వేగంగా వ్యాపిస్తోంది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ జూలు విదుల్చుకుని విరుచుకుపడుతున్న వైరస్‌తో పోరాటంలో తేడా కనిపిస్తోంది. కరోనా పట్ల తొలినుంచీ పాలకపెద్దలకు ఉన్న తేలికభావం, నిర్లక్ష్యం కింది దాకా వ్యాపించింది. అదే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.  ఏడాది కిందట వైరస్‌ వ్యాప్తి మొదలైనపుడు ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, ప్రజలు వ్యవహరించిన తీరుకీ, కరోనా రెండో అల విరుచుకుపడ్డ ప్రస్తుతకాలంలో అనుసరిస్తున్న తీరుకీ ఉన్న తేడా గమనిస్తే చాలు...వైరస్‌ విచ్చలవిడి బీభత్సం ఎందుకు సృష్టిస్తోందో అర్థం అయిపోతుంది. కరోనాను ఎదుర్కోవడానికి ప్రజల్ని అప్రమత్తం చేసిన నాయకులు, కట్టడి కోసం రాత్రింబవళ్లు శ్రమించిన అధికార యంత్రాంగం, ఈ హెచ్చరికలతో గడప దాటని ప్రజలు...ఇప్పుడివన్నీ ఎందుకు లేవని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. పోల్చుకుని ప్రభుత్వం తీరుపై అసంతృప్తి పెంచుకుంటున్నారు.  

 

ఇదీ తేడా..ఇలా ఉంటే కరోనా వ్యాపించదా? 


 2020 ఏప్రిల్‌: పూర్తి  స్థాయిలో లాక్‌డౌన్‌ అమలైంది

- 2021 ఏప్రిల్‌ : పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయం మేరకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉంది


 2020: కరోన కేసు ఒకటి   నమోదైనా మూడు కిలో మీటర్ల వరకు రెడ్‌జోన్‌ విధించేవారు. 

 2021: ప్రస్తుతం రెడ్‌జోన్‌ అనే మాటే వినిపించడం లేదు.


2020: పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే, ఆ ఇంటి పరిసరాలను ముట్టడించేవారు.  క్రిమిసంహారక ద్రావణం స్ర్పే చేసేవారు. వీధంతా బ్లీచింగ్‌ చల్లేవారు. చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేసేవారు. పాజిటివ్‌ వచ్చిన వారిని పీపీఈ సూట్‌ వేసి అంబులెన్స్‌లో తరలించేవారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటే నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని వార్డు వలంటీర్‌, వైద్య ఉద్యోగి పర్యవేక్షించేవారు. 

2021: పాజిటివ్‌ అయిన వ్యక్తి పక్కింటివాళ్లకు సమాచారం కూడా తెలియడం లేదు. పాజిటివ్‌ అయిన వాళ్లు ఆసుపత్రుల కోసం వెతుక్కుంటున్నారు. పారిశుధ్యం గాలి కొదిలేశారు. వార్డు వలంటీర్‌లు పూర్తిగా పట్టించుకోవడం లేదు. చుట్టు పక్కల ప్రజలకు సమాచారం ఇచ్చి హెచ్చరించే దిక్కు కూడా లేదు.  


విమానాలు, ఆర్టీసీ బస్సులు, అన్ని రకాల ప్రైవేటు వాహనాల సర్వీసులు రద్దు చేశారు.

  2021  విమానాలు నడుస్తున్నాయి. రైళ్లు తిరుగుతున్నాయి. బస్సులు యథాతథంగా ఉన్నాయి. కాకపోతే సీటింగ్‌ లో భౌతిక దూరం పాటించాలని మాత్రమే చెబుతున్నారు.   



2020 అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కొద్దిరోజులకి ఆన్‌లైన్‌లో మాత్రమే విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు.  

 2021 :వారం కిందట నుంచి మాత్రమే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సెలవులిచ్చారు. భయపడుతున్నా సరే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. వారికి  తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. 


2020: సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు, కళ్యాణ మండపాలు వంటివన్నీ మూతపడ్డాయి.

- 2021 వారం రోజులుగా సినిమా హాళ్లు మూత పడ్డాయి. కళ్యాణ మండపాలు నడుస్తున్నాయి.


 2020: ప్రైవేటు ఆస్పత్రులు పూర్తిగా మూత వేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యవసర సేవలకే అనుమతిచ్చారు. వీటిని మొత్తం కోవిడ్‌ కే కేటాయించారు.

