కిడ్నాప్‌కు కారణమైన హఫీజ్‌పేట భూముల్లో చిక్కుముడులెన్నో!

ABN , First Publish Date - 2021-01-10T07:18:40+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నా్‌పకు కారణమైన హఫీజ్‌పేట భూములు అసలు ఎవరివి....

కిడ్నాప్‌కు కారణమైన హఫీజ్‌పేట భూముల్లో చిక్కుముడులెన్నో!

  • 2006లోనే భూములు కొనుగోలు చేసిన భూమా కుటుంబం
  • నాలుగు డాక్యుమెంట్ల ద్వారా 66 ఎకరాల కొనుగోలు
  • మొత్తం 31 మంది భాగస్వాముల్లో ఏవీ సుబ్బారెడ్డి ఒకరు
  • 2008లో ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఇతరులకు జీపీఏ
  • ఆ తర్వాత రికార్డుల్లో నమోదు కాని భూ లావాదేవీలు
  • 2016లో ప్రవీణ్‌ కొన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు


(ఆంధ్రజ్యోతి - రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): బోయిన్‌పల్లి కిడ్నా్‌పకు కారణమైన హఫీజ్‌పేట భూములు అసలు ఎవరివి!? అక్కడి భూములను భూమా నాగిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిందా!? వారి నుంచి ప్రవీణ్‌ కుమార్‌ కుటుంబం కొన్నదా!? జీపీఏ చేసుకుందా!? అసలు ఈ భూములు ఎవరెవరి మధ్య చేతులు మారాయి!? కిడ్నాప్‌ ఘటన జరిగి ఆరు రోజులు కావస్తున్నా వీడని చిక్కు ప్రశ్నలివి. హఫీజ్‌పేటలోని 50 ఎకరాలు తమవేనని భూమా నాగిరెడ్డి తనయుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి చెబుతున్నారు. ఈ భూముల్లో 25 ఎకరాలను 2016లో ఏవీ సుబ్బారెడ్డి నుంచి ప్రవీణ్‌ కుమార్‌ కొనుగోలు చేశారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సుబ్బారెడ్డికి డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకున్నారనీ వివరించారు. దాంతో, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఏ-1 నిందితురాలిగా ఉన్న ఈ వ్యవహారం పీటముడి పడుతోంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభ్యమయ్యాయి. ప్రభుత్వం తమదిగా చెప్పుకొంటున్న హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని భూమిలో ఎప్పటి నుంచో ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తూనే ఉన్నారు. నిషేధిత జాబితాలో ఉంచినా.. రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలా చేతులు మారిన భూములను 2006లో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు కొనుగోలు చేశారు. పాయ్‌గా వారసులు, కొందరు స్థానికుల నుంచి 4  దఫాలుగా భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


4 డాక్యుమెంట్లు రూ.19.8 కోట్లు

వివాదాస్పద హఫీజ్‌పేట సర్వే నంబరు 80లోని 66 ఎకరాలను భూమా వర్గీయులు 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. 4 డాక్యుమెంట్ల ద్వారా ఈ భూములను కొనుగోలు చేశారు. భూమా నాగిరెడ్డి అన్న కుమారులు భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా జగన్నాథ్‌ రెడ్డి, భూమా కిశోర్‌ రెడ్డితోపాటు మరో 28 మంది పేర్లతో ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే జరిగాయి. తొలుత, భూమా కిశోర్‌ రెడ్డి, ఎ.సుబ్బారెడ్డి, మరో 8 మంది కలిసి 18-02-2006న 18 ఎకరాల భూమిని పి.నర్సింహ, విఠలయ్య తదితరుల నుంచి కొనుగోలు చేసి డాక్యుమెంట్‌ నంబరు 3733/2006 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ సేల్‌ డీడ్‌లో తప్పులు దొర్లడంతో ర్యాటిఫికేషన్‌ చేసి మళ్లీ 28-02-2006న డాక్యుమెంట్‌ 4424/2006 ద్వారా సప్లిమెంటరీ డీడ్‌ చేసుకున్నారు. తర్వాత, భూమా కిశోర్‌ రెడ్డి, మరో 9 మంది కలిసి 19-04-2006న మరో 18 ఎకరాలు (డాక్యుమెంట్‌ నంబరు 9233/2006) కొనుగోలు చేశారు. భూమా జగన్నాథ రెడ్డి, మరో 8 మంది కలిసి 19-04-2006న ఇదే సర్వే నంబరులో 15 ఎకరాలను మహ్మద్‌ అజీమ్‌, నీలం సత్తెయ్య తదితరుల నుంచి (డాక్యుమెంట్‌ నంబరు 9234/2006) కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. జగన్నాథ రెడ్డి, మరో 8 మంది కలిసి 19-04-2006న మరో 15 ఎకరాల భూమిని డాక్యుమెంట్‌ నంబరు 9235/2006 ద్వారా కొనుగోలు చేశారు. చివరిగా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రెండు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు రావడంతో నాలుగు నెలలపాటు పెండింగ్‌లో పెట్టి తర్వాత నంబరు ఇచ్చారు. భూముల కొనుగోళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ప్రకారం 66ఎకరాలకు రూ.19.8 కోట్లు భూమా కుటుంబీకులు చెల్లించినట్లు నమోదైంది. ఈ భూములన్నింటికీ ఉత్తరాన రైల్వే ట్రాక్‌, దక్షిణాన సర్వే నంబరు 86, 87 ఉన్నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.


