కాగ్‌కే తప్పుడు లెక్కలు!

ABN , First Publish Date - 2020-11-23T07:56:32+05:30 IST

ఇచ్చింది సగం జీతమే.. కానీ లెక్కల్లో మాత్రం పూర్తిజీతం ఇచ్చినట్లు చూపించారు. అంటే మిగతా సగం జీతాల మొత్తం వేరే అవసరాలకు వాడేశారా..

కాగ్‌కే తప్పుడు లెక్కలు!

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో..

ఉద్యోగులకిచ్చింది సగం జీతమే

కానీ పూర్తిగా చెల్లించామని

ప్రభుత్వ గణాంకాలు

మిగతా సగం వేరేవాటికి వాడేశారా?

లేదంటే లెక్కల్లో పొరపాటా?

ప్రభుత్వ తీరుపై అనుమానాలు


అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇచ్చింది సగం జీతమే.. కానీ లెక్కల్లో మాత్రం పూర్తిజీతం ఇచ్చినట్లు చూపించారు. అంటే మిగతా సగం జీతాల మొత్తం వేరే అవసరాలకు వాడేశారా.. లేక లెక్కల్లో తప్పుదొర్లిందా..? రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న సందేహాలివి. ఉద్యోగులకు చెల్లించిన వేతనాలపై సాక్షాత్తూ రాష్ట్రప్రభుత్వమే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు తప్పుడు లెక్కలు సమర్పించిందన్న ఆరోపణలు వస్తున్నాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంతో ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జగన్‌ ప్రభుత్వం సగం జీతం, సగం పెన్షన్‌ మాత్రమే ఇచ్చింది. మిగతా సగం అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తోంది. దీంతో 12 శాతం వడ్డీతో వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలివ్వడం.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. జనవరి 15లోపు వాటిని చెల్లిస్తే వడ్డీ మాఫీచేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. నిజానికి ఉద్యోగుల జీతాలకు ప్రతి నెలా సుమారు రూ.3,000 కోట్ల నుంచి రూ.3,600 కోట్ల వరకు చెల్లిస్తారు. ఆ నెలలో ఉద్యోగుల హాజరును బట్టి ఇది కొంచెం అటూ ఇటూగా ఉంటుంది.


కొవిడ్‌-19 ప్రారంభమైన అనంతరం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులకు సగం జీతాలే ఇచ్చారు. అంటే పై మొత్తంలో సగమే చెల్లించారు. కాగ్‌ నివేదికలో మాత్రం మార్చిలో రూ.3,032 కోట్లు, ఏప్రిల్‌ నెలలో రూ.3,634.27 కోట్లు ప్రభుత్వం జీతాల రూపంలో చెల్లించినట్లు చూపారు. ఆ రెండు నెలల్లో సగం జీతాలే.. అంటే మార్చిలో రూ.1,516 కోట్లు, ఏప్రిల్‌లో రూ.1,817 కోట్లు ఇచ్చింది. కానీ కాగ్‌ నివేదికలో.. పూర్తి జీతాలు చెల్లిస్తే ఎంతవుతుందో అంతా చూపించారు. సాధారణంగా కాగ్‌ తన నివేదికలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చే లెక్కలనే పొందుపరుస్తుంది. జీతాల విషయంలోనూ అలాగే చేసింది. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం కింద కొందరు కాగ్‌కు దరఖాస్తు చేశారు. జీతాల లెక్కల్లో వచ్చిన తేడాలపై ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం నెలవారీగా అందించే వ్యయం లెక్కల ఆధారంగానే తమ నివేదిక రూపొందించినట్లు కాగ్‌ తెలిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సగం జీతాలే ఇచ్చినా.. పూర్తిగా ఇచ్చినట్లు కాగ్‌కు లెక్కలు పంపింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? జీతాల్లో ఆ సగం మొత్తాన్ని ఇతర బిల్లుల చెల్లింపులకు వాడుకుందా? లేకుంటే పొరపాటుగా నెలవారీ లెక్కల స్టేట్‌మెంట్లు పంపిందా అన్న ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Updated Date - 2020-11-23T07:56:32+05:30 IST