- 2021: ప్రస్తుతం అన్ని రకాల ఆస్పత్రులూ నడుస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్‌ వార్డులు మాత్రమే తెరిచారు. 


2020: లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించేవారు. లాఠీలతో విరుచుకుపడేవారు. దన్నంపెట్టి బతిమాలేవారు. ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ దాకా ప్రజల ప్రాణాలు కాపాడడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించారు. 

- 2021 : ఎన్నికల పేరుతో ప్రచార జాతర్లూ, ఆలయాలకు భక్తులు, బడులు, కాలేజీలు, పాక్షిక ఆంక్షలతో దుకాణాలు నడుస్తుండడంతో పోలీసులు కూడా నిస్సహాయంగా ఉండిపోయారు. మాస్క్‌ పెట్టుకోండి అని అక్కడక్కడా హెచ్చరించడం మినహా పెద్దగా పట్టించుకోవడం లేదు. 


 2020: ఆలయాలు, మసీదులు, చ ర్చీలు వంటి ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మూతపడ్డాయి.

- 2021: ప్రస్తుతం అన్నీ నడుస్తున్నాయి. ఆంక్షలు లేవు.


2020:, రెస్టారెంట్లు, హోటళ్లు వంటివన్నీ మూతపడ్డాయి.

- 2021: మధ్యాహ్నం రెండింటి దాకా హోటళ్లు నడుస్తున్నాయి. ఆ తర్వాత రాత్రి పది దాకా పార్శిల్‌ సర్వీస్‌ అందుబాటులో ఉంది.


2020: మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడ్డాయి.

- 2021: ప్రస్తుతం మంచినీళ్లు దొరక్కపోయినా మందుకు డోకా లేదు. ప్రభుత్వమే  రాత్రి 8 దాకా మద్యం దుకాణాలు నడుపుతోంది.  స్థానిక సంస్థల పాక్షిక ఆంక్షలు వీటికి మాత్రం లేవు. 

 2020: బ్యాంకులన్నీ పూర్తిగా మూతపడ్డాయి

- 2021: ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తున్నాయి.


2020: ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేవారు. పగలూ, రాత్రీ పట్టణాలు, నగరాలు ఎడారులను తలపించేవి. 

- 2021: రాత్రి కర్ఫ్యూ విధించినా పెద్దగా ఆంక్షలు లేవు. యధేచ్చగా ప్రజలు తిరుగుతున్నారు.


 

కేసులు పెరుగుతున్నా లెక్కలేదు


జిల్లాలో గతేడాది మార్చి చివరి వారంలో తొలి కరోనా కేసు నమోదైంది. తరువాతి నెలలో మొత్తం 30 రోజులకు గానూ 18 రోజుల పాటు కరోనా కేసులు నమోదయ్యాయి. అవి కూడా రోజువారీ సగటున కనిష్టంగా ఒకటి నుంచీ గరిష్టంగా 7 కేసులు చొప్పున. కేవలం రెండు రోజుల పాటు మాత్రమే ఒకరోజు 14, మరో రోజు 25 వంతున నమోదయ్యాయి.ఆ నెలంతా కలిపి అధికార యంత్రాంగం గుర్తించిన కరోనా పాజిటివ్‌ కేసుల మొత్తం సంఖ్య 80 మాత్రమే. మరణాల విషయానికొస్తే ఒక్కటి కూడా నమోదవలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ విషయానికొస్తే నెల ముగియడానికి ఒక రోజు వ్యవధి మిగిలి వుండగానే 25434 కరోనా కేసులు నమోదయ్యాయి. నెలలో కేసులు నమోదు కాని రోజంటూ లేదు. రోజువారీ కేసుల సంఖ్య చూస్తే కనిష్టంగా 190, గరిష్టంగా 1982 చొప్పున నమోదయ్యాయి. 11 రోజుల పాటు వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఇందులో మూడు రోజుల పాటు 2 వేలకు చేరువగా కేసులు వచ్చాయి. ఇక మరణాల విషయానికొస్తే 29 రోజుల వ్యవధిలో 103 మరణాలు సంభవించాయి. ఇందులో ఒకరోజు మినహా మిగిలిన అన్ని రోజులూ మరణాలు నమోదయ్యాయి. రోజువారీ చూస్తే కనిష్టంగా ఒక మరణం సంభవించగా గరిష్టంగా ఆరు మరణాలను గుర్తించారు. మొత్తంమీద ఈ నెలలో 10 రోజుల పాటు ఐదు, అంతకు మించి మరణాలు నమోదయ్యాయి.

Updated Date - 2021-04-30T06:04:46+05:30 IST