ఏమ్మార్చారు!

ABN , First Publish Date - 2022-01-19T05:08:50+05:30 IST

అది అన్‌సర్వే ల్యాండ్‌. అధికార పార్టీ నేతల కన్ను దానిపై పడింది. మిలటరీ ఉద్యోగికి కేటాయించినట్టు పత్రాలు సృష్టించారు. భారీ ధరకు అమ్మకానికి సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడంతో అధికారులు మౌనాన్ని ఆశ్రయించారు. దీంతో కోట్లాది రూపాయల భూములకు రెక్కలొస్తున్నాయి. ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది? దాని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే.....

ఏమ్మార్చారు!
మిలటరీ భూమిగా చూపుతున్న స్థలం ఇదే..


అన్‌సర్వే ల్యాండ్‌ మిలటరీ భూమిగా మార్పు.

దస్త్రాలు రూపొందించిన ఘనులు

రూ.10 కోట్లు కొల్లగొట్టేందుకు పావులు

రంగంలోకి ఓ కీలక నేత కుటుంబ సభ్యులు

తొలగిన హెచ్చరిక బోర్డులు

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

(పలాస)

అది అన్‌సర్వే ల్యాండ్‌. అధికార పార్టీ నేతల కన్ను దానిపై పడింది. మిలటరీ ఉద్యోగికి కేటాయించినట్టు పత్రాలు సృష్టించారు. భారీ ధరకు అమ్మకానికి సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత కుటుంబ సభ్యులు రంగంలోకి దిగడంతో అధికారులు  మౌనాన్ని ఆశ్రయించారు. దీంతో కోట్లాది రూపాయల భూములకు రెక్కలొస్తున్నాయి. ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది? దాని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే..... పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ పరిధిలోని కోసంగిపురం సమీపంలో జాతీయ రహదారి పక్కన సర్వే నెంబరు 148లో 1,275 ఎకరాల భూమి ఉంది. ఇందులో 428 ఎకరాలు అటవీ శాఖకు అప్పట్లో కేటాయించారు. మెండు ఫారెస్ట్‌ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. మిగిలిన భూమంతా రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఇదే సర్వే నెంబరులో 225 ఎకరాల భూమి అన్‌సర్వే ల్యాండ్‌గా ఉంది. ఆ భూమి తమదంటే తమదని రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నలుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గృహ నిర్మాణం, పారిశ్రామికవాడ వంటివి నిర్మించేందుకు భూములు కావాల్సి ఉండడంతో కొత్తగా సర్వే  చేయాలని నిర్ణయించారు. ఏ శాఖకు ఎంత భూమి అన్నది రికార్డులు తయారుచేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇంతలో అన్‌సర్వే ల్యాండ్‌లో 4.70 ఎకరాల భూమిని గతంలో మిలటరీ ఉద్యోగికి కేటాయించినట్టు ధ్రువపత్రాలను తెరపైకి తెచ్చారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఈ భూమి ధర రూ.10 కోట్లు వరకూ పలుకుతోంది. హైవేకి కూతవేటు దూరంలో ఉండడంతో ఆ భూములకు డిమాండ్‌ ఎక్కువ. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత కుటుంబ సభ్యులు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి...ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది.

 గతంలో ఏం జరిగిందంటే.

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో మిలటరీ ఉద్యోగుల పేరిట దస్త్రాలు అధికారుల ముందుకు వచ్చాయి. దీన్ని సర్వే చేయగా అన్‌సర్వే ల్యాండ్‌లో ఉండడంతో పాటు దీన్ని ఎవరికీ కేటాయించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ భూమి తమదేనంటూ కొందరు చదును చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో అప్పట్లో వచ్చిన కథనాలకు అప్పటి జేసీ చక్రధర్‌బాబు స్పందించారు. ప్రజోపయోగ పనులకు వినియోగించేందుకు, ప్రభుత్వ గృహాలు నిర్మిస్తే ఎంతో బాగుంటుందని అధికారులకు చెప్పి సర్వే చేయించారు. అయితే ఈ భూములు తమవని మందస మండలానికి చెందిన గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అన్‌సర్వే ల్యాండ్‌ కావడంతో దీన్ని ఎవరికీ ఇవ్వబోమని, గిరిజనుల సాగులో ఉంటే మాత్రం వారికే కేటాయిస్తామని అప్పట్లో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో గిరిజనులు సర్వేకే మొగ్గు చూపించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 4.70 ఎకరాల భూమిపై మళ్లీ దస్త్రాలు కదిలాయి. ప్రస్తుతం ఈ భూమి వ్యవహారం జేసీ కోర్టు పరిధిలో ఉందని.. తాము ఏమీ చేయలేమని అఽధికారులు చేతులెత్తేశారు. మరోవైపు భూమి దగ్గర రెవెన్యూ హెచ్చరిక బోర్డులకు బదులు అటవీ భూభాగ హద్దులు వెలియడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తహసీల్దారు మధుసూధనరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... ప్రస్తుతం ఈ భూమి అన్‌సర్వే ల్యాండ్‌లో ఉందని చెప్పారు. ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. గతంలో తమకు కేటాయించారని పత్రాలు కొంతమంది చూపిస్తున్నారని చెప్పారు. మొత్తం రికార్డులు పరిశీలించిన తరువాతే ఆ భూమి ఎవరిదనే విషయం తేలుతుందన్నారు.



Updated Date - 2022-01-19T05:08:50+05:30 IST