2008లోనే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి జీపీఏ

భూమా కుటుంబం కొనుగోలు చేసిన ఈ భూములను 2008లోనే ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి జీపీఏ ఇచ్చేసినట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డుల్లో నమోదైంది. భూమా జగన్నాథ రెడ్డి, మరో 30 మంది కలిసి 15-07-2008న 47 ఎకరాల భూమిని ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి జీపీఏ (డాక్యుమెంట్‌ 5146/2008) రిజిస్ట్రేషన్‌ చేశారు. భూమా జగన్నాథ రెడ్డి, మరో 30 మంది కలిసి ఇదే తేదీన మరో 25 ఎకరాలను ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, సీవీఎస్‌ రాజారామ్‌, పి. రెడ్డి గంగా రవీందర్‌ కుమార్‌లకుఅగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జీపీఏ (డాక్యుమెంట్‌ 5147/2008) రిజిస్ట్రేషన్‌ చేశారు.


మరి వివాదం ఏమిటి?

హఫీజ్‌పేటలో తాము 2006లో కొన్న భూమిని భూమా కుటుంబం 2008లో జీపీఏ ఇచ్చింది. ఆ తర్వాత ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కానీ సీవీఎస్‌ రాజారామ్‌, పి. రెడ్డి గంగా రవీందర్‌ కుమార్‌ నుంచి కానీ ఈ భూములు చేతులు మారినట్లు రికార్డుల్లో నమోదు కాలేదు. అలాంటప్పుడు ఈ భూములపై పేచీ ఎందుకు వచ్చింది? 12 ఏళ్ల తర్వాత వివాదం రావడానికి కారణం ఏమిటి? ఒకవేళ పేచీ వచ్చినా ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లేదా సీవీఎస్‌ రాజారామ్‌, పి. రెడ్డి గంగా రవీందర్‌ కుమార్‌లతో భూమా కుటుంబానికి వివాదం వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రవీణ్‌ రావుతో భూమ కుటుంబానికి ఎందుకు.. ఎలా వివాదం వచ్చిందన్న అంశం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. నిజానికి, ఆ భూములను కొనుగోలు చేసిన వారిలో ఏవీ సుబ్బారెడ్డి కూడా ఒకరు. ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రవీణ్‌ ఈ భూములు కొనుగోలు చేశారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసిన భాగస్వాముల్లో ఒకరుగా ఉన్నా.. సుబ్బారెడ్డి నేరుగా ఈ భూములను విక్రయించలేరు. ఇందుకు కారణం.. 2008లోనే జీపీఏ ఇచ్చేయడమే. కానీ, జీపీఏను రద్దు చేసినట్లు రికార్డులు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఒకవేళ, జీపీఏను రద్దు చేసినా పదిమంది భాగస్వాముల్లో ఒకరుగా ఉన్న సుబ్బారెడ్డి ఒక్కరూ కూడా భూములను విక్రయించడానికి ఆస్కా రం ఉండదు. ఈ నేపథ్యంలోనే, అసలు ఈ వివాదంలో ప్రవీణ్‌ కుమార్‌ పాత్ర ఏమిటి?  సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి? జీపీఏ తీసుకున్నవారు ఏమయ్యారు!? రికార్డుల ప్రకారం ఆ భూములు ఎవరి పేరున ఉన్నాయి? అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. 

Updated Date - 2021-01-10T07:18:40+05:30 IST