ఏ‘కరువు’!

ABN , First Publish Date - 2021-09-06T03:54:28+05:30 IST

ఏ‘కరువు’!

ఏ‘కరువు’!
నందిగాం మండలంలో ఉబాలు కాని ప్రాంతం

- టెక్కలి డివిజన్‌లో ఐదు మండలాల్లో దయనీయం

- మిగతా మండలాల్లోనూ అంతంతమాత్రమే ఉబాలు

(టెక్కలి)

ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలకు సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండడంతో వరినాట్లు ఆలస్యంగా పడ్డాయి. ఇప్పటికీ పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో కరువుఛాయలు కమ్ముకుంటున్నాయి. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లోని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రస్తుతం సగం కూడా ఉబాలు పూర్తికాని పరిస్థితి నెలకొంది. టెక్కలి నియోజకవర్గంలో వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలో పర్వాలేకున్నా.. మిగతా ఆయకట్టు దయనీయ పరిస్థితిలో ఉంది. దీనికితోడు తీక్షణమైన ఎండతో ఉబాలు పూర్తయిన పొలాలు, ఎద మడులు ఎండిపోతున్నాయి. ఇచ్ఛాపురంలో 3,616 ఎకరాలకుగాను 1,714 ఎకరాల్లో ఉభాలు పూర్తయ్యాయి. కంచిలిలో 4,873 ఎకరాలకుగాను 1,230, సోంపేటలో 4,446 ఎకరాలకుగాను 1,050, కవిటిలో 1,608 ఎకరాలకు 1,108 ఎకరాల్లో పూర్తయ్యాయి. మందసలో 6,283 ఎకరాలకుగాను 2,669 ఎకరాలు, పలాసలో 5,041 ఎకరాలకుగాను 2,028, వజ్రపుకొత్తూరులో 2,867 ఎకరాలకుగాను 1,593, కోటబొమ్మాళిలో 7,010 ఎకరాలకుగాను 6,398 ఎకరాల్లో ఉభాలు పూర్తయ్యాయి. సంతబొమ్మాళిలో 8,135 ఎకరాలకుగాను 6,237, టెక్కలిలో 7,194 ఎకరాలకు 6,696, నందిగాంలో 8,064 ఎకరాలకుగాను 7,126 ఎకరాల్లో ఉభాలు పూర్తయ్యాయి. నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకపోతే ఇప్పటికే ఉబాలు పూర్తయిన పొలాలు ఎండిపోతాయి. వరి ఆకుమడులు పనికిరాకుండా పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నమోదులోనూ స్థిరీకరణ అంటూ ఏదీ లేదు. మండలంలో ఒక ప్రాంతంలో వర్షం పడితే..ఇంకో ప్రాంతంలో కురవని పరిస్థితి. వజ్రపుకొత్తూరు మండలంలో 51శాతం, కవిటి మండలంలో 42శాతం, నందిగాం 40శాతం, మందస 33శాతం, సోంపేట 28 శాతం వర్షపాతం లోటు కొనసాగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయమై పలాస సబ్‌ డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్‌వీ మధు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రైతులకు స్వల్పకాలిక పంటకు సంబంధించి విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 

 

ఎన్నడూలేని వ్య(ఎ)ధ!

(పలాస)

‘సంప్రదాయ రీతిలో ఉభాలు వేసుకునేవాళ్లం. అధికారుల సలహాతో ఎదలు చల్లుకున్నాం. ఇప్పుడు వర్షాలు లేవు. పెట్టుబడులు చూస్తే పెరిగాయి’..అంటూ పలాస, వజ్రపుకొత్తూరు మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస మండలంలో 12,600 ఎకరాల్లో వరి సాగు చేయడానికి రైతులు సమాయత్తమయ్యారు. ఎన్నడూ లేనంతగా 6 వేల ఎకరాల్లో ఎదలు చల్లారు. సాధారణంగా ఎదలకు ముందే పొలాలను సిద్ధం చేయాలి. గట్లు వేసి.. చదును చేయాలి. ఇది రైతుకు ముందస్తు పెట్టుబడే. అదే ఉభాలైతే వర్షాలు పడితేనే   దమ్ము చేసేవారు. గట్లు, ఇతరత్రా పనులకు ఉపక్రమిస్తారు. దీంతో ఈ ఏడాది ఎదల రూపంలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. ఖర్చు పెట్టిన తరువాత వరుణుడు ముఖం చాటేశాడు. పోనీ వంశధార జలాలు ఆదుకుంటాయంటే శివారు ఆయకట్టుకు రాని పరిస్థితి. జూలై 8న గొట్టా బ్యారేజీ వద్ద ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీరు విడిచిపెడితే ఆగస్టు చివరి నాటికి కొద్దిపాటి నీరు పలాస, వజ్రపుకొత్తూరు పరిధిలోకి చేరింది. వరదలు వచ్చినప్పుడు మాత్రం పుష్కలంగా నీరు చేరుతోంది. వర్షాలు లేనప్పుడు చుక్కనీరు ఉండని పరిస్థితి. ఒకటి, రెండు రోజుల్లో వర్షాలు పడకుంటే పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలాస మండల వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా రైతులకు పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించామని చెప్పారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. 


50  శాతమే వరినాట్లు

మెళియాపుట్టి : మెళియాపుట్టి మండలంలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే వరినాట్లు పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారు ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాలకు అవసరమైన సాగునీరు ఎత్తిపోతల పథకాల ద్వారా అందకపోవడంతో నాట్లు వేయలేకపోయామని వాపోతున్నారు. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.  

 

Updated Date - 2021-09-06T03:54:28+05:30 